పరమాత్ముడు అర్జునా విను! ఈ లోకమునకూ నాకు మధ్యలో మాయ అను భ్రాంతి తిరుగుచుండును, దానిని మానవులు జయించుట కష్టము. అదియును నాదే. మాయయన్న నాకు భిన్నమయినది కాదు. నా సృష్టి లోనిదే, నా వశమైనదే. అది యెట్టివారినైననూ ఒక్క నిమిషములో తలక్రిందులుచేయును. దానిని జయించుట అంత కష్టమా అని నీవు కూడనూ తలంచవచ్చును. కష్టమే. నీవు కూడనూ వాయువును సులభముగా జయించితివి కాని, మాయను జయించలేవు. అది అంతతేలికయైన పనికాదు; జయించలేవు. యెవరు నన్ను సంపూర్ణముగా ఆశ్రయించి యుందురో అట్టివారు మాత్రమే ఆ మాయను జయించగలరు.
"మాయయనగా వేరేమీ నూతనముగా వచ్చి చేరునట్టి వికారస్వరూపము కాదు. బావా! నిత్యసత్యమైన పరమాత్మను మరచి గుణకార్యములైన నామరూప పదార్థములే నిజమని యెంచుటే మాయ యొక్క గుణము, దేహి యయిన ఆత్మ తాననుకోకుండా దేహమే. తాననుకొనుట మాయ యొక్క స్వభావము, మాయ అనునది ముందుండి తరువాత పోవునది కానీ, లేనిది తరువాత వచ్చి చేరునది కానీ కాదు. ఇది ఎప్పుడూ లేదు; లేని వస్తువే మాయ. అయితే కనుపించును. ఇదియెండమావుల జలము వలె కనుపించును. అవి నీరుకాదు పుట్టనూ లేదు వాటి సత్యమును తెలిసికొనినవారిని అవి ఆకర్షించలేవు. తెలియని వారిని జలభ్రాంతి కలిగించి, అనేక విధముల శ్రమింపజేయును. ఆశాంతిని కలిగించును; నిరుత్సాహమును పుట్టించును, చీకటి ఇంటిలోనే పుట్టి ఇంటినే ఆవరించునటుల, పాచి నీటియందే పుట్టి నీటినే ఆవరించునటుల, కంటిపోర కంటియందే పుట్టి కంటిని కప్పినటుల మాయకూడనూ సామాన్యమయినది కాదు. అది యెవరియందు పుట్టునో వారినే ఆశ్రయించును. త్రిమూర్తిని. త్రిగుణాలనూ ఆవరించును.
"కానీ, జీవభ్రాంతి కలవారు దీనికి వశులగుదురు. తత్త్వదృష్టి కలవారు దీనికి ఆతీతులగుదురు. అట్టి వారిని అది ఆవరించలేదు. తత్త్య వస్తువులను గోచరించనట్లు చేయును. కానీ తత్త్వజ్ఞానులను చేరలేదు. బావా! యెక్కడ పుట్టినదో యెవరిలో పుట్టినదో వారినే ఆవరించునని మాయను గురించి చెప్పిన విషయమును పురస్కరించు కొని నీలోనే పుట్టిన మాయ నిన్ను మాత్రము ఆవరించలేదా అని నీవనవచ్చును. సంశయము కలుగవచ్చు. అది పొసగదు. మాయ సర్వజగత్తుకూ ఉపాదానకారణము. సర్వేశ్వరునికి కారణముకాదు. నేను మాయాధికారిని, మాయావరణము జగత్తు, మాయ నన్ను ఆశ్రయించి నా ఆజ్ఞలో నిలచి యుండును. నన్ను ఆశ్రయించి నా ఆజ్ఞలోయెవరుందురో, వారికి కూడనూ మాయ దాసురాలై దోసిలొగ్గును.
