మితము అంటే ఏమిటి? అమితము అంటే ఏమిటి? భోజనమునకు మనమెట్లైతే తేలికగా వచ్చి కూర్చున్నామో, తిని లేచేటప్పుడు కూడా అదే విధంగా తేలికగా లేవాలి. తేలికగా వచ్చికూర్చొని భారంగా లేస్తే, అది తమోగుణమై పోతుంది. కడుపును మనము నాలుగు భాగాలుగా విభజించాలి. ఇది అందరికీ తెలియదు. ఇంకా నేను కొంచం భోజనం చేయవచ్చును. అనే భావమున్నంత వరకు మాత్రమే భుజించాలి. అంతేగాని, ఇంకా పొట్టలో కొంత స్థలం ఉందికదా! అని ఊరికే దానిని నింపకూడదు. ఇది పొట్టే కాని, బుట్ట కాదని గ్రహించాలి. దీనికి తగిన మితాహారమే ఉంటుండాలి. అయితే, చిన్న వయస్సులో ఉన్నవారు, పొట్టలో మూడు భాగాలు నిండేటట్లుగా భుజించవచ్చును. ఒక భాగాన్ని మాత్రం నీటితో నింపుకోవచ్చును. కాని, మిగిలిన వారు మాత్రము రెండు భాగములు ఆహారము, ఒక భాగము నీరు, ఒక భాగము గాలి ఉండేటట్లుగా భుజించాలి. కాని, ఈనాటి కలియుగ ప్రభావమేమిటంటే కడుపులోని నాలుగు భాగములను ఆహారంతోనే నింపుతున్నారు. ఇక అందులో జలమునకు ఏమాత్రం అవకాశం లేదు.
(శ్రీ భ.ఉ.పు.140)
(చూ॥ హితభాష)