గరికపోచలు రాలె గణనాధు పూజకు
ఇంతకన్నను హీనులైరి వరులు
కావుకావు మటంచు కాకి వేడుటలేదె
ఇంతకన్నను నికృష్ణులైరి జనులు
అంబ అంబా అంచు అరచదే లే లేగ
ఇంతకన్నను పలుచనైరి జనులు
రామా రామా యంచు కామించదే చిలుక
ఇంతకన్నను తక్కువైరి జనులు
మానవుల కంటే మృగములే మంచివేమొ
ఇంత విజ్ఞానముండియు ఏమి ఫలము?
మానవత్వము కోల్పోయి మనిషి నిలిచే
ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు?"
(సే.యో.పు. 10)
వివిధ జాతుల వన్య మృగములు స్వేచ్ఛగా తిరుగుచుండు ప్రదేశములను సందర్శించితిమి. ఒకనాటి రాత్రి చెట్లపై సమర్చబడిన మంచ నధిష్టించి కౄర సత్వ స్వేచ్ఛా విహారములను ఆనందముగ గమనించు చుంటిమి. సింహములను, చిరుతపులులను, జీబ్రాలను, జిరాఫీలనుమొదలగు జంతు జాతుల నెన్నింటినో పరికించితిమి. అరణ్యమునందలి మృగజాతు లన్నియు కొంతవరకు అన్యోన్యముగ జీవితములు గడుపుచుండుటను చూచినప్పుడు పరస్పరము ద్వేషాసూయలతో గూడి కలహించుకొను మానవుల జీవితము లెంత శోచనీయములని గోచరించుచుండును. మానవుని కంటే మృగములే తమ తమ ధర్మములను సకాలమున నెరవేర్చు చుండు ననుట అతిశయోక్తి కాదు. మానవుడు తన దైవస్వభావమును మరచి పైశాచిక భావమునకు దిగజారిపోవుట అత్