ఈ ప్రపంచమందు దైవశాసనముచేత వర్షములు కురియుచున్నవి. పంటలు పండుచున్నవి. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. చంద్రుడు చల్లదనము నందిస్తున్నాడు. నదులు ప్రవహిస్తున్నాయి, ఆనందము నందిస్తున్నాయి. ఇవి ఎవరి సొత్తు? ఇది ప్రాకృత మానవులకందరకు సమానమైన సొత్తే. ప్రాకృత పౌరులందరు దీనిని అనుభవించుటకు అధికారమున్నది. కనుక, అందరూ అనుభవించవచ్చును. ఇది శ్రేయాశక్తి, ప్రేయోశక్తి రెండింటి సంబంధ బాంధవ్యమే. పంట పండించుకోవటము. భుజించటము, శక్తిసామర్థ్యములు పెంచుకోవటము, కర్మమార్గమునందు ప్రవేశించి దేహకర్మలనాచరించటం, ఈ దేహకర్మలు ఆచరించిన తరువాత ఆత్మధర్మముతో ఆనందించటము - విచారణ చేసి చూస్తే అంతా దైవశాసనమేకాని అన్యులు నిర్ణయించునది కాదు. అణువు మొదలు ఘనము వరకు గడ్డిపోచ మొదలుకొని బ్రహ్మాండము వరకు భగవత్ శాసనమువల్లనే జరుగుతున్నవి.
కదలదు నీదు సంకల్పము లేనిదే గడ్డిపోచయును
అదియు, ఇదియు అనగనేల? పిపీలికాది బ్రహ్మపర్యంతమునీవె!
అది ఎఱుంగరు మది గలంగరు భువిని కొందరు
వివేకమున వర్తించెదమని కడు విట్టవీగెదరుగాని
చివరికే వేళ ఏది సంభవించునో తెలయజాలరు ఎంతవారలైన,
(ఆ.భా.పు.87/88)