శ్రీరాముడు, "స్వామి, ఏ స్థలమున మమ్ము నివసింపుమని రాము ఆజ్ఞ చేసిన ఆ స్థలమున మేము నివసించెదము. యెవ్వరికి బాధ కలుగక, ఋషులకు యెట్టి ఇబ్బందిని చేకూర్చక, నష్ట కష్టములు వాటిల్లకుండ, ఈ సంగతులను తాము విచారించి మాకు యోగ్యమైన స్థానమును తెలుపుడు. అక్కడ ఒక పర్ణశాలను యేర్పరచుకొని కొంతకాలము గడుపుదుము" అని నిర్మలాంత: కరణముతో పలికిన ప్రియవచనములను ముని విని (వాల్మీకి), రామునితో నిట్లు చెప్పెను: “ఓ రామా! నేను ధన్యుడను. నీవు రఘు కులమునకు సేతువువంటివాడవు. నీవు యెందులకిట్లు పలుకుచున్నావు? నీవు వేదమార్గము లను పాలించువాడవు రక్షించువాడవు.
జానకీ నీ మాయ. నీ యిచ్చానుసారము ఆమె జగత్తుల సృష్టి స్థితిసంహారముల జేయుచుండును. చరాచరముల కాధారభూతుడు, సహస్ర శిరస్సులుగల ఆదిశేషుడే లక్ష్మణుడు, ధర్మసంస్థాపనకై దేవతల మనోభీష్టమును సాధించుటకు మీరు నరరూపమును ధరించితిరి. రాక్షసహృదయాలను త్వరలో హతమార్చుదురు. సాధుత్వమును పోషింతురు. ఓరామా! ఈ లోక వ్యాపారములకు నీవు సాక్షీభూతుడవు. జగత్తు దృశ్యము, నీవు సాక్టివి; దేవతలు సహితము నీ తత్త్వమును గుర్తించలేదు. ఇక సామాన్యులు నిన్ను తెలిసికొన గలరా? యెవరికి నీ వరప్రసాదమైన జ్ఞానము లభించునో వారే నిన్ను తెలిసికొనగలరు. నిన్ను తెలిసికొనినవారే నీ సామీప్యమును బొందుదురు..
నీకు వికారములు లేవు. దేవసజ్జనహితార్థము నీవు మనుజ రూపమున ధరించి సాధారణ రాజువలె మాటలు చెప్పి, చర్యల జేయు చున్నావు. నీ చర్యలు చూచి మూర్ఖులు మోసపోవుచున్నారు. నీవు చెప్పిన ప్రకారము సంచరించెదవు. నీ మాటలకును క్రియలకును భేదము లేదు. నీ వాడించు ప్రకారము మేము ఆడువారమే కాని నిన్ను ఈ రీతిగా చేయమని, ఈ స్థానమందుండుడని శాసించు వారెవ్వరు? రామా! మాటలతో మునులను సహితము మాయలో త్రోయ చూచుచున్నావా? ఏమి నీ లీల, యేమి నీ నటన? నీవు కపటనాటకసూత్రధారివి. నివాస యోగ్యమగు స్థలమును చూపుమని, తెలుపుమని నన్ను నీవు కోరుటలో వున్న అర్థమేమో బోధపడుటలేదు. నేను యేస్థలమును చూపించగలను? నీవులేని స్థలము ఒక్కటి కలదా? దీనికి జవాబు తెలుపుము. అట్టి స్థలముండిన, తప్పక నే చూపుదును" అని రాముని చూచుచూ, ఆనందముతో స్తంభించిపోయెను. ఇట్లు పలికిన మునీశ్వరుని ప్రియవచనములను రాముడు విని లోలోన నవ్వుకొనెను. పునః మహాముని మందహాసములో మృదుమధుర వాక్యముల జెప్పనారంభించెను;
ఓ రామా! నీ నిజమైన నివాసస్థానము భక్తుల హృదయము. ఇక నరాకారమునకు ఉత్తమ స్థానము జెప్పదను వినుము. అచ్చట నీవు సీతాలక్ష్మణులతో కూడి నివసింపవచ్చును. నీ దివ్యచరిత్రములనునట్టి మహానదులు ప్రవేశించుటకు యెవని చెవులు సముద్రము వంటివో, ఎవని చెవులు నిరంతరము నీ కథలతో నిండియుండునో, యెనని జిహ్వ నీ నామముతో కదులుచూ కంఠము నుండి నీ మృదుమధుర శబ్దమును చవి చూచుచుండునో, యెవని నేత్రములు చాతకములవలే నీలమేఘము వంటి నీ స్వరూపమును చూచుట కభిలషించి అట్టి రూపమును చూడ నలుదిక్కులా వెతుకుచుండునో, అన్వేషణ జరుపుచుండునో అట్టివానిలో మీరు మువ్వురూ సదా నివసించవచ్చును.
రామా! ఇంకనూ వివరించి చెప్పగోరుదువేని, ఎవడు అవగుణములను విడిచి, సుగుణములను గ్రహించునో, ఎవడు నీతి నిజాయితీల మార్గమున సంచరించునో, ఎవడు లోకమర్యాద నొందునో, ఎవడు త్రికరణశుద్ధిగా సర్వము నీ సృష్టిగా భావించి, లోకమే నీ ఆకారముగా విశ్వసించి ఆచరించునో అట్టివాని హృదయము నీనివాసము. .
(రా.వా.మొ.పు.283/285)