దైవాజ్ఞ అందరికీ ప్రాణం. దైవం ఏది చేసినప్పటికీ ఇంక ఎదురు ప్రశ్నలు ఉండకూడదు. దుముకు అంటే దుమకటమే! లక్ష్మణుడు అటువంటివాడే. చిత్రకూట పర్వతమును చేరినప్పుడు సీత అలసినట్లుగా కనిపించింది. రాముడు లక్ష్మణుని పిలిచి, "లక్ష్మణా!ఒక పర్ణశాలను నిర్మించు సీత చాల అలపిపోయింది." అన్నాడు. "అన్నా! ఎక్కడ నిర్మించాలి?" అని అడిగాడు. లక్ష్మణుడు. "నీకు ఎక్కడ ఇష్టమో అక్కడ నిర్మించు" అన్నాడు రాముడు.
ఈ మాట లక్ష్మణుని చాల బాధించింది. "రామా! నేనేం పాపం చేశాను? నీ నోటి నుండి ఇంత కఠినమైన మాట వినవలసి వచ్చింది కదా" అని బాధపడ్డాడు. అప్పుడు సీత, లక్ష్మణా! ఎందుకింత బాధపడుతున్నావు? రాముడు నిన్నేమీ అనలేదే" అన్నది. "అమ్మా! నాకిష్టమైనది ప్రత్యేకంగా ఒకటున్నదా? రాముని ఇష్టమే నా ఇష్టం కదా! ని కిష్టమున్నచోట నిర్మించు అంటే, నేను రామునకు దూరమైనట్టే కదా!" అన్నాడు. అప్పుడు రాముడు లక్ష్మణుని తల నిమురుతూ. "తమ్ముడా! ఈ చిన్న విషయానికి నీవింత బాధపడనక్కరలేదు. ఇదిగో, ఇక్కడ నిర్మించు అని ఒక ప్రదేశాన్ని చూపించాడు. భరతుడు రామాజ్ఞకు ఎదురు చెప్పలేక అయోధ్యకు తిరిగి వెళ్ళాడు. కాని, ఒక షరతు పెట్టాడు. "నీవు ఆయోధ్యలో ప్రవేశించేంత వరకు నంది గ్రామంలో ఒక పర్ణశాల వేసుకొని నేనూ నీ వలెజీవిస్తాను. పధ్నాలుగు సంవత్సరాల తరువాత ఒక్క క్షణం ఆలస్యం చేసినా నేను ప్రాణత్యాగం చేస్తాను. నీవు తిరిగి వచ్చేంతవరకు నీ పాదుకలే అయోధ్యను పాలిస్తాయి" అన్నాడు. చూశారా! ప్రతికుటుంబంలోను అన్నదమ్ములు, భార్యాభర్తలు, తండ్రీబిడ్డలు ఏ విధంగా ఉండాలో రామాయణం ప్రబోధిస్తున్నది.
(శ్రీభ. ఉ..పు. 65)