ఉపనిషత్తులు బ్రహ్మమునకు కాని, ఈశ్వరునకుగాని, ఎట్టి వ్యత్యాసమును తెలుపుటలేదు. వేదాంత వాక్యములన్నిటి చేత జగత్కారణము చేతన వస్తువే యని తెలిసికొనవలెను. జగత్తు జడమైనదే అయివుండిన ఆకర్షణీయమైవుండుటకు కారణమేమి అని కొందరు శంకింతురు. జడమైనది. ప్రకాశరహితమైనది. అయి వుండిన అది అట్లే పడి యుండవలెను కదా! అట్లు కాదు. అది పరమాత్మ, ఉపాదాన నిమిత్త కారణాలతో,అంతర్భాహ్యములందు వున్నాడు కనుక దీనికి యింత ప్రకాశము, ఆకర్షణ. సిష్టాదిర్గుడ సంపర్కాత్ - సిష్ట అనగా పిండి,అది బియ్యపు పిండి కావచ్చు. గోధుమపిండి కావచ్చు. లేక బేడల పిండి కావచ్చు. ఆ పిండికి యెట్టి రుచిలేకపోయినప్పటికిని, గుడ సంపర్కాత్ గుడ అంటే బెల్లము - ఆ బెల్లము సంపర్కముచేత, రుచిరహితమైన ఆ పిండికి కూడా రుచి యేర్పడుచున్నది. అదే విధముగా ఈ ప్రపంచమున యెక్కడెక్కడ ఆకర్షణ, సౌందర్యము ఉండునో అది అంతయూ పరమాత్మ స్వరూపము కాని వేరు కాదు అని స్పష్టమగుచున్నది. శ్రుతి వాక్య ప్రకారము, ఈ జగత్తును ఆయనే సృష్టించి, ఆయనే పోషించి, ఆయనే లాలించి, ఆయనే పాలించి, కడకు ఆయనయందే లయం చేసికొనుచున్నాడు. జగత్తునకు కర్త, భోక్త, భర్తల పరమాత్మయే అని శ్రుతి చాటుచున్నది.
(సూ.వా.పు.45)