"పరమాత్మజ్ఞానమువలననే దానిని దాటవచ్చును. కానీ అన్యమార్గముల దాటలేరు. ప్రాణధర్మమును పరమాత్మపైఆరోపించుటే మాయ! సుఖ దుఃఖములు, మనో ధర్మములు, జనన మరణములు, దేహ ధర్మములు, ఆకలి దప్పులు, ప్రాణ ధర్మములు, ఇవి అనాత్మ ధర్మములు కానీ ఆత్మధర్మములు కావు. అనాత్మధర్మమును ఆత్మయందు ఆరోపించుటే మాయ. ఇది నన్ను శరణుజొచ్చిన వారిచెంతకు కూడనూ పోలేదు. మాయ వైపున చూపు పెట్టి చూచువానికి మాయ కూడనూ అపారమైన సాగరమువలె అడ్డువచ్చును. పరమాత్మవైపున చూపు పెట్టి చూచువారలకు మాయ మాధవుడే సాక్షాత్కరించును. భగవదైక్యభావముతో కాని శరణాగతితో కాని మాయ ప్రతిబంధాన్ని అతిక్రమించవచ్చు. ఒక దానిని జ్ఞానమార్గమనియూ మరొకదానిని భక్తి మార్గమనియూ పిలుతురు.
లోకమున సామాన్య మానవులకు భగవంతుని శరణుజొచ్చి మాయను జయించవలెనను బుద్ధి పుట్టదు. ఆది వారివారి జన్మాంతర సుకృత దుష్కృతములనుపట్టి ఉండును. దుష్క్మలు కేవలము భోగలాలనులై క్షణానందమునకుప్రాకులాడుదురు. పశుపక్షి మృగముల వలే తిని తిరుగుచూ తాత్కాలిక ఆనందములతో తందనా లాడుచుందురు. ఇట్టిదే జీవిత లక్ష్యమని భావించి దైవచింతయే లేక,సత్ సంగ మన్న అసహ్యించు కొనుచూ, సదాచారమన్న గిట్టనివారై వట్టి భ్రష్టులగుచుందురు.
(గీ.పు.112/114) |
మాయకు సత్వరణ స్తమోగుణములు మూడు మూలాధారములు. మోహమునకు ధనేషణ, దారేషణ, పుత్రేషణ మూడు మూలాధారములు. తమోగుణమును, రజోగుణమును, సత్వగుణమును నిర్మూలం గావించుకున్న తరువాత, వాడు మానవుడు కాదు. మాయ తన దగ్గర ఉండదు. మానవుడు మాయనుండి వేరు కావాలని తలంచినప్పుడు ఈ త్రిగుణములను దూరం చేసుకోవాలి. ఈ త్రిగుణములు ఉండినంతవరకు మాయ అతనిని వీడదు. ఇంక, మోహమును ఏరీతిగా త్యజించాలి? ధనేషణ, దారేషణ, పుత్రేషణ - యీ మూడూ లేని మనస్సుకే మోహము నిర్మూలమవుతుంది.
(ఆ.భా.పు.64)
సంజయుడే ధృతరాష్ట్రునకు తెలిపెను ఎచటయోగీశ్వరుడైన కృష్ణుడు, ధనుర్ధారియైన అర్జునుడుందురో అచ్చట విజయము, సంపత్తు లభించును" మనకు ఇంతకంటే వేరు ఆదర్శము యెందుకు? విజయమునకు తాపత్రయపడనక్కరలేదు. తహతహలాడ పనిలేదు. ఐశ్వర్యమునకు, పరితపించనక్కరలేదు. పరమాత్ముని హృదయమున చేర్చుకొనుము. ధైర్యమును ధనుస్సును ధరించుము. అనగా నిర్మల హృదయుడవు కమ్ము, విజయము, ఐశ్వర్యము నీదే. నీడను వెంటాడితివా? కోట్లకొలది సంవత్సరములకైనను అది నీకు లభించదు. అది నీకంటే ముందు గనే పరెగెత్తును. అయితే నీ దృష్టి సూర్యునివైపు మరల్చితివా, నీ నీడ నిన్ను ఆశ్రయించును. అనగా నీ నీడ నీ వెనుక నిన్ను ఆశ్రయించుచూ రాగలదు. నీకు బానిసయై వర్తించును. ఇక్కడ నీడ ఒక మాయ, మాయను ఆశ్రయించు నంతకాలము నీకు మాధవుడుదక్కడు, చిక్కడు, మాయను బానిసగా చేసుకొంటివా, మాధవుడు గమనశీలుడు కాగలడు.
