పంచభూతములు మానవునికి ప్రధానమైన పంచప్రాణములు, ఈ ప్రాణములే లేకుండిన జీవితమే లేదు.ఇందులో వాయువు అనే ప్రాణము సర్వత్రా వ్యాపించి యుంటున్నది. కాని మనకు కనిపించదు. చేతికి చిక్కదు. కనిపించనంత మాత్రమున లేదని భావించరాదు. గాలిలేకపోతే నీవు ఎలా ఉన్నావు?అదియే నీ శ్వాస. ఈ శ్వాస ఉండినంత వరకే ఇది శివం ఈ శ్వాసనే పోతే శవం కాబట్టి శ్వాసనే ఈశ్వర స్వరూపం. ఈ శ్వాసనే నిజమైనటువంటి గాలి స్వరూపము. ఈ స్వరూపాలతో భగవంతుడు మానవుని యందు సంచిరస్తూ, శతవిధాలా మానవుని సంరక్షిస్తున్నాడు. కనుక భగవంతుడు అంటే ఏదో ఒక పెద్ద ఆకారంలో ఉన్నాడని భావించరాదు. ఆ ఆకారములన్ని మనం కలిపించుకున్నవే. భగవంతునకు నాల్గు చేతులు పెట్టారు, శంఖం, చక్రము, గద, పద్మములు పెట్టారు. భగవంతునకు నాలుగు చేతులున్నాయా? లేదు. భగవంతుడుసర్వశక్తి మయుడుఅని గుర్తింపచేయటానికి నాలుగు చేతులుగా పెట్టారు. ఒక చేతిలో శంఖం. ఆ శంఖమే శబ్ద బ్రహ్మము. ఇంకొక చేతిలో చక్రము. ఆ చక్రమే కాలచక్రము. కాబట్టి ఈ శబ్దము, కాలము భగవంతుని చేతిలోనే ఉంటున్నాయన్నమాట. మరొక చేతిలో గద, గద అనగా బలము, బలము కూడా భగవంతుని చేతిలోనే ఉంటున్నది. మరొక చేతిలో పద్మము. అనగా హృదయము. ఇది కూడానూ భగవంతుని చేతిలో ఉంటున్నది. ఇవన్నీ అర్థం గావించుకొనే నిమిత్తమై ఈ విధమైన ఆకారములు నిర్మస్తూ వచ్చారు. ఆకారము కాదు. మానుషాకారమే శాశ్వతమైన ఆకారము. అటువంటి దైవం మానుషరూపేణ. కనుక ఆ మనుష్య నిజస్వరూపం లోపల ఏది ఉత్తమమైనదో ఏది పవిత్రమైనటువంటిదో, ఏది సర్వకర్మకూ ఆధారమైనటువంటిదో, ఏది సర్వాధారమైనటు వంటిదో, అలాంటి మానవత్వాన్ని మనం విశ్వసించాలి. మనకు ప్రసాదించిన ఇంద్రియాలను సద్వినియోగపరచాలి. ఆప్పుడే నీవు నిజమైన మానవుడవు అయిపోతావు.
(శ్రీ. న.2001.పు.8)