పాపభీతి దైవ ప్రీతి సంఘనీతి కోల్పోయిన తరువాత ఇంక మనకు శాంతి ఏరీతిగా లభ్యమవుతుంది? సంఘంలోనే పుట్టాము. సంఘంలోనే పెరిగాము. సంఘంలోనే అనేక విద్యలు నేర్చుకున్నాము. సంఘం నుండి ఇంత ఉపకారం పొందినందుకు కృతజ్ఞతలు మనము సంఘానికి ఏ రీతిగా చూపగలము? సంఘానికి ఏ రీతిగా ఉపయోగపడగలము అనే విచారణ ఎవరైనా చేస్తున్నారా?
ధైర్యంగా దేశసేలో మీరు పాల్గొనాలి. సేవచేయడం చాలా గొప్పదనం.
తపస్సు చేయక పోయినా ఫరవాలేదు. తీర్థయాత్రలు చేయకపోయినా ఫరవాలేదు. సేవలు మాత్రం చేయండి. సేవకత్వము నందె నాయకత్వం ఇమడి ఉంది. సేవలు సల్పిన వారికే శాంతి చేకూరుతుంది.
యువతీ యువకులు నిర్మల చిత్తంతో సమాజానికి సేవచేయాలి. ఇదే సమాజానికి అందించవలసిన కృతజ్ఞత.
(దే.యు.పు.10/11)
యువకులు కార్మోన్ముఖులు కావాలి! నవ భారత నిర్మాణానికి కంకణం కట్టుకోవాలి! దేశమాత సౌభాగ్యాన్ని కళ్ళారా చూసేవరకు విశ్రమించకూడదు. భరతమాత భవితవ్యం యువతరం మీద ఆధారపడియుంది.
పదవీ వ్యామోహం బంధు, ప్రీతి, అవినీతి అంతరించాలి. ఉన్నత జాతీయ లక్ష్యాలు కోసం దేశసాభాగ్యం కోసం, జాతీయ స్వచ్చీలత కోసం కృషిచేయాలి. దుర్గణాలు వదలాలి. సద్గుణ సంపద పెంచుకోవాలి.
దేశభక్తి, సేవానురక్తి, త్యాగ శీలం అలవర్చుకోవాలి. దేశం కోసం శరీరాన్ని త్యాగం చేయడానికి సంసిద్ధంగా ఉండాలి. లోక కళ్యాణానికి, సమాజాభివృద్ధికి, సర్వప్రాణికోటి సంక్షేమానికి తమ సర్వస్వాన్ని అర్పించడానికి సిద్ధం కావాలి. త్యాగానికి మించిన సుఖం మరి ఒక్కటిలేదు. అట్టి త్యాగే అమృతపుత్రుడు. అతడు చిరంజీవి.
(దే.యు.పు.33)
ఇక మనము చేయవలసింది దేశ సేవ, సేవను మించినది మరొకటి లేదు. తపస్సు కంటే, జపధ్యానముల కంటే, తీర్థయాత్రలు కంటే విలువైనది. సేవ. ఇట్టి సేవలు విస్మరించరాదు.
తోటి మానవులను కష్టముల్లో ఆదుకొని వారిని సేవించి, ప్రేమించి, విశాలమైన ప్రేమ తత్వాన్ని పెంచుకోవడమే భారతీయ సంస్కృతి.
భారతీయులు స్వాతంత్ర్యము తెచ్చుకొన్నారు. సాధించవలసింది ఆంతర్ముఖమైన స్వాతంత్ర్యము. ఈనాడు బాహ్యమైన దానినే అనుభవిస్తున్నారు. బయట ఉన్నదంతా లోపల ప్రతిబింబమే! కనుక మొట్టమొదట పవిత్రతను నింపుకోవాలి!
(దే.యు.పు. 37/38)
దేశ సేవకుండె దేశనాయకుడైన
స్వార్థ రహిత సేవ చేయుచుండు
పదవి కాంక్షవాడు పరిశుద్ధ హృదయుడా?
చెప్పరయ్య మీరె ఒప్పుకొందు.
(శ్రీ సత్యసాయి వచనామృతం 1990 పు 193)