యువకులైన మీరు ఈనాటి నుండి ఒక పవిత్రమైన దీక్షను పట్టాలి. ఏదో ఒక యజ్ఞోపవీతం వేసుకున్నంత మాత్రాన సరిపోదు. మానవునికి నాల్గు విధములైన సంస్కారాలుంటున్నాయి. కోటీశ్వరుడైనా, కూటి పేదైనా తల్లి యొక్క గర్భము నుండే పుట్టాలి. చక్రవర్తికాని, ఛండాలుడు కాని తల్లిగర్భము నుండే పుడుతున్నాడు. అది సహజజన్మ. గాయత్రీ మంత్రోపదేశము జరిగిన తరువాత ద్విజు డౌతాడు. ఇది రెండవజన్మ. ఈనాడు ఉపనయనం జరిగిన వారు రెండవ జన్మ ఎత్తారు. తరువాత మూడవజన్మ కూడా ఎత్తాలి. ఏమిటిది? వేదాధ్యయనము గావించినప్పుడే విప్రుడు అంటారు. అంతమాత్రమే చాలదు. భగవంతునికి వేదజ్ఞానముకాని, శాస్త్రజ్ఞానముకాని పనికిరాదు. ఐతే, ఇవన్నీ నీ మనశ్శాంతికి ఉపకరిస్తాయి. ఈ వేదమును అభ్యసించిన తరువాత తిరిగి నాల్గవజన్మ ఎత్తాలి. ఏమిటిది? బ్రహ్మతత్త్వమును తెలుసుకున్నవాడు. బ్రాహ్మణుడు అన్నారు. మొట్టమొదట శూద్రుడు, తరువాత ద్విజుడు, తరువాత విప్రుడు , తరువాత బ్రహ్మణుడు. ఐతే, బ్రహ్మతత్త్వమును సరిగా అర్థం చేసుకున్నవాడే నిజమైన బ్రాహ్మణుడు. .
(స.సా.జూ...95 పు. 164/165)