ప్రాచీనకాలంలో అనేక మంది మహనీయులు ప్రపంచానికి ఆదర్శమును అందించుటకు అనేక బాధల ననుభవించారు. ఎన్ని కష్టనష్టములెదురైనను వారు తమ దీక్షను విడనాడలేదు. అట్టి ఆదర్శమూర్తులలో ఒకడైన జీసస్ యొక్క తత్యాన్ని ఈనాడు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. జీసస్ జన్మించిన నాటినుండి అనేక విధములైన కష్టములకు, నష్టములకు గురియౌతూ వచ్చాడు. తరతరాలనుండి, యుగయుగాల నుండి ఇలాంటి మహనీయులు, మహత్తరమైన శక్తి సంపన్నులు. దివ్యమైన భావములచేత ప్రజలకు ఉపదేశములు చేస్తూ, ఉపకారములు సల్పుతూ జగత్తును ఉద్దరించుటకు పాటుపడ్డారు. కాని, మూర్ఖులైన మానవులు వారి చర్యలలోని అంతరార్థమును గుర్తించలేక ఆ మహనీయులను, వారి ఆధ్యాత్మిక తత్త్వమును అవమానపరుస్తూ వచ్చారు.
ఉత్తమ పురుషుల యొక్క దివ్యత్వం జగద్వ్యాప్తి ఆయినప్పుడు అనేకమందికి అసూయ బయల్దేరుతుంది. అసూయ, అనసూయ ఇరువురూ అక్కచెల్లెళ్ళు. అనసూయ యొక్క పుత్రులు బ్రహ్మ విష్ణుమహేశ్వరులు. అసూయ యొక్క పుత్రులు జీసస్ అనేక విధములుగా హింసించారు. సమాజానికి శాంతి భద్రతలనందించగోరి జీసస్ అనేక పాట్లు పడ్డాడు. బీదసాదలను, కష్టజీవులను కరుణలో ఆదుకున్నాడు. జీసస్ చేసే పవిత్ర కార్యములను చూసి సహించుకోలేక కొంతమంది అతనిని అనేక ఇక్కట్లకు గురి చేస్తూ వచ్చారు. దిన దినమునకూ అతని పై ద్వేషం పెంచుకున్నారు. అతని పేరు ప్రఖ్యాతులు పెరిగిపోతున్నాయన్న అసూయతో అర్చకులు కూడా ఆతనికి విరుద్ధంగా ప్రచారం చేస్తూ వచ్చారు. బెస్తవారు మాత్రం అతనికి శిష్యులై, అతనిని ప్రేమిస్తూ, ఆరాధిస్తూ వచ్చారు. ఓర్వలేనివారు అతనికి అనేక ఆటంకములు కల్పించి బాధలు పెట్టారు. కట్టకడపటికి అతని ప్రాణం తీయటానికి కూడా ప్రయత్నించారు. ఇందులో జూడాస్ అనే శిష్యుడు కూడా పాల్గొన్నాడు. జీసస్ కు పన్నెండుమంది శిష్యులుండేవారు. వారిలో పన్నెండవవాడు జూడాస్. ఆనాడు ఒక్క కూడా ఉండినాడు. ఈనాడు అనేకమంది జూడాస్ లు బయల్దేరినారు. కనుకనే, జగత్తులో ఆశాంతి పెరిగిపోయింది. కొంతమంది అసూయపరులు అల్పబుద్ధి గల జూడాస్ కు ధనాశ కల్పించి అతనిని లోబర్చుకున్నారు. కేవలం కొన్ని వెండి నాణెములను ఆశించి జూడాస్ తన గురువుకు ద్రోహం చేశాడు. "ధనమూల మిదం జగత్” అనే భావన ప్రజలలో రెండువేల సంవత్సరములకు పూర్వమే ప్రారంభమైంది.
ధవంకోసం పరులకు అపకారం చేయడం, అన్యాయ, అక్రమ, అనాచారములకు పాల్పడటం, లేని చెడ్డను సృష్టించి పవిత్రమైన, నిత్యమైన సత్యమునకు విరుద్ధంగా ప్రచారం చేయడం - ఇది ఆనాడే కాదు, ఈనాడూ జరుగుతూనే ఉన్నది. ఇది లోకసహజం. దీనికి ఎవ్వరూ వెఱువకూడదు. మనలో లేని దోషాలకు మనమెందుకు భయపడాలి? మనలో లేని తప్పులకు మనమెందుకు వెఱవాలి? సత్యనిత్యమైన భావములచేత ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దివ్యపురుషులకు విరుద్దంగా దుర్మార్గులు, అసూయాపరులు దుష్ప్రచారం చేయడం అనాది కాలమునుండి జరుగుతూనే ఉన్నది. ఈనాడుకూడా అలాంటి దుష్ప్రచారాల కేమీ తక్కువ లేదు. సాయియొక్క పేరుప్రతిష్ఠలు దినదినమునకూ పెరిగిపోవడం చూసి అనేకమందికి ఆసూయ కల్గుతోంది. పోనీ, వారేమైనా మంచి పనులు చేస్తున్నారా అంటే, కనీసం ప్రయత్నమైనా చేయడం లేదు.
ప్రఖ్యాతి గాంచిన రాయలసీమకు బ్రిటీషువారి కాలమునుండి ఒక్కరైనా త్రాగునీరు అందించలేక పోయారు. ఎంతమందో శ్రీమంతులు, నాయకులు ఉండినారు. కాని, ఒక్కరైనా ఈ మంచి కార్యమునకు పూనుకోలేదు. మనిషికి నీరే ప్రాణం కాబట్టి, ఇంటింటికీ నీరు అందించాడు సాయిబాబా. ఈనాడు ఒక హార్ట్ ఆపరేషన్ చేయించుకోవాలంటే లక్షల రూపాయలు కావాలి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటలు కట్టించి లక్షలాది మందికి ఉచితంగా హార్ట్ ఆపరేషన్లను చేయిస్తున్నాడు సాయిబాబా. ఈ రోజుల్లో పసి పిల్లవానిని స్కూల్లో చేర్చాలంటే మొట్టమొదట 20 వేల డొనేషన్ కట్టాలి. కాని, సాయిబాబా కె.జి. మొదలు పి.జి వరకు ఉచిత విద్య నందిస్తున్నాడు. ఇందులో వేయింట ఒక భాగమైనా ఎవరైనా చేస్తున్నారా? ఏ గవర్నమెంటు అయినా విద్యను, వైద్యమును ఉచితంగా అందిస్తున్నదా? లేదు, లేదు. ఒక్క సత్యసాయిబాబా మాత్రమే స్వార్థమనేది లేకుండా పరార్థం కోసం పాటుపడుతున్నాడు. కాని, అయోగ్యులైన మానవులు కొందరు సాయికి విరుద్ధంగా దుష్రచారమును ప్రారంభించారు. సాయి చేస్తున్న పనులెలాంటివి, అనే జ్ఞానం వారికి లేకుండా పోతున్నది. మహా అల్పజ్ఞులైపోతున్నారు. ఈ విద్యావంతులంతా. సాయిది. చాలా పవిత్రమైన హృదయం, నిర్మలమైన భావం, నిస్వార్ధమైన ప్రేమ, Purity (పవిత్రత), Patience (శాంతము), Perseverance (పట్టుదల) - ఈ మూడు P లు సత్యసాయి బాబాలో ఉన్నాయి. ఈ మూడింటి ద్వారా స్వార్థరహిత సేవ చేస్తున్నాడు సత్యసాయిబాబా. సత్యసాయిబాబాలో కాలిగోటినుండి తలవెంట్రుకవరకు ఎక్కడా స్వార్థమనేది లేదు. తలలున్నవారు ఇంత మాత్రం యోచించుకొనలేరా? ఎందుకోసం వీరి దుష్ప్రచారములు? ధనంకోసమే! ఈ దుర్బుద్ధులంతా ధవంకోసమే, ఈదురాలోచనలంతా ధనం కోసమే. ఇంతేకాకుండా, డబ్బులు ఇచ్చి ఒక మతము నుండి మరొక మతములోకి మార్పిడి చేస్తున్నారు. కాషాయ వస్త్రములను ధరించిన స్వాములు కూడా ఒకరి గురించి మరొకరు దుష్ప్రచారమునకు పాల్పడుతున్నారు.
"కాషాయ వస్త్రంబు కట్టిన మాత్రాన
కరతలామలకంబు కాదు ముక్తి
నోటిలో మంత్రంబు ముచ్చరించినయంత
చేసిన పాపంబు చెదిరిపోదు
గీతను చేబట్టి కేకలు వేసిన
పుణ్యము మన ఇంట ప్రావుపడదు"
కొందరు స్వాములు కూడా దుర్మార్గంలో ప్రవేశించి దుష్ప్రచారం చేస్తున్నారు. ఇంక, పీఠాధిపతుల సంగతి చెప్పనక్కర్లేదు. ఎవ్వరినీ మనం విమర్శించకూడదుగాని, సమయం వచ్చింది. కాబట్టి. చెబుతున్నారు. ఈ దుష్ప్రచారం గురించి మీరు ఎలాంటి భయమూ పెట్టుకోకండి.
బలహీనతకు లోనయ్యేవారు భక్తులు కాజాలరు ఇప్పుడు బెంగుళూరులోకూడా 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడుతున్నాము. ఇలాంటి పవిత్రమైన కార్యంలో ఏ నాయకుడైనా ప్రవేశిస్తున్నాడా? లేదు. పైగా గొప్పలు చెప్పుకుంటూ కూర్చుంటున్నారు. సిగ్గుచేటు! కొందరు అసూయతో దుష్ప్రచారానికి పాల్పడుతున్నారు. ఇతరులు చేసే పవిత్రకార్యాలకు అసూయతో అడ్డు తగిలేవారు రాక్షసులేగాని, మానవులు కారు. ఇలాంటి రాక్షసులు లోకమంతా బయల్దేరినా సాయిప్రతిజ్ఞ ఎప్పటికీ మారదు. అసూయపరులు దుష్ప్రచారంచేత సాయిబాబా గౌరవమును తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నారు. నాకు గౌరవం కావాలనే ఆశ లేదు. కాని, అది పెరుగుతూనే ఉన్నది. మన భారతదేశమంత అక్షరాలతో ఈ ప్రపంచమంతా ప్రచారం చేసినా నా గౌరవం కించితైనా తగ్గి పోదు. దుష్ప్రచారం చూసి కొంతమంది భక్తులు బలహీనతకు లోనవుతున్నారు. వారు సరియైన భక్తులు కారు. సాయిశక్తులను ఇన్ని గమనించి కూడను ఈ పిచ్చిపిచ్చి కాకికూతలకు ఎందుకు భయపడాలి? గోడలపై వ్రాసే వ్రాతలను, వేదికపై వేసే కేకలను, పేపర్లలో వ్రాసే బూతుకూతలను మీరు లెక్క చేయనక్కర్లేదు. మన సత్యాన్ని, మన ధర్మాన్ని, మన ప్రేమను మనం ప్రచారం చేస్తూ రావాలి.
(స.సా.జ. 2001 పు.1/3)
(చూ॥ సంకల్పము)