మనస్సు విషయాశక్తి, వలననూ, విక్షేపశక్తి వలననూ, బహిర్ విషయములమీదికి పరుగెత్తు చుండును. కాని, మరల మరల దానిని లక్ష్యము పైకి తెచ్చుచుండవలెను. ప్రథమములో అది కష్టముగానున్ననూ, మన శిక్షణ ద్వారా మనస్సును శుచిపరువ గలిగినపుడు, ఓం అను శబ్దము మీద నిలువగలదు. ఈ శిక్షణ సామ దాన ఉపరతి తితీక్ష శ్రద్ధ సమాధానము లనెడి ఉపాయములచే మనసును కట్టవలెను.
మనస్సును ఉపనిషత్తులు, ప్రార్థనలు, భజనలు సత్వగుణము మొదలైన వాటిచేత నింపి. క్రమేణా బ్రహ్మధ్యానము లోనికి దింపవలెను. చిత్తమందు ధ్యానము సాగింపగా, మనసు నందు క్రొత్త ఆసక్తులు బయలు దేరును. అట్టి శిక్షణచేత మనస్సును, ఇతర చింతల పైకి ఉరకకుండ, హృదయగుహయందు బంధింప వచ్చును. అట్టి సాధన ఫలమునే నిర్వికల్ప సమాధి" అందురు. నిర్వికల్ప సమాధి ఫలితము బ్రహ్మజ్ఞాన మనబడును. బ్రహ్మజ్ఞానఫలమునే "మోక్ష మనిగాని "జనన మరణముల బారి నుండి విముక్తి" అని గాని పిలుతురు.
బ్రహ్మ పారాయణమందే మనసు నిలువవలయును. ఇట్లు బ్రహ్మ నిష్ఠయందుండి బ్రహ్మనివాసము కొరకు ప్రయత్నించవలెను. వాసనలను విసర్జించుట, మనస్సును నిర్మూలించుట, తత్త్యజ్ఞానము. ఈ మూడునూ కలిపి సాధన చేయవలెను. అప్పుడే ఆత్మజ్ఞానము పొంద వీలగును.
(జ్ఞావాపు,10/11)