ఏది జరిగినా "నామంచికే" అన్న భావం మీలో రావాలి. దీన్ని Positive Thinking అనవచ్చు. ఈనాడు మీరు హృదయాన్ని నెగెటివ్ భావాలతో నింపుకున్నారు. అలాంటప్పుడు భగవంతుడనే పాజిటివ్ ను ఎలా గుర్తించగలరు? మీ దేహము. మనస్సు, చిత్తము, అహంకారము అంతా నెగెటివ్ కు సంబంధించినవి. ఆత్మ ఒక్కటే పాజిటివ్. భగవంతుడు ఆత్మస్వరూపుడు. మీరు ఎన్ని సాధనలు చేసినప్పటికీ నెగెటివ్ భావాలను త్యజించనంత వరకు భగవదనుభూతిని పొందడానికి వీలుకాదు. పాజిటివ్ భావాలతో పాజిటివ్ క్రియలలో ప్రవేశించినప్పుడే భగవదనుగ్రహం లభించగలదు. చిన్న ఉదాహరణ: విద్యార్థియైనవాడు శ్రద్ధగా విద్య నభ్యసించాలి; ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణుడు కావాలి. తరువాత ఉద్యోగంలో ప్రవేశించి సమాజ సేవ చేయాలి. తల్లిదండ్రులను సేవించాలి. ఇదంతా పాజిటివ్. ఆట్లుగాకుండా, ఏది చదివితే ఏ ఉద్యోగం చిక్కుతుంది? విదేశాలకు ఏవిధంగా పోవచ్చును? అక్కడ ఎంత ఎక్కువగా సంపాదించ వచ్చును? అని ఆలోచించడం నెగెటివ్. తల్లిదండ్రులు తమ బిడ్డలను మంచిగా చదివించి, ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దడం పాజిటివ్. అట్లుగాకుండా, తమ కుమారునికి ఎంత జీతం వస్తే ఎంత వరకట్నం లభిస్తుంది? విదేశాలకు వెళితే ఎంత ఎక్కువగా సంపాదించగలడు? అని ఆలోచించడం నెగెటివ్. అదేవిధంగా, వైద్యుడు నిస్స్వార్థంగా రోగికి సరియైన చికిత్స చేసి స్వస్థత చేకూర్చడం పాజిటివ్. అట్లుగాకుండా, "ఈ రోగి నుండి ఎంత డబ్బు లభిస్తుంది." అని ఆలోచించడం నెగెటివ్. మీ హృదయాన్ని భగవద్భావము, భగవచ్చింతన, సదాలోచనలనే పాజిటిలో నింపుకోవాలి. అప్పుడే మీరు భగవదనుగ్రహమును, శాంతిని, ఆనందమును అందుకోవడానికి వీలవుతుంది. భగవంతుడు ఏది చేసినా, ఏది చెప్పినా, "అంతా నా మంచికే" అని భావించడమే Positive Thinking. ప్రారంభంలో ఇది కొంత కష్టమనిపించినప్పటికి ఆనుభవం మీద ఈ సత్యాన్ని గ్రహించగలరు.
దీనికి ఒక చక్కని కథ ఉన్నది. ఒక రాజుగారికి చెఱకు గడను తానే స్వయంగా కత్తితో ముక్కలు చేసుకుని ఆరగించాలని కోరిక కలిగింది. వెంటనే ఒక చఱకు గడను తెప్పించి దానిని కత్తితో ముక్కలుగా తరుగుతుంటే పొరపాటున వ్రేలు తెగింది. ప్రక్కనే ఉండి దీన్నంతా గమనిస్తున్న మంత్రి "రాజా! మే మంచికే జరిగింది" అన్నాడు. ఇది విని రాజు కోపోద్రిక్తుడయ్యాడు. “ఏమిటి! ఈనాడు నా వ్రేలు తెగడం నా మంచికంటున్నాడు. రేపు నా కంఠం తెగినా నష్టం లేదంటాడేమో!" అని అనుకుంటూ మంత్రిని చెఱసాలలో పెట్టించాడు. మంత్రి చెఱసాలకు వెళుతూ "రాజా! ఇది నా మంచికే" అన్నాడు. కొంతకాలం తరువాత ఒకనాడు రాజు వేటకోసం అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ కొంతమంది ఆటవికులు తమ కులదేవతకు నరబలి ఇవ్వాలని ఒక మనిషికోసం వెతుకుతున్నారు. వారు