(వి.వా.పు.40/41)
సూర్యాస్తసమయము కానున్నందున, విశ్వామిత్రుడు రామలక్ష్మణులను పిలిచి మృదు మధురమైన పలుకులలో "నాయనలారా! ఆలస్యము చేయక నదిలో ఆచమింపుడు. సమస్త మంత్రములకు మూలాధారములైన "బల అతిబల" అను రెండు మంత్రములను ఉపదేశింతును. ఈ మంత్రములు మహా ప్రభావము కలవై యుండును. ఇవియెట్టి అలసటనైననూ క్షణములో తీర్చి హాయిని కలిగించును. ఎన్ని పనులు చేసిననూ అలసట కలిగించక, వ్యాధులను రానివ్వక, రాక్షసుల బాధలు కలుగకుండ రక్షించును. ఇంతే కాదు దారిలో నడుచుచున్న సమయాలలో ఈ మంత్రములను స్మరించుచూ వెళ్లిన ఆకలి దప్పులు లేక ఆనందోల్లాసముల నొసంగి అతి బలమును కలిగించుచూ వచ్చును.
“రామా! "బల అతిబల" అను ఈ రెండు మంత్రములు సర్వమంత్రములకే కాక సమస్త శక్తులకు తేజోవంతమైనవి." అని ఇంకనూ ఆ మంత్రముల మహత్తరమైన శక్తి సామర్ధ్యములను విశ్వామిత్రులవారు వర్ణించుచుండ, సర్వజ్ఞడైన రామచంద్రుడు దాని విషయము యేమీ తెలియని వానివలె, తల ఊపుచూ ఆశ్చర్యముగా వినునట్లు నటించుచుండ, లక్ష్మణుడు ఇరువురినీ చూచుచూ, తనలో తాను నవ్వుకొనుచుండెను.
ఇచట లోకోపదేశ నిమిత్తమై రాముడు ఒక విచిత్రమైనప్రబోధ చేసిరి. అది యేమన మాయ యెట్టి వారినైనను క్షణములో తలక్రిందుచేయుననియునూ, చేహాభిమానమున్నంతవరకు మాయ మమజుని వీడ దనియూ ఇది తపస్సులతో, జ్ఞానముతో, పేరు ప్రతిష్ఠలతో, శక్తి సామర్థ్యములతో తొలగునది కాదనియునూ, తాను ఆత్మ స్వరూపుడనని తెలిసికొని, సమత్వ బుద్ధితో జగత్తును చూచుటతో ఈ మాయ మరుగు పడుననియూ ఒక నీతిని నిరూపించిరి. కాకున్న. "బల, అతిబల" ఆతిశక్తివంతమైన మంత్రములు తనచెంత నుండియూ, తాను తపోసంపన్నుడైనప్పటికినీ, యజ్ఞసంరక్షణార్ధమై దానికి తగిన శక్తి సామర్థ్యము కలవాడు శ్రీరాముడే యని గమనించియూ, రాముడు సామాన్యుడు కాడులోక రక్షకుడు. అతడు చేయలేని కార్యమంటూ యొకటి జగత్తున లేదని దశరథుని చెంత వర్ణించి, పుత్రవాత్సల్యమే నిన్నింత అమాయకుని చేసినదని బోధించి ఇక్కడ, మాయాబంధితుడై గుణమోహితుడై రామ లక్ష్మణులను సామాన్య పిల్లలవలె భావించి, వారలకు మంత్రోపదేశము చేయుటకు పూనుకొనుటలో మాయ యొక్క ప్రభావమును నిరూపించుటయే దీని అంతరార్థమని చెప్పక చెప్పుచున్నది.అట్టి మాయను విశ్వామిత్రుని యందు ఆ నిమిషమున ప్రవేశింప చేయకున్న రామసంకల్ప కార్యము జరుగనేరదు. మహర్షులలో ప్రవేశించిన మాయ కూడను మహత్తర కారణములను చేయించును.
విశ్వామిత్ర మహర్షి ఆజ్ఞానుసారము, రామలక్ష్మణులు సరయూనదిలో ఆచమించిరి. విశ్వామిత్రుడు రామలచెంతకు వచ్చి ఆ రెండు మంత్రములను ఉపదేశించెను. మాయామానుష రూపుడైన రాముడు విశ్వామిత్రుడు చెప్పి నటులనే పలికి, తలనూపుచూ, శిష్యత్వము అందుకొన్నటుల ప్రదర్శించెను.
