మానవులు ఇపుడు నడచుచున్న మార్గములు నాలుగు. మొదటి మార్గము కర్మాతీతమైనది. రెండవది నిష్కామకర్మ మార్గము, మూడవది కామకర్మ మార్గము, నాలుగవది కర్మభ్రష్టు మార్గము.
ఇందులో మొదటి వారైన కర్మాతీతులు జీవన్ముక్తులు! వారు చేసిన సర్వకర్మలూ జ్ఞానాగ్నితో భస్మమయి పోవును; చేయవలససిన పనియూ, చేయరాని పనియూ విధి నిషేధములు లేవు. సాధనలు దానధర్మములు, తపములు కూడా వేరే యేమీ వుండవు. వారు చేసిన కర్మలన్నియూ భగవత్ కర్మలగనే మారును. వారుతమ కాలు పెట్టిన స్థానమంతయూ కైవల్యముగానే నుండును. ప్రతి మాట, బ్రహ్మవాక్కుగానే మారును. అట్టివారు దేహమును విడిచిన తక్షణమే వారి ప్రాణము యెక్కడో పోనక్కర లేదు. అక్కడిక్కడే బ్రహ్మమును పొందును. అట్టివారే పైన చెప్పిన కైవల్య ప్రాప్తికి, బ్రహ్మ ప్రాప్తికి, సద్యోముక్తికి సంబంధించిన వారు.
"తరువాత, రెండవ తెగవారు నిష్కామకర్మయోగమును అవలంభించువారు; వీరినే ముముక్షువులని అందురు. అనగా మోకాపేక్ష కలవారని, వీరుచేయు సర్వకర్మలూ భగవత్ ప్రాప్తి భావము తోనే చేయుదురు. వేరు ఫలములనాశించరు. వీరు సత్ కర్మలు మాత్రమే చేతుతురు. లోక సంబంధమైన వాంఛలు కానీ మరే విధమైన స్వర్గాది లోకముల ఆశకాని వీరిలో వుండవు. కేవలము మోక్షమును మాత్రము కోరుచుందురు. వారి దీక్షనుబట్టి భగవత్ కటాక్షము కలిసి కరిగి అనుగ్రహించును.
"ఇక, మూడవవారు, సకామ కర్మయోగులు, వీరు ఫలాపేక్షతో సత్కర్మలాచరింతురు, శాస్త్రవిహిత కర్మలను మాత్రమే చేతురు. పాపకర్మలు కానీ, నిషిద్ధకర్మలు కానీ వీరు చేయరు. అటులే వీరి అభిష్టము: సుఖములు భోగములు కావలెనని, ఏ సత్ కర్మ చేసిన యే సుఖము కలుగునో, యే పుణ్యకర్మలు చేసిన యే భోగాది స్వర్గములు లభించునో అని ఫలమును మొదట లక్ష్యమునందుంచు కొని పవిత్ర కర్మల నాచరింతురు. అట్టివారు శరీరమును వదలిన తరువాత స్వర్గాది లోకములకు పోయి, వారు చేసిన పుణ్యము నశించు వరకూ వుండి, తరువాత భూలోకమునకు వత్తురు.
"ఇక మిగిలిన నాలుగవ తెగవారు: కర్మభ్రష్టులు. వీరికి పుణ్యముకాని పాపముకాని, మంచికాని, చెడ్డ కానీ, నీతి కానీ, నిమము కానీ, శాస్త్రము కానీ, ధర్మముకాననీ, దైవముకానీ దయ్యముకానీ, యేవీ లేవు. ఇట్టి వానిని మనిషి రూపముననున్న మృగమని తెలుపవచ్చును. లోకమున ఈ తెగకు చెందినవారే అధిక సంఖ్యాకులు కలరు. తాత్కాలిక సుఖము, ఆనందము, ఆహారము, హాయి వీరి ఆశయము. వీరు మానవ రూపముతో నున్న వానరులని చెప్పుటకు కూడా వీలు కాదు. వానరులయినా ఒక స్థానమును వదలి మరొక స్థానమునకో, ఒక కొమ్మను వదలి మరొక కొమ్మకో యేగుదురు, వీరట్లుకాదు; మరొకటి ఆధారము చేసుకొని ఉన్న దానిని విడతురు. అనగా, ఆనపకాయలందును, చెట్ల కొమ్మల యందునూ, ఒక విధమైన పురుగుండును. అది ఒక ఆకునుండి మరొక ఆకును చేరునపుడు ముందు మూతితో ఒక ఆకును కరచుకొని వెనుకవైపున మరొక ఆకును వదలును. అటులనే వీరునూ, క్రిములవలే దేహమును విడచి, మరొక దేహమును అప్పుడే అందుకొనుటకు సిద్ధముగావుందురు. వీరికి యే లోకమూ లేదు, రాదు. జనన మరణములే వీరికి ప్రాస్తము. వారికి పవిత్ర కాలము వచ్చు వరకూ ఈ విధమైన ప్రయాణమే చేయుచుందురు.
(గీ. పు.152/154)