విదేశీయులు పోయిన తరువాత స్వదేశీయులు స్వాతంత్ర్యము పొందినారనుకొన్నాము. ఎందులో స్వాతంత్ర్యమును పొందాము? స్వాతంత్ర్యము అన్నంత మాత్రమున ప్రయోజనము లేదు. ఐక్యతను సాధించినప్పుడే స్వాతంత్ర్యము,ఐక్యతను సాధించక స్వాతంత్ర్య మనుకుంటే మాటల స్వాతంత్ర్యమేగాని జీవి స్వాతంత్ర్యము కాదు. స్వాతంత్ర్యమనేది హృదయస్థానమునండి ఏర్పడాలి. హృదయమంటే ఏమిటి? రక్తమాంసములలో కూడిన గుండెకాయ కాదు. హృదయం ఒక స్థానమునకు గాని ఒక కాలమునకుగాని ఒక వ్యక్తికిగాని ఒక దేశమునకు గాని సంబంధించినది కాదు. సర్వత్ర సర్వకాలములందు సర్వదేశములందు సర్వవ్యక్తులయందు సమత్వముగా వుండే దివ్యతత్త్వమే హృదయము. ఈ హృదయమునకు రూపము లేదు. మానవుని దేహమునందు దేనిని మనము హృదయముగా భావిస్తున్నామో ఆది మధ్యలో వచ్చి మధ్యలో పోయేది. దేనిని గుర్తిస్తే సర్వమును గుర్తించిన వాడౌతాడో అలాంటి దివ్యతత్త్వమును గుర్తించటమే నిజమైన స్వాతంత్ర్యము.
(బృత్ర.పు.142)
నిజమైన స్వాతంత్ర్యము ఎప్పుడు వస్తుంది? ఈ మనస్ప దానిని నిర్మూలము గావించినప్పుడే నిజమైన స్వాతంత్ర్యము వస్తుంది. స్వ అదే ఏకం స్వ+ భావము అది స్వభావము. స్వ+ఇచ్ఛ = స్వేచ్ఛ, స్వ అనగా ఆత్మ కనుక ఆత్మ ఇచ్చనే స్వాతంత్ర్యము. అదే స్వేచ్ఛ. అంతేగాని దేహేంద్రియమనోబుద్ధులతో ఆచరించే కర్మలన్నియు స్వాతంత్ర్యములు కాదు. కొన్ని Law of Nature. ప్రకృతిననుసరించి మనము ఆచరిస్తూనే ఉంటాము. ఇది స్వాతంత్ర్యము కాదు Law of Nature. ఒకటి Rules and Regulations మరొకటి. ఈ రెండింటి మధ్యలోనే మానవజీవితము సాగుతున్నది. అంతేకాని ఎవరికి వారు నేను స్వతంత్రుడను నేను స్వతంత్రుడను అని అనుకోవటానికి వీలులేదు. దివ్యత్వము ఒక్కటి మాత్రమే స్వతంత్రము. దానినీ స్వాతంత్ర్యమని చెప్పటానికి వీలు లేదు. ఉన్నది ఒక్కటే. ఆ పదమునకు అక్కడ స్థానమే లేదు.
(బృత్ర.పు.145)
(చూ|| ఆధ్యాత్మికము, ఆనందము, కర్తవ్యము, కర్త్పర్యము, మనస్సు, సూత్రము)