(రా.వా.మొ.పు.70/71) ||
దేహమును ఆధారము చేసుకొని, అంతర్ దృష్టిని మనం అభివృద్ధి గావించుకొని బహిర్ ముఖమైన మనస్సును అంతర్ముఖముగా మార్చుకోవాలి. ఈ విధముగా ప్రాక్టీసు చేస్తూ వస్తే తప్పక ఈ సత్యమును మనము అనుభవించవచ్చును, గుర్తించవచ్చును. దీనినే ఆత్మ సాక్షాత్కారమన్నారు. అనగా నేను అనే తత్త్వము ఏ మూలము నుండి వచ్చిందో ఆ మూలములో చేర్చాలి. ఒక చిన్న ఉదాహరణ నీవు తెల్లవారి నడుస్తున్నావు. సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు. నీవు పడమటి వైపు ప్రయాణము చేస్తున్నావు. పడమటి వైపు ప్రయాణము చేసేంత వరకు నీ నీడ నీ కంటే ముందుగా వెడుతున్నది.కానీ నీ నీడను దాటి పోవాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నావు. ఇది అసాధ్యము. ఎందుకనగా సూర్యునికి విరుద్ధముగా నడుస్తున్నావు. కనుక నీ నీడ నీ కంటె ముందుగా పోతున్నది. ఎంత తీవ్రముగా వెళ్ల ప్రయత్నించినా అంత తీవ్రముగా ముందు వెడుతుంది. దీనితో పోరాడి ప్రయోజనము లేదు. నీ ముఖము సూర్యుని వైపు తిప్పు. అప్పుడు నీనీడ నీవెనుక పడిపోతుంది. ఇదియే ఈనాడు జరుగుచున్న ప్రపంచ పరిస్థితి. భగవంతునికి విరుద్ధముగా ప్రకృతి దిశవైపు ప్రయాణము చేస్తున్నావు. నీకంటే ముందుగానే మాయ అనే ప్రతిబింబము నడుస్తున్నది. ఈ విధముగా విరుద్ధమైన ముఖము పెట్టుకొని మాయను వెనుక వేయాలంటే సాధ్యము కాదు. నీ దృష్టి భగవంతుని వైపు తిప్పు. ఈ మాయఏ సాథనలు చేయకపోయినా వెనకపడిపోతుంది. కనుక ఈనాడు మనం మార్చవలసింది ఏమంటే మనస్సుయొక్క దృష్టిని మార్చాలి. ప్రకృతిభావములో నుండిన దృష్టిని పరమాత్మ భావములోకి మార్చుకోవాలి. ఇదియేఈనాడు చేయవలసిన సాధన.
దృష్టిదోషమే కాని, సృష్టిదోషము లేదు:
ఈ ప్రకృతి భావము కేవలము మాయ . మాయను తప్పించుకోవాలంటే భగవంతుని వైపు మరల్చాలి. మాయ, మనస్సు ప్రకృతి ఒక్కటే. కనుక ప్రకృతి వైపునున్న మనస్సు పరమాత్మ వైపు మరల్చాలి. అనగా ఆంతర్భావమును మార్చుకోవాలి. అప్పుడే ప్రకృతి దూరమై పరమాత్మ సమీపుడౌతాడు. దీనినే పశ్యన్నపి చ న పశ్యతి మూఢో" అయ్యా! నీవు భగవంతుని చూస్తున్నావు. ఎక్కడ చూస్తున్నావు? ఇదంతా భగవత్స్వరూపమే. నాకు భగవంతుడు కనిపించాలని ఆశిస్తున్నావు. చూచేది భగవంతుడినే. దీని కంటే ప్రత్యేకంగా ఏమి కనిపించగలడు? అయితే నీవు ఏ భావముతో చూస్తున్నావు. దీనిని ప్రకృతి భావముతో చూస్తున్నావు. నీకు భగవంతుడు కనిపించటం లేదు. దీనిని భగవద్భావముతో చూడు ప్రకృతి నీకు కనిపించదు. నీ దృష్టి దోషమేగాని సృష్టి దోషము లేదు.
