నేను చేయు పనులు గారడికాదు, మాయకాదు, మంత్రము కాదు; తంత్రము కాదు. ఇది వాస్తవమైన దైవశక్తి. ఈ దివ్యతత్వము అల్పజ్ఞులకు అర్థము కాదు. మాయలో వారి కన్నులు మూయబడి వుండుటచేత భగవత్తత్వమును వారు గుర్తించలేరు. అందుచేత ఈ శక్తిని వారు హేళన చేయుదురు; దూషింతుడు. దైవశక్తికి అతీతమైన దేదీలేదు. ఇది తరుగునవది కాదు. అన్ని శరీరములవలె నేను ధరించిన ఈ శరీరము అశాశ్వతమే అయినప్పటికీ నా సంకల్పమూ నా చర్యలు శాశ్వతములు"
(స. శి.సు. తృ, పు. 167)
రాముడు శివధనుస్సును అవలీలగా ఎత్తగలుటకు కారణమేమిటి? అతడు సాక్షాత్తు నారాయణమూర్తి. అనగా అతనియందు నూటికి నూరుశాతం ఆకర్షణ శక్తి ఉన్నది. అందువల్లనే ఆ బరువును ఎత్తనవసరం లేకుండా అదే తన దగ్గరకు వచ్చేసింది. ఇంక, సీత భూజాత. భూమికి అయస్కాంత శక్తి చాల అధికంగా ఉన్నది. కనుక, సీత కూడా పూర్తి అయస్కాంత శక్తితో నిండియున్నది. దీనిని సైన్సు కూడా అంగీకరించక తప్పదు. అందువల్లనే సీత కూడా శివధనుస్సును సులభంగా ఎత్త గల్గింది. సీతారాములు ఇరువురూ సాక్షాత్తు దైవశక్తులు, ఎక్కడ అయస్కాంత శక్తి ఉంటుందో అక్కడ ఎలెక్ట్రిక్ పవర్ అనేది ఉంటుంది. కనుకనే సీతారాముల తేజస్సు సర్వత్ర వ్యాపించిపోయింది. ఈ తేజస్సు మన దేహములందు కూడా ఉన్నది. కాని, ఒకరియందు ఎక్కువగా మరొకరు యందు తక్కువగా ఉండవచ్చును. సీతారాములందు మాత్రము సర్వశక్తులున్నాయి. కేవలం లోకోద్దారణ నిమిత్తమై మానవాకారము ధరించారు.
(స. సా..జులై 96 పు.189)
(చూ॥ అన్నం, ఆయస్కాంతశక్తి)