రాముడు బాల్యము నుండి మితభాషి ఈ మితభాషణముయొక్క ఆదర్శమును లోకమునకు చాటే నిమిత్తమై, తాను ఆరీతిగా నడుచుతూ వచ్చాడు. ఈ మితభాష దివ్యశక్తిని అభివృద్ధి గావించుతుంది. మితభాష జ్ఞాపకశక్తిని కూడా పెంపొందింప చేస్తుంది. సమాజములో గౌరవమును కలిగింప చేస్తుంది. అట్లుగాక అతిభాషంగా ఉండుటచేత. అతిభాష మతిహాని, మితభాష అతిహాయి" అని అతి భాష జ్ఞాపక శక్తిని చాలావరకూ క్షీణింపచేస్తుంది. ఇంతియేగాక, మన దేహములో ఉన్న నరముల యొక్క పటుత్వమును బలహీనపరుస్తుంది. సమాజములో మన గౌరవమునుపోగొడుతుంది. మౌనము, దివ్యమైన శక్తిని పెంపొందింప చేస్తుంది. దీనిని పురస్కరించుకొనియే, మహనీయులు మౌనము అను వ్రతమును పాటించుట. ఆ మౌనమును పాటించుటలో ఉన్న మహత్తరశక్తి, యిదియే. ఈ నాటి యువకులు అతిభాషులు అయిపోవటంచేత, వారు చదివినది. పరీక్షహాలులో మరచి పోవుటకు అవకాశముంటున్నది. కనుక రాముడు యువకులకు అందించిన ముఖ్యమైన ఆదర్శములలో మితభాష మొదటిది. రెండవది పెద్దలను చూచి గౌరవించటము. మూడవది తల్లితండ్రుల ఆజ్ఞను శిరసావహించటము.
(ఆ.రా.పు.29/30)