విద్యార్థులారా! నేను కోరేది ఒక్కటే. మంచి పేరు తెచ్చుకోండి. మీ తల్లి తండ్రులకు, మీరు చదివినఇన్స్షిట్యూట్ కు మంచి పేరు తెప్పించండి. మీకు సహజంగానే మంచి పేరు ప్రాప్తిస్తుంది. కీడుచేయడం గొప్పతనం కాదు. కీడు కీటకమైనా చేస్తుంది. మానవులై పుట్టినందుకు మీరు సమాజానికి మేలు చేయాలి. మీరు దేనికీ భయపడనక్కరలేదు. మీరు భయపడటానికి పశువులు కాదు. భయపెట్టటానికి కౄరమృగములు కాదు. మీరు మానవులు. కనుక మీరు భయపడకూడదు, భయ పెట్టకూడదు. ఈ సత్యాన్ని మీరు గుర్తించి వర్తించినప్పుడే సమాజం కూడా బాగుపడుతుంది. విద్యార్థులారా! మీరు బాగుపడటంతోపాటు మీ స్నేహితులను కూడా ఈ పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి వారిని ధన్యులు చేయడానికి ప్రయత్నిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
(సపా.డి.96 పు.321)