"అర్జునా! రాగద్వేష భయ క్రోధముల నుండి వేరైన వారునూ, నా చింతన, నామ రూపమునందే లీనమైన వారును, నన్నువినా అన్య ఆశ్రయమును యెరుగని వారునూ ఆత్మజ్ఞానముచే పవిత్రమైనవారును, నా దివ్య జన్మ కర్మలనెరిగి సత్య ధర్మ ప్రేమలతో నన్నే వెదకువారును నన్నే పొందుదురు. ఇది ముమ్మాటికీ సత్యము. సంశయమును విడువుము. అజ్ఞానులయిన మానవులు నిరంతరమూ విషయచింతనతో అంతః కరణములను అపవిత్రము చేసికొనుచున్నారు. అట్టివారు కేవలము శబ్దాది విషయములను చింతించెడివారగుదురు; వారలకు విషయ వాసనలు సోకినంతనే వాటిని పొందవలనెనను అభిలాష కలుగును. అట్లు కోరిన అభిలాషలు నెరవేరకున్న లేక చేతికి చిక్కి జారిపోయిన, వారు ఆశాంతికి గురియై భయ భ్రాంతులకు గురియగుదురు. భయము మానవుని సర్వశక్తులను భక్షించును, భయస్థునకు కోపము మెండు, కోపము, భయము ఈ రెండే భగవ త్ప్రా ప్తికి భయంకర ప్రతిబంధకములు. అంతఃకరణమున ఈ మూడూ అనగా అభిలాష, క్రోథము, భయము పూర్తిగా తొలగినపుడే భగవంతునితో యెప్పటికినీ వియోగమును పొందకుండా వుందురు.
(గీ..పు.65/66)||