(ద.స.స.....పు.87-89)
మాయ అనగా ఏమిటి? సత్త్వరజస్తమో గుణముల స్వరూపమే మాయ. కనుక, మానవుడు ఈ త్రిగుణములను అరికట్టిన నాడు మాయకు ఆతీతుడై జీవిస్తాడని వేదము యొక్క ప్రమాణము. ఇంక మోహమంటే ఏమిటి? ధనేషణ, దారేషణ, పుత్రేషణ - ఈ ఈషణత్రయము చేతనే మోహము పెరిగి పోతున్నది. వీటిని జయిస్తే మోహమే ఉండదు. జీవితంలో అనేక కష్టనష్టములు ఎదురౌతుంటాయి. వీటిని తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగిన వాడే నిజమైన మానవుడు. మానవుని దుఃఖమునకు, విచారమునకు మూలకారణం మితిమీరిన కోరికలే! "న శ్రేయో నియమం వినా" - వీటి యందు మనం సరియైన నియమాన్ని పాటించాలి..
(స.సా.వ.94పు.281/282)
అంతను తానాయె అంతయు లోనాయె
మాయకు లోనాయె మాయ తానాయె
మాయ యిరువదియైదు మంత్రములాయె
మాయ యిరువదియైదు మంత్రములు తెలసితే
మాయ మాయ మాయ మరిబయలాయె.
అంతా మాయ తత్వంగా కనిపిస్తుంది.
(శ్రీ.. స.పు.80)
మాయలో పుట్టి మాయలో పెరిగి
మయనెరుంగరుమందమతులు
బ్రతుకులన్నియు మాయ భవబంధములు
మాయ సంసారమది మాయ చావుమాయ
మాయ బ్రతుకు కింత మాయలో పడనేల?
(ము.ము.పు. 32)
పాదముల నాశ్రయిస్తే పరమాత్మను పట్టవచ్చు
మాయ భగవంతుని నీడవలె వెన్నంటి ఉంటుంది. ఈ మాయను ఏరీతిగా మనము దూరం చేసుకోగలము? మొదట ఈ నీడకు, భగవంతునికి ఎక్కడ సంబంధం ఉన్నదని మనము విచారణ చేయాలి. పాదాల దగ్గర తప్ప ఇంకెక్కడా నీడకు దేహముతో సంబంధము ఉండదు. ఇప్పుడు నా స్వరూపం మైకు ముందు నిల్చున్నది, నా నీడ నేలమీద పడుతున్నది. నాకూ, నీడకూ తల దగ్గర ఏమైనా సంబంధం ఉన్నదా? లేదు. - భుజాల దగ్గర ఏమైనా సంబంధం ఉన్నదా? లేదు. చేతుల దగ్గర ఏమైనా ఉన్నదా అంటే, లేదు. పోనీ, కాళ్ళకు పైనేమైనా ఉన్నదా అంటే, లేదు. పాదాల దగ్గర మాత్రమే నాకు, నీడకు సంబంధం ఉన్నది. అనగా, మాయ భగవంతుని పాదం క్రింద ఉంటుంది. - కనుక, భగవంతుని పాదం గట్టిగా పట్టుకుంటే మాయ దూరమైపోతుంది. పాదం పట్టుకోవటంలో అంతరార్థం ఇదే! దీనికి భాగవతం ఒక చక్కని దృష్టాంతం అందిస్తోంది. చిన్ని కృష్ణుడు పాలు, పెరుగు, మజ్జిగ తాను లి, స్నేహితులకందించి, కుండలోని పాలు పారబోసి, అందులో తన పాదములు తడుపుకొని, గోపికలు వచ్చేసరికి పరుగెత్తిపోయేవాడు. కృష్ణుని పాదముద్రలను ఆధారం చేసుకొని వెళ్ళి గోపికలు ఆచిత్తచోరుని పట్టుకోగలిగేవారు. పరమాత్మను తెలుసుకోవాలంటే అతని పాదములను - ఆశ్రయించాలని ఈ సన్నివేశం చక్కగా బోధిస్తోంది. -శ్రీసత్యసాయి. (స.సా. డి. 2020 నాల్గవగ కవరు)
మాయలో పడిపోతారు
“నేను తల్చుకొంటే ఆకాశమే దిగి వస్తుంది. నన్ను గొప్పగొప్ప బిరుదులతో వర్ణిస్తూ శ్లాఘిస్తూ ఉంటారు కదా. మరి సమయం వచ్చినప్పుడు అవన్నీ మరచిపోయి మాయలో పడిపోతారు. నేను అలా కన్నెత్తి చూస్తే చాలు, సర్వమూ సిద్ధమైపోతుంది” (సనాతన సారథి, జనవరి 2019 పు16)