పక్షులు స్వేచ్చగా తిరుగుతున్నాయి. మృగములు స్వేచ్చగా తిరుగుతున్నాయి. అలాంటప్పుడు మానవుడు యెందుకు స్వేచ్చగా చరించరాదు. అని ప్రశ్నిస్తున్నారు. కొంతమందియువకులు నిజమే! నీవు కూడ స్వేచ్ఛను అనుసరించు. కాని పక్షలు యే స్వేచ్ఛను అనుసరిస్తున్నాయి? పక్షి యొక్క స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి. నీవు మానవుడు కాబట్టి మానవ స్వేచ్ఛను అనుభవించు. రాక్షస స్వేచ్ఛను అనుభవించ రాదు. మానవుడని చెప్పుకుంటూ రాక్షస స్వేచ్ఛను అనుభవించటం విరుద్ధమైనట్టిది. నీవు మానవుడుగా సంచరించు. మానవుడుగా సంచరించే సమయములో మానవత్వాన్ని పెంచుకో. త్యాగము నీతి, నిజాయితీ, దయ, కరుణ, ప్రేమ, అహింస ఇలాంటి భావములతో మానవత్వాన్ని పెంచుకోవాలి. కనుక మానవునికి రాకూడనటువంటి గుణములు కోపము, అసూయ స్వార్థము యిలాంటి గుణములు పెంచుకోవటం చేత మృగలక్షణాలను పెంచుకున్నవారు మౌతాము. మానవునియందు ముఖ్యముగా అహంకారము, స్వార్థము, అసూయ, యీమూడు చాలా దుర్మార్గమైన గుణములు అభివృద్ధి అవుతున్నాయి. ఈ మూడింటిని అదుపులో పెట్టుకోవాలను కొన్నపుడు ఆహారమును వాక్కును అదుపులో పెట్టుకోవాలి. యోగమునకు సింహద్వారము జిహ్వ, కనుక యీజిహ్వను ఆహారము చేతను, మాటల చేతను పవిత్రమైన మార్గములో ప్రవేశపెట్టుకోవటము ప్రధానమైన సాధనగా బోధిస్తూ వచ్చింది భక్తియోగము.
(శ్రీ.గీ.పు.57)
పశువులు మృగములు తమ తమ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి. మానవుడు స్వేచ్ఛననుభవించ - నక్కర లేదా? అంటారు. నిజమే నీవు స్వేచ్ఛను అనుభవించు. పక్షులు మృగములు ఏస్వేచ్ఛను అనుభవిస్తున్నాయి? పక్షి స్వేచ్ఛను మృగస్వేచ్ఛను అనుభవిస్తున్నాయి. నీవు మనిషిని మనిషి స్వేచ్ఛననుభవించు. తప్పులేదు. నీవు మనిషివై మృగ స్వేచ్ఛననుభవిస్తే దోషముకాదా! కనుకయీ ఫ్రీడం అనేదానిని పెడర్థములతో అనర్థములతో - నానార్థములతో అభివృద్ధిపరచుకొని యదార్థమునుమరచిపోతున్నాము. ఇది కాదు నిజమైన ఫ్రీడం. ఫ్రీడం ఆంటే ఏమిటి స్వేచ్ఛగా సంచరించటమేనా? ఇంద్రియము లను విచ్చలవిడిగా వదలి పెట్టటమా? కాదు కాదు. ఆత్మజ్ఞానము, ఆత్మనిగ్రహము ఆత్మానందము యిది ఫ్రీడం.
(బృత్ర, పు.52)