రాజుగారిని చూసి తమ కులదేవలకు బలిఇవ్వడానికి సరియైన మనిషి దొరికాడని ఆనందించారు. వెంటనే అతనిని తమ కుల పెద్దవద్దకు తీసుకు వెళ్లారు. కుల పెద్ద బలి ఇవ్వడానికి ముందు రాజాగారిని సునిశితంగా పరిశీలించి, అతనికి ఒక వేలు లేకపోవడాన్ని గమనించి, "అంగహీనుడు బలికి పనికి రాడు" అని పలికాడు. వెంటనే వారు రాజుగారిని వదిలిపెట్టారు. అప్పుడు రాజు తనలో తాను ఇలా అనుకున్నాడు. "ఆరోజు నా వ్రేలు తెగినప్పుడు మంత్రి ఇది మీ మంచికే" అన్నాడు. అతను చెప్పిన మాట సత్యమే. నా వేలు తెగకపోయి ఉంటే ఈ ఆటవికులు నన్ను తప్పకుండా తమ కులదేవతకు బలి ఇచ్చి ఉండేవారు". అతడు రాజ భవనానికి వెళుతునే మంత్రిని చెఱసాల నుండి విడిపించి, జరిగినదంతా అతనికి పూసగుచ్చినట్లు వివరించి "మంత్రి! మీరన్నది సత్యం. నా వ్రేలు తెగడం నా మంచికే జరిగింది. మరి మిమ్మల్ని నేను చెఱసాలలో పెట్టించినప్పుడు ఇది నా మంచికే అన్నారు కదా! మీరు చెఱసాలలో ఉండటం మీ మంచికే జరిగిందని ఎలా చెప్పగలరు?" అని ప్రశ్నించాడు. అప్పుడు మంత్రి "రాజా! ఆనాడు మీరు నన్ను చెఱసాలలో పెట్టకపోయినట్లైతే నేను కూడా మీ వెంట అరణ్యానికి వచ్చి ఉండేవాడను. మీకు వ్రేలు తెగిన కారణంగా ఆటవికులు మిమ్మల్ని వదలి పెట్టి నన్ను బలి ఇచ్చి ఉండేవారు. కనుక, నేను చెఱసాలలో బందీ కావడం నా మంచికే కదా!" అన్నాడు. ఈ రకంగా, మీరు Positive Thinking. Positive Attitude, Positive Actions ను వృద్ధి చేసుకోవాలి. అప్పుడే మీకు ఆనందము, శాంతి లభిస్తాయి. కాని, మీ భావాలు దీనికి విరుద్ధంగా ఉంటున్నాయి. దీనికొక దృష్టాంతం: సుమతి శతకంలో ఒక పద్యం ఉంది.
"అక్కరకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమున తా
నెక్కిన పారని గుఱము
గ్రక్కున విడువంగవలయు గదరా సుమతీ!
అవసరానికి ఆదుకోని చుట్టాన్ని, యుద్ధరంగంలో పరుగెత్తని గుర్గాన్ని మ్రొక్కినా వరమీయని దేవుణ్ణి గ్రక్కున విడిచి పెట్టాలని దీని అర్థం చెపుతారు. కాని, ఇందులో "సుమతీ అనే పదము చాల ముఖ్యమైనది. అనగా, ఈ పద్యము బుద్ధిమంతులకు మాత్రమే వర్తిస్తుంది అని ముందుగా గ్రహించాలి. నీకు అక్కరకు రాని చుట్టాన్ని వదలాలి అని ఆలోచిస్తున్నావు. కానీ, నీవు ఎవర్ని ఆదుకున్నావు? ఎవరి అవసరాన్ని తిర్చావు? ఇది ఆలోచించావా? యుద్ధరంగంలో పరుగెత్తని గుజ్రాన్ని విడిచి పెట్టాలని అంటున్నావు. కాని, నీకు గుఱ్ఱపు స్వారీ సరిగా వచ్చునో లేదో ఆలోచించావా? మ్రొక్కిన వర మీయని వేల్పును వదలి పెట్టాలని అంటున్నావు. కాని, నీవు యోగ్యుడవు అవునో కాదో ఆలోచించావా? నీవు ఇతరులకు ఉపయోగపడక అందరూ నీకు ఉపయోగ పడాలని, నీకు గుఱ్ఱపు స్వారీ రాకపోయినా నీవెక్కిన గుఱం పరుగెత్తాలని, నీకు యోగ్యత లేకపోయినా నీ కోరికలు తీరాలని ఆలోచించడం మూర్ఖత్వం, అజ్ఞానం
(స.పా.డి.99 పు.375/376)