లాయరును చూడగానే కోర్టు కేసులు జ్ఞాపకం వస్తాయి. డాక్టరును చూడగానే రోగాలు గుర్తుకు వస్తాయి. అట్లాగే గుడిగోపురాలను చూడగానే భగవంతుడు జ్ఞాపకం వస్తాడు. ప్రశాంతతను, మనశ్శాంతిని, ఏకాగ్రతను ప్రసాదించడానికే దేవాలయాలు నిర్మింపబడినవి. ప్రేమకు ఆకారం లేదుగాని, ప్రేమించే తల్లికి ఆకారం ఉంది. పరిమళానికి ఆకారం లేదుగాని, పరిమళాన్ని అందించే పుష్పానికి ఆకారం ఉంది. గాలికి ఆకారం లేదుగాని, గాలిని నింపే బెలూన్ కి ఆకారం ఉంది. నీటికి రూపం లేదుగాని, నీరును పోసే టంబ్లర్కు రూపం ఉంది. అలాగే, నిరాకారానికి ఆకారం ప్రధానం. అవ్యక్తమైన నిరాకారం సాకారం ద్వారా అభివ్యక్తం అవుతుంది. మరొక ఉదాహరణ: సినిమా హాలులో స్క్రీను ఉంటుంది. దాని పైన బొమ్మలు వస్తాయి. స్క్రీను లేనిదే బొమ్మలు రావు. బొమ్మలలో కూడా స్క్రీను ఉంటుంది. అయితే, ఏ బొమ్మా స్థిరంగా ఉండదు. అదేవిధంగా, ఆత్మ అనే స్క్రీను ఉంటుంది. అయితే, ఏ బొమ్మా స్థిరంగా ఉండదు. అదే విధంగా, ఆత్మ అనే స్క్రీను పైనే జగత్తు గోచరిస్తున్నది. ఈ విధంగా, నిరాకారంలో సాకారం, సాకారంలో నిరాకారం ఉంటాయి.
(సా.సా. జూ 2000వు. 191)