ఈ ప్రపంచానికి మూలాధారమైన తత్వం-దివ్యత్వమొక్కటే ఇలాంటి పవిత్రమైన తత్వం ఒక రూపాన్ని ధరించవలెనంటే దానికి కొంత పురుష ప్రయత్నం కావాలి. పుష్పములు, దారము, సూది - ఈ మూడు ఉన్నప్పటికీ పుష్పమాల దానంతట అది తయారవుతుందా? వాటినిచేర్చి కట్టేవాడు ఒకడు ఉండాలికదా! దానిని వెలిగించేవాడు ఒకడు ఉండాలి కదా! అదే విధముగనే, భగవంతుడనే వాడు ఒకడు లేకపోతే ఈ సృష్టి ఏ రీతిగా వచ్చింది? ఈ ప్రకృతిలో జడచైతన్యములు రెండూ ఉన్నాయి. అయతే, ఈ రెండింటినీ కలిపి మరొక రూపాన్ని తయారుచేసే వాడొకడు ఉండాలి కదా? నీవు బట్టల షాపు నుండి కొన్ని గుడ్డలు తెచ్చావు. అక్కడ నీకు Ready madeగా లభించినప్పటికీ వాటిని తయారు చేసినవాడు ఒకడు ఉండాలికదా! కనుక, నీవు చూసినా, చూడకపోయినా, భగవంతుడనేవాడు ఒకడు ఉన్నాడు.
(శ్రీ భ. ఉ..పు.144)
“మమైవాంశో జీవలోకే..." అద్దంలో కనిపించే మీ ప్రతిబింబాన్ని మీరు ప్రేమించినట్లు అందరినీ ప్రేమించండి. ఏ దేహాన్ని చూచినా అందులో నా ప్రతిబింబమున్నదని భావించండి. ఈ నిత్యసత్యమును ప్రబోధించే నిమిత్తం కృష్ణుడు మమైవాంశో జీవలోకే జీవభూత స్సనాతనః” అన్నాడు. “నీవు నా అంశమే. నేను, నీవు వేరు కాదు. దేహాభిమానంవల్లనే మార్పులు కలుగుతున్నాయి. కానీ మన ప్రేమతత్త్వం ఒక్కటే” అన్నాడు. ప్రేమను వదలి ఎన్ని సాధనలు చేసినా అవి నిష్ప్రయోజనములే! ఈనాడు అనేకమంది అనేకరకములైన సాధనలు సల్పుతున్నారు. కానీ, ఈ సాధనలకు చిక్కేవాడు కాడు భగవంతుడు. భగవంతుణ్ణి ఏరీతిగా పొందాలి? భగవంతుడు తన ప్రేమను ఏరీతిగా అందరికీ పంచుతున్నాడో అదేవిధంగా మీరుకూడా మీప్రేమను అందరికీ పంచాలి. ఇట్టి సమదృష్టి గలవానికే భగవంతుడు సన్నిహితుడవుతాడు. అట్టివానికే దైవత్వం ప్రాప్తిస్తుంది. ప్రాప్తించడం అంటే బయటినుండి లభించడం కాదు, తననుండియే దైవత్వం ఆవిర్భవిస్తుంది. బయటివన్నీ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ లు మాత్రమే. రియాలిటీ మీయందే ఉన్నది. అదే మూలాధారతత్త్వం. శ్రీసత్యసాయి (స.సా. ఆగష్టు2022 నాల్గవకవరుపేజి )