మనస్సు, బుద్ధి, చిత్తము మరి అహంకారము ఎందు పుట్టి, పెరిగి, ఎందడంగె? అదియే బ్రహ్మ. అదియే ఆత్మ. కనుక నీ పుట్టుక స్థానమును నీవు గుర్తించే నిమిత్తమై, నీ స్వస్వరూపాన్ని నీవు గుర్తించే నిమిత్తమమై అన్యమార్గముల యందు నీవు అన్వేషణ
సల్పిన ఇది ఏరీతిగా పొందగలవు? ఇది ఎట్లా వున్నదంటే, దొంగవాడు తాను పోలీసువేషము వేసుకొని తన్ను తానే పట్టుకొనటానికి ప్రయత్నంచి నట్లుగా ఉన్నది. నిన్ను నీవు గుర్తించుకోవటానికి అన్యసాధనలు ఎందుకు? దీనికొక చిన్న కథ ఉంది. పదిమంది మూర్ఖులు చేరి ఒక నదిని దాటడానికిపోయారు. ఆ నదిని దాటిన తరువాత పదిమంది తిరిగి వచ్చినామా? లేదా? అనేది వారి సందేహము. ఒకడు లెక్క పెట్టుటకు ప్రారంభించాడు. 1,2,3,4,5,6,7,8,9 ఆయ్యో! ఇంకొక్కడు లేడే! నదిలో కొట్టుకుపోయాడు అని ఒకరికొకరు భ్రాంతిచేత విచారం పొందుతూ వచ్చారు. నీవు చెప్పింది సరికాదు. నేను చూస్తానని వేరొకడు 123,4,5,6,7,8,9 అని నీవు చెప్పింది నిజమే! ఇంకకడు లేడు అని వాడు కూడా ఏడుస్తూ కూర్చున్నాడు. అదే మార్గమునందు ప్రయాణము చేస్తున్న ఒక బాటసారి, అతడు వివేకవంతుడు, వీరి యొక్క బాధను చూచి నాయనా! మీరు దు:ఖించటానికి కారణము ఏమిటని ప్రశ్నించాడు. మేము పది మందిమి వచ్చాము, కాని తొమ్మిది మందే ఉన్నాము. ఇంకొకడు ఈ నదిలో కొట్టుకొనిపోయాడని ఏడ్చారు. వారి ఆజ్ఞానమును గుర్తించి ఆ బాటసారి 1,2,3,4..అని పదిమంది ఎంచి నాయనా! పదిమంది ఉంటున్నారు కాని ఎవరు ఎంచుచున్నారో, వారు తనను తాను మరచిపోయి ఎంచుతున్నారు. కనుకనే ఒకరు పోయినట్టుగా విచారిస్తున్నారు అని చెప్పాడు.
కనుక తనను తాను మరచిన వ్యక్తి సరియైన సత్యాన్ని గుర్తించలేడు. నీవే ఆత్మయై యుండి, నీవు ఆత్మ నిమిత్తమై మరొక దానిని ప్రార్థనగాని, సాధనగాని చేస్తే, నీయొక్క తత్త్వము ఏరీతిగా గుర్తించగలవు? "ఏ కోహం బహుస్వామ్" ఒక్కటే అనేకముగా మారిపోవుటచేత, భిన్నత్వములో నీవు అభిరుచిని అభివృద్ధిపరచుకొని ఏకత్వమును విస్మరిస్తూ వస్తున్నావు. ఇవన్ని అద్దములో కనిపించే ప్రతిబింబములవలె, నీ యొక్క ప్రతిబింబములే. బింబమును వదలి, ప్రతిబింబమును విశ్వసిస్తున్నావు. కనుక నీవు భ్రమతో కట్టబడి ఉంటున్నావు. బ్రహ్మ భ్రమతో కట్టబడినవానికి చిక్కడు. కనుక ఆత్మభావమును మనము అనుభవించాలనుకొంటే. మనము చేసే సాధనలన్నీ నిరుపయోగమైనవి.
(స.సా.ఏ.91 పు.105/106)