ఈనాడు ఒక పార్టీని మరొక పార్టీ విమర్శించుకోవడం, దూషించుకోవడం మితిమీరి పోతున్నది. ఇవన్నీ అల్పబుద్ధి కలవారి లక్షణాలు. చేతనైతే మంచి చేయాలిగాని, ఇంకొక పార్టీని విమర్శించడ మెందుకు? ఇతర పార్టీలో ఏదైనా దోషముందంటే ఆ దోషం మీలో లేకుండా చూసుకోండి. మీ మంచిని మీరు అభివృద్ధి పర్చుకోండి. అంతేగాని ఏ పార్టీని కూడా విమర్శించకండి. నా ఉద్దేశ్యమేమిటంటే - ఈనాడు అన్ని పార్టీలవారూ వ్యక్తి గత భేదాలను ప్రక్కకు నెట్టి ఏకం కావాలి. అప్పుడే మన భారత దేశం దివ్యమైన స్థితిని పొందుతుంది. పూర్వం బ్రిటీషువారు భారత దేశంపై పెత్తనం చెలాయించడానికి కారణ మేమిటి? భారతీయులలో ఐకమత్యం లేక పోవడమే. జరిగిందేదో జరిగిపోయింది. ఇంకా భవిష్యత్తులోనైనా మన భారత దేశంలో మళ్ళీ విదేశీ పరిపాలన రాకుండా చూసుకోవాలి. లౌకికమైన శక్తులు కదిలిపోయే మేఘాల వంటివి. వాటిని ఆధారం చేసుకుంటేఅథోగతి తప్పదు. దైవశక్తిని ఆధారం చేసుకోవాలి. నైతిక విలువలను అభివృద్ధి పర్చుకోవాలి. మంచి సంఘాన్ని ఏర్పరుచుకోవాలి. మంచి ప్రభుత్వాన్ని పోషించాలి. సమాజం లేకపోతే నాయకుడే లేదు. సమాజాభివృద్ధికి పాటుపడేవాడే నిజమైన నాయకుడు. అలాంటి నాయకులను పోషించి వారిని అభివృద్ధి పరచాలి. అదే ప్రజల యొక్క ప్రధాన కర్తవ్యం. ప్రజలు క్షేమంగా ఉన్నప్పుడే ప్రభుత్వం క్షేమంగా ఉంటుంది. ప్రభుత్వం క్షేమంగా ఉన్నప్పుడే ప్రజలు క్షేమంగా ఉంటారు. కనుక, దేశ ప్రజలు, ప్రభుత్వం ఐకమత్యంగా, అన్యోన్యంగా పని చేస్తూ దేశాభివృద్ధికి కృషి చేయాలి. వ్యక్తిగతమైన భేదాభిప్రాయాలతో ప్రభుత్వంపై ద్వేషం పూనటం చాల తప్పు,
(స.సా.మే 99 పు. 124/125)