దేహము-దేహి, లేక క్షేత్రము - క్షేత్రజ్ఞుడు, లేక శరీరము - శరీరి అనే రెండు తత్వములతో కూడినవాడు మానవుడు. శరీరమనగా ఏమిటి? "శీర్యతీత శరీర:" అనగా జీర్ణించిపోవునది శరీరము. ఇది పెరుగుతూ ఉన్నప్పటికీ జడమైనదే.
దేహము క్షేత్రము. దేహి-క్షేత్రజ్ఞుడు. క్షేత్రమని దేనికి పేరు? దైవత్వమున్న ప్రదేశానికే క్షేత్రమని పేరు. కనుకనే తిరుపతి, అమర్‌నాథ్, బదరీనాథ్ మున్నగువాటిని క్షేత్రములని పిలుస్తాము. ఈ దేహము కూడా ఒక క్షేత్రమే. ఎందుకోసం? ఇందులో భగవంతుడనే క్షేత్రజ్ఞుడున్నాడు. క్షేత్రజ్ఞుని వల్లనే క్షేత్రమునకు విలువ ఉంటుంది.ప్రతి దేహము దేవాలయమేకాని, జీవాలయము కాదు. ఇట్టి దివ్యమైన శక్తితో కూడిన దేహాన్ని అందించినందులకు తల్లికి మనం కృతజ్ఞలమై ఉండాలి.
అన్నింటికి భగవంతుడే మూలకారకుడైనప్పటికీ ఈ దేహానికి మూలాధారం తల్లియే. విత్తనము మంచిదే అయినప్పటికీ దానిని మట్టిలో పెట్టి నీరు పోసినప్పుడేమొలకెత్తుతుంది. కాని, టిన్నులో పెడితే మొలకెత్తదు కదా! కాబట్టి ప్రకృతియే తల్లి, పరమాత్ముడే తండ్రి.
(స.సా.జూన్.97పు.142)
ప్రతి వస్తువుకు ఒక మూలాధార పదార్థమున్నది. ఈ జగత్తంతా ఒక మూలాధారము నుండియే ఏర్పడినది. ఆ మూలాధారమును వదలితే మీరు సర్వమును కోల్పోయినవారౌతారు. ఇది ఒక వెండి ప్లేటు, ఇది ఒక వెండి గ్లాసు, ఇది ఒక వెండి చెంబు. ఈ రూపనామములన్నీ మూలాధారమైన వెండి నుండి ప్రారంభమైనవే కదా! మూలాధారమైన వెండిని విసర్జిస్తే ఈ రూపనామములకు ఏమాత్రం విలువ లేదు. ప్లేటును చెడగొట్టి స్పూనుగా మార్చుకోవచ్చు. స్పూనును చెడగొట్టి చిన్న కప్పును తయారు చేసుకోవచ్చు. కాబట్టి, రూపనామములన్నీ మార్పుచెందునవే. మరణించునవే. కాని, రూపనామములకు మూలాధారమైన వస్తువు ఏనాటికి మార్పుచెందదు. మరణించదు.
చావు, పుట్టుక లేనట్టి శాశ్వతుండు
ఆదిమధ్యాంతరహితు డనాదివాడు
తాను పుట్టక చావక చంపబడక
ఆత్మరూపుడై అంతట వెలసియుండు!
దేహమునకు, ప్రాణమునకు, మనస్సుకు మూలా ధారమేమిటి? అన్నింటికీ ఒక్క దివ్యత్వమే మూలాధారం. సూర్యరశ్మిచేత సముద్రజలం ఆవిరిగా మారుతున్నది. ఆవిరి మేఘములుగా రూపొంది, ఆ మేఘములపై చల్లని గాలి వీచినప్పుడు అవి వర్ష బిందువులే ప్రవాహాలుగా రూపొంది తిరిగి సముద్రంలో కలసిపోతున్నాయి. అనగా, సముద్ర జలం ఇన్ని రూపనామములను ధరించి కట్టకడపటికి తిరిగి సముద్రం లోనే కలిసిపోతున్న దన్నమాట. అదేవిధంగా ఈ జగత్తులోని ప్రతి ప్రాణి, ప్రతి వస్తువు ఒకే మూలాధార తత్త్యం నుండి ఏర్పడినవి. కట్టకడపటికి అవన్నీ ఆ మూలాధార తత్త్యంలోనే చేరిపోవాలి. దీనిని పురస్కరించుకొనియే భాగవతం "ఎచ్చట పుట్టె నచ్చటి కేగుట నైజము ప్రాణికోటికిన్" అన్నది. దీనికే వేదాంతం "ముక్తి అని పేరు పెట్టింది.
(స.సా.ఏ.2000పు.98/99)
మృత్పించమేకం బహౌ భాండరూపం సువర్ణమేకం బహు భూషణాని
గోక్షీరమేకం బహౌదేనురూపం ఏకం పరాత్మా బహు దేహవర్తి:
మట్టి ఒక్కటే కాని కుండలు రూపములు భిన్నములు. సువర్ణము ఒక్కటే కాని అభరణములుగా వివిధ రూపములు ధరిస్తుంది. గోవుల రంగులు భిన్నములు కాని క్షీరము పవిత్రము అనగా తెలుపు, ఆత్మ ఒక్కటే అయితే భిన్నమైన రూపము లందు ఏకత్వమును ప్రకటిస్తూ వుంటుంది. ఏకోదేవో సర్వభూతేషు గూఢః". ప్రతి భూతమునందును అందర్చూతముగా ప్రకటించే దేవుడు ఒక్కడే, అతడే సత్యస్వరూపుడు. శాశ్వత సత్యము ఒక్కటైనప్పటికి అనుభవజ్ఞలు దానిని అనేకముగా అనుభవిస్తూ వచ్చారు. ఉన్న సత్యము ఒక్కటైనప్పటికి వారి వారి అనుభవములను పురస్కరించుకొని భగవంతునికి అనేక రూపనామములు కల్పింస్తూ వచ్చారు. ఐతే మూలాధారమును మాత్రము ఎవ్వరుమ మార్చలేరు.
(స. సా.న. 1986 పు.262)