ఈ దేహం పుట్టినప్పటి నుండి సేవలోనే నిమగ్నమై యున్నది. మీరు కూడా సేవకే మీ జీవితాన్ని అంకితం చేయాలి. ఇదియే నా సందేశం. నేను ఏది చెప్పినా ముందు నేను చేసి మీకు చూపిస్తున్నాను. నేను సర్వులను ప్రేమించి మిమ్మల్ని కూడా ప్రేమించమని చెపుతున్నాను. కాని, ఈ ప్రేమతత్త్వాన్ని మీరు సరిగా అర్థం చేసుకోవడం లేదు. నా జీవితమే నా సందేశం" అన్నాను. అయితే, మీరు స్వామి ఆదేశాలను ఆచరణలో పెట్టి మీ జీవితాన్ని స్వామి సందేశంగా మార్చుకోవాలని ఇంతకు ముందు ప్రసంగించిన అమ్మాయి చెప్పింది. మీరు స్వామి చెప్పినట్లుగా నడుచుకున్నప్పుడే మీ జీవితం నా సందేశంగా ఉంటుంది. అంతేగాని, మీరు చేయరాని పనులు చేస్తూ "మా జీవితమే స్వామి సందేశం" అనటం చాల తప్పు. అది మీ సందేశమేగాని, నా సందేశం కాదు. ఏది చేసినా దైవకార్యంగా భావించి చేయండి. మీరు ఏ రంగు అద్దాలు ధరిస్తారో జగత్తంతా అదే రంగులో కనిపిస్తుంది. అది మీరు వేసుకున్న అద్దాల యొక్క దోషమేగాని, జగత్తు యొక్క దోషము కాదు కదా! అదేవిధంగా, మీకు కనిపించే మంచి, చెడ్డలన్నీ మీలోఉన్నవేగాని, బయట ఉన్నవి కావు. ఒకడు చెడ్డవాడని, మరొకడు మంచివాడని నిర్ణయించే అధికారం మీకు లేదు. మొట్టమొదట మీలో ఉన్న చెడ్డను నిర్మూలించుకోండి. అప్పుడు మీకు ఎక్కడ చూసినా మంచియే కనిపిస్తుంది.
(స.సా.డి.99 పు. 369)
(చూ దివ్య ప్రకటనలు)