లోకమున మానవుల ప్రతినిధిని కనుక నీ సందేహమే లోకసందేహము. నీ సందేహ నివృత్తే నా సందేశము! విను. లోకమున నన్ను చేరగోరువారు, నాలుగు విధములుగా వున్నారు. నిరంతరము దేహసంబంధ మయిన దుఃఖములతో పీడింపబడువారు ఒకరు; అతనిని ఆర్తుడని అందురు. ఇక ధనకనక వస్తువాహనములలో పదవీ పేరు ప్రతిష్టలతో పుత్ర పౌత్రాభివృద్ధిని గోరి పరితపించువారు రెండవ తెగవారు. వీరిని అర్ధార్థులు అని అందురు; తరువాత ఆత్మస్వరూపమైన పరమాత్మను తెలిసికొనగోరి అనేక సత్ గ్రంధములతో సదాలోచనలతో సత్ భావములతో విచారణసలుపుచూ సాన్నిధ్యప్రాప్తిని బడయగోరు వారు. వీరిని జిజ్ఞాసువులని అందురు. ఇక నాలుగవ వారైనవారే జ్ఞానులు. అతను నిరంతరము బ్రహ్మ తత్త్వమున మునిగియుండును.
(గీ.పు.67)