భగవంతుడు ఎక్కడున్నాడు. ఏవిధముగా ఉంటాడు? అనే దైవ లక్షణాలను అర్థం చేసుకున్న తర్వాతనే అతని అన్వేషలను మనం ప్రారంభించాలి. అయితే సర్వోపనిషత్తులు, సర్వ వేదాంతములు, వేదములు భగవంతునికి ఆకారమును నిరూపింపక కేవలము వర్ణనలద్వారా మాత్రమే అతనిని సంస్కరించాయి. నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య, శుద్ద, బుద్ధ, ముక్త, నిర్మల స్వరూపిణం అనే పదముల యందుండే అంతరార్ధమేమిటి? ఇట్టి పదములను మనము సులభముగా వల్లిస్తున్నామే కాని పదములకు ఆకారమును నిరూపించలేక పోతున్నాము. పదములు చెప్పుట సులభము. రూపములు నిరూపించుట కష్టము. ఈ పదములకు అంతరార్థాన్ని గుర్తించినప్పుడే ఆత్మ స్వరూపమైన భగవత్తత్వము మనకు అందుబాటులో ఉందన్న సత్యము మనకు అర్థమవుతుంది. అతని స్థానము. అతని మూలము, ఆతని కీలకము, ఆతని గమ్యము మనకు అర్థముకాక ఆట్టి పరతత్వమును మనము అన్వేషించడమంటే కాలమును వ్యర్థము చేయటమే. మంత్రపుష్పము అనేక విధములుగా దైవత్వాన్ని వర్ణిస్తుంది. నారాయణ సూక్తము కూడా ఇదియే. "అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్యనారాయణ స్థితః అని భగవంతుడు లోపల వెలుపల సర్వత్రా ఉంటున్నాడు అనే విలాసమును జగత్తున కందించింది. సర్వత్రా ఉన్న దైవత్వాన్ని అన్వేషణ చేయడమంటే ఎక్కడికి వెళ్ళటం? సర్వత: పాణిపాదం సర్వతోక్షి శిరోముఖం. సర్వతః శ్రుతిమల్లోకే, సర్వమానృత్య తిష్టతి." సర్వత్రా ఉన్న చైతన్యమును, సర్వ వ్యాపకమైన చైతన్యమును, అంతర్బహిర్ తత్వములందు ఇమిడియుండే చైతన్యమును వెలుపలి ప్రదేశమునందు వెదకుటకై మనము ఆరాటపడుతున్నాము. ఇదే ఆ జ్ఞానమునకు ప్రథమ లక్షణము.
(
(స.సా.న.84 పు.293)