ఎట్టి గుణములైనా ఇంద్రియ సంబంధము లేక చలించవే: గుణములకు పుట్టుక స్థానమే అది. కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు ఐదు. ఈ రెండూ చేరేకదా మనో సహాయమున ఆత్మను చేరుచున్నవి: లేకున్న లయమే లేదు. ‘మాయలోనే పుట్టి, మాయలోనే పెరిగి, మాయను దాటుట మనిషినీతి అన్నట్లు వాటిలోనే పుట్టి వాటిలోనే పెరిగి, వాటిని దాటుట జడచైతన్యముల లక్షణములుకదా. అందుకనే రాముడు జీవిరూపుడై ఎక్కడ జనించెనో తెలియునా? ఎవరికుమారుడు? దశేంద్రియ మను రథమున పుట్టినవాడు కనుక రాములతండ్రికి దశరథుడను నామము. తెలిసినదా? ఏ రూపములు ఏ గుణము దాల్చిననూ అవి దశేంద్రియ సంబంధము లేక ఉండవు. కాన, ఇప్పుడు అవి కర్మేంద్రియ జ్ఞానేంద్రియ రూపమున ఉన్నవి, ఆనాడు దశరథ రూపమున ఉండెను. దశరథునకు నలుగురుకుమారులు పుట్టిరే. వారు ఏ రూపము?
దశేంద్రియములందు నాలుగే కాదు. ఎన్ని గుణరూపము లైననూ పుట్టవచ్చును. అయితే ముఖ్యముగా పుట్టవలసిన గుణరూపములు నాలుగు ముఖములనియూ, పరమాత్ముడు చతుర్ముఖుడు కనుక, తనను తాను సంకల్పించుకొని నాలుగుభాగములుగా విభజించి, నాలుగు ముఖములు నాలుగు రూపములుగా జన్మించిరి. వారే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. వారు సూక్ష్మరూపమున సత్య ధర్మ శాంతి ప్రేమ స్వరూపులై యున్నారు. పరమాత్మునియొక్క చతుర్ముఖములు ఇవియే.
స్వామీ: ఇందులో సత్య మెవరు, ధర్మ మెవరు, శాంత మెవరు, ప్రేమ ఎవరు?
అంతమాత్రము తెలియదా: రాముడే సత్యస్వరూపుడు. ఎవరి స్థానము వారిదేకాని, నాకు అర్హతకాదని నిరూపించిన భరతుడే ధర్మ స్వరూపుడనియూ, ఆత్మపై (అనగా రామస్వరూపుని పై) సంపూర్ణభారమువేసి, దానికంటే మించిన ఆనందము వేరులేదని సర్వకాల సర్వావస్థల యందును ఎడబాయక నిరూపించిన లక్ష్మణుడే ప్రేమస్వరూపుడనియూ, ఈ మూడింటిని అనుసరించిఅవి ఏఏ మార్గమున నడుచునో అంతవరహ తాను ఏ ఉద్దేశ్యములు పడక, శాంతముగా ఈ మూడింటి జాడలలో నడచి నిరూపించిన శత్రుఘ్నుడే శాంతస్వరూపుడు.
మాయలోనే పుట్టి, అందులోనే పెరిగి, తిరిగి దానినే జయించవలె నన్నట్లు వీరు గుణములందే పుట్టి, గుణములను జయించి, గుణాతీతులు అయ్యే అర్థమును నిరూపించుటకే ఈ ముగ్గురు తల్లులూ మూడు గుణములుగా ఉండిరి. అందులో కౌసల్య సత్వగుణము, కైకరజోగుణము, సుమిత్ర తమోగుణముగా నటించినవి. దశరథుడు దశేంద్రియ రూపుడై ఈ గుణములను కూడియుండుటవల్ల వారు ఇంద్రియ గుణస్వరూపులను పేరున నిల్చియుందురు. ఈ ఇంద్రియ గుణముల మూలమున మానవులు సులభముగా గ్రాహ్యము చేసుకొనలేరని మానవబోధనార్ధము పరమాత్ముడు ఇన్నిన్ని రూపములతో ఇంత రామాయణమును జరిపి బోధించినాడు: బోధించుచున్నాడు. ఆనాటి స్థూల రామాయణమును ఈనాటి మానవహృదయరంగమున గుణరూపములతో సూక్ష్మరామాయణముగ జరుపుచున్నాడు.
(సం. పు.93/94)