పూర్వం ఇక్కడ దూపాటి తిరుమలాచార్యులనే భక్తుడుండే వాడు. సుప్రభాతం వ్రాసినది అతడే. ఆతడు గొప్ప సంస్కృత పండితుడు, వెంకటగిరి సంస్థానంలో పని చేశాడు. ఆతడు 90 ఏళ్ళ వయస్సులో బదరికి నాతో ప్రయాణమై వచ్చాడు. "తిరుమలాచారీ! నీ దేహం చాల శుష్కించిపోయింది. అంత దూరం ప్రయాణం చేయగలవా?" అని అడిగాను. "స్వామీ! మీరు నా వెంట ఉంటే ఎంత కాలమైనా, ఎంతదూరమైనా ప్రయాణం చేస్తాను. మీకు అయినవాడనైతే జగత్తుకంతా నేను అయినవాడనౌతాను. మీకు కానివాడనైతే నా జీవితమే వ్యర్థం."
"నీకు కానివాడనైతే లోకమాత!
నేను లోకమందు లోకువౌదు లోకమాత!
అన్నాడు. ఇంతటి భక్తి ప్రపత్తులతో జీవించినవాడు ఆ తిరుమలాచారి. అతడు తన కాలమంతా స్వామిలోనే గడిపాడు. బృందావనానికి వెళితే అక్కడ కూడా అతడు నాతో నే ఉండేవాడు. అతను చాల గొప్ప భక్తుడు. ఆ భక్తికి ప్రమాణము చెప్పడానికి వీలుకాదు. కట్టకడపటికి అతనికి మరణం కూడా చాల సునాయాసంగా లభించింది. ఒకరోజున "స్వామీ! ఇంక నా పని అయిపోయింది." అన్నాడు. "నీకెట్లా తెలుసు?" అన్నాను. "లోపలున్న మీరే నాకు బోధిస్తున్నారు" అన్నాడు. వెళ్ళి స్నానం చేశాడు. కొంత జలము తీసుకు వచ్చి నాపాదాలకు అభిషేకం చేశాడు. నాలుగు బొట్లు తీర్థం తీసుకున్నాడు. "స్వామీ! ఇంక నేను పరిపూర్ణుడనైనాను.
పూర్ణమదః పూర్ణ మిదం పూర్ణాత్పూర్ణ ముదచ్యతే
పూర్ణస్య పూర్ణ మాదాయ పూర్ణ మేవావశిష్యతే!
నా దేహము, మనస్సు ఆత్మ పరిపూర్ణమైపోయాయి. ఇంక మీలో చేరిపోతున్నాను" అన్నాడు. తన ప్రాణాలనువదిలాడు. చూశారా! తన మరణం ఎప్పుడు వస్తుందో ముందే తెలుసుకోగల్గాడు. అతడు నిరంతరము సాయిమాతా! సాయిమాతా! అని స్మరించేవాడు. ఇలాంటి భక్తి కలినవారు లోకంలో ఎంతమందో ఉంటున్నారు. "జగతియందు పుణ్య పురుషులు లేకున్న జగము లెట్లు వెలుగు పగలుగాను!" ఇలాంటి పరమ భక్తులు ఉండటం వల్లనే జగత్తంతా దేదీప్యమానంగా వెలుగుతున్నది.
(స.సా.ఫి.2000పు.39)
(చూ॥ సత్యం శివం సుందరం)