దేహం శాశ్వతమైనది కాదు. జీవితమనేది ప్రాణతత్వమే. కనుక, ఈ ప్రాణతత్త్వాన్ని గౌరవించాలి. కాపాడుకోవాలి. అది ఈ దేహంలో ఉన్నంత వరకే ఇది ప్రకాశిస్తుంది. లేకపోతే దీనికి ప్రకాశమే లేదు. బల్బులు ప్రకాశించడానికి కారణమేమిటి? కరెంటే! వైరుద్వారా కరెంటు బల్బులో ప్రవేశించి ప్రకాశాన్ని అందిస్తున్నది. సత్యమే కరెంటు, ధర్మము, శాంతి - ఈ మూడింటి ఏకత్వంచేతనే ప్రేమను పొందగల్గుతాము Bend the Body, Mend the Senses, and End the Mind. ఇదే నిజమైన తత్త్వము. పెద్దలను చూస్తే గౌరవించాలి, అహంకారంగా పోకూడదు. Bend the Body - వినయంగా ఉండాలి. ఇదే విద్య నేర్పే వినయము. Mend the Senses, and the Mind.అదే నిర్వాణము.
(సా.శ్రు.పు.112)
ఒకానొక సమయంలో బుద్ధుడు ఎక్కడికో ప్రయాణమై వెళుతుండగా మార్గమధ్యలో ఒక పెద్ద యజ్ఞం జరుగుతున్నది. ఆ యజ్ఞంలో అనేక మేకలను, గొఱ్ఱె లను బలి యిస్తున్నారు. బుద్ధుడు చూచాడు. అహింసా పరమో ధర్మ:". నోరు లేని జీవులను ఎందుకు బలియిస్తున్నారు? ఇది మంచిది కాదని అరికట్టటానికి ప్రయత్నం చేశాడు. అక్కడ చేరిన పెద్దలందరూ "అయ్యా ఈ బలిని ఎందుకు మీరు ఆపుతున్నారు? గొఱ్ఱెలను, మేకలను బలి ఇచ్చి, తద్వారా వాటికి మోక్షమునందిస్తున్నాం" అన్నారు. "ఓహో! ఇదియా మీరు చేసే పని. అయితే, మీ తల్లి మోక్షాన్ని కోరుతున్నది. మీ తండ్రి మోక్షాన్ని కోరుతున్నాడు. వారిని కూడా ఎందుకు బలి యివ్వకూడదు? మోక్షం కోరేవారికి మోక్షం ఇవ్వకుండా, ఈ మూగ జీవులకు మోక్షం ఇవ్వడం ఎందుకు? ఏ ప్రాణిని మనం హింస చేయకూడదు. ఇది మోక్షమునకు సంబంధించిన మార్గమే కాదు, ఇంద్రియాల నరికట్టుకోవడమే నిజమైన మోక్షము. అదే నిజమైన సాధన" అన్నాడు. దీనిని పురస్కరించుకొనియే బుద్ధుడు ఐదు సూత్రాలను బోధించాడు. సమ్యక్ దృష్టి, సమ్యక్ శ్రవణం, సమ్మక్ వాక్కు, సమ్యక్ భావం, సమ్యక్ కర్మ - ఈ ఐదింటిని అలవర్చుకుప్పపుడే నిర్మాణం ప్రాప్తిస్తుంది. మొట్టమొదట బుద్ధుడు ఎన్ని దినములు సాధన చేసినప్పటికీ తృప్తిని పొందలేకపోయాడు. ఇది అంతా ప్రయోజనం లేని పని. ఎన్ని గ్రంథములు చదివినా, ఎంతమంది పెద్దల బోధనలు విన్నా, ఎన్ని సాధనలు చేసినా మోక్షం లభించదు. భగవంతు డిచ్చిన పంచేంద్రియాలను సక్రమమైన మార్గంలో వినియోగించు కోవటమే మోక్షమునకు మార్గం అన్నాడు. దానికి తగిన ప్రయత్నం చేస్తూ వచ్చాడు. సమ్యక్ దృష్టి సమ్యక్ భావం, సమ్యక్ వాక్కు, సమ్యక్ శ్రవణం, సమ్యక్ కర్మ - ఈ ఐదింటి ద్వారా నిర్వాణం పొందాడు. కనుక, మొట్టమొదట మంచి దృష్టిని అలవర్చుకోవాలి. తద్వారా మంచి భావాలు కలుగుతాయి. మంచి భావాలు కలిగినప్పుడు మంచినే పలుకుతాము, మంచినే చేస్తాము, మంచినే పొందుతాము. కనుక, మంచిని పొందాలంటే మొట్టమొదట ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. దీనినే "యోగః చిత్తవృత్తి నిరోధః" అన్నాడు పతంజలి. ఇంద్రియాలను నిగ్రహించుకోకుండా ఎన్ని సాధనలు చేసినా ప్రయోజనం లేదు.
(సా.శ్రు.పు.112/113)
మీరు ఇతరులకు చేసిన అపకారమును, ఇతరులు మీకు చేసిన ఉపకారమును గుర్తుంచుకోండి, ఇతరులకు మీరు చేసిన ఉపకారమును, ఇతరులు మీకు చేసిన అపకారమును మరచిపోండి. ఉపకారం చేసినవారికి తగిన కృతజ్ఞత చూపండి. "శరీరమాద్యం ఖలు ధర్మసాధనం" ఈ శరీరం ధర్మాచరణ కోసం వచ్చింది. కాబట్టి మంచినే చేస్తూ పోదాం, మంచినే చూస్తూ పోదాం, మంచినే వింటూ పోదాం, మంచినే తలుస్తూ పోదాం, మంచినే పలుకుతూపోదాం.
See no evil. See what is good
Hear no evil, Hear what is good,
Talk no evil. Talk what is good.
Think no evil, Think what is good
Do no evil, Do what is good
This is the way to God.
ఇదే బుద్ధుడు బోధించినటువంటిది. సమ్యక్ దృష్టి, సమ్యక్ భావం, సమ్యక్ శ్రవణం, సమ్యక్ వాక్కు, సమ్యక్ కర్మ - ఈ ఐదింటి ద్వారా మన పంచేంద్రియాలను పవిత్రంగావించుకుంటే ఇంతకంటే మోక్షం మరొకటి లేదు. ఇదియే నిర్వాణం.
(స.సా.జాన్ 1998 పు.155)
(చూ॥ పంచి పెట్టు)