ఒకానొక సమయంలో హనుమంతుడు లంకలో విభీషణుని కలుసుకొన్నాడు. ఇరువురు రామ భక్తులే. కనుక, వారు రామతత్వాన్ని గూర్చి చక్కగా ముచ్చటించుకొన్నారు. రాముని యొక్క తత్వాన్ని హనుమంతుడుచక్కగా బోధిస్తుండగా విభీషణుడు కంటిధారలు కార్చుతూ..... "హనుమాన్....! నీవు ఎంతటి అదృష్టవంతుడివోయి! శ్రీరాముని చెంతనే ఉండి రామదర్శనము చేసుకొంటూ దివ్యానందాన్ని అనుభవిస్తున్నావు. కానీ, నాకింకా రామదర్శనము ప్రాప్తించలేదు. నా దురదృష్టమేమిటో అని అన్నాడు. ఆ మాటలు విని హనుమంతుడు ఫక్కున నవ్వాడు. "విభీషణా! నీవు రామనామాన్ని స్మరిస్తున్నావు కాని, రామ సేవలో పాల్గొంటున్నావా? నామమును స్మరించినంత మాత్రాన చాలదు. స్వామికార్యాన్ని కూడా ఆచరించాలి. సీతాదేవి అశోకవనములో చేరి ఇప్పటికి పది నెలలైనది. ఆమెను రామసన్నిధికి చేర్చడానికి నీవేమైనా పూనుకొన్నావా? రామకార్యములో ప్రవేశించకపోతే నీకు రామదర్శనము ఏరితిగా లభించగలదు?" అని ప్రశ్నించాడు.
(స.సా.ఏ. 93 పు. 105)
ముద్ద - ఖర్జూరం తిన్నవానికి చింతపండు రుచించనట్లు హరిప్రియుడైనవాడు చెడు కార్యాలలో ప్రవేశించడు. భగవంతుని ప్రేమతత్వాన్ని గుర్తించలేనివాడే ప్రకృతి విషయములపై స్వారీ చేస్తుంటాడు. నిర్మలత్వాన్ని, నిరంతరత్వాన్ని గుర్తించగలిగితే అనిత్యాన్ని, అసత్యాన్ని ఆశించము. మానవజీవితం తిండితీర్థాదులకోసం, భోగ భాగ్యాలకోసం వచ్చినటువంటిది కాదు. - భోగభాగ్యాల లోపలి త్యాగయోగాలను అనుభవించాలి. అదే జన్మరహస్యము. సద్గుణములు, సత్కర్మలద్వారా మానవత్వాన్ని పోషించుకున్నప్పుడే మానవత్వం వికసితమవుతుంది. మానవాకారాన్ని ధరించి దానవుడుగా ప్రవర్తిస్తే మానవత్వానికే మసిపూసినట్లవుతుంది. ప్రపంచంలో అధికారులు,ధనవంతులు ఎంతమంది లేరు?! వారియందు శాంతి ఉన్నదా? పైకి నటించవచ్చు. కానీ శాంతి ఏ కోరికలూ లేనివారి హృదయంలోనే నివసిస్తుంది. ఈ శాంతియే మానవునికి మకుటము. సునిశితమైన ఖడ్గము. శాంతిని అనుభవించాలంటే కోరికలను తగ్గించుకొంటూ భగవచ్చింతనను అభివృద్ధిపరచుకోండి. సేవాకార్యక్రమాలలో పాల్గొనండి. ఆనందం సేవాతత్వంలోనే ఉన్నది. కానీ నాయకత్వంలో లేదు. నాయకత్వం నిజమైన అధికారం కాదు, బానిసత్వం. సమాజంలో ప్రవేశించి దీనులను, దిక్కులేనివారిని ఆదరించండి. అదియే నారాయణ సేవగా భావించండి. దిల్ మే రామ్, హాత్ మే కామ్ - హృదయంలో దైవాన్ని స్మరిస్తూ చేతులతో పని చేయడానికి సిద్ధం కండి! – బాబా (సనాతన సారథి, మే 2022 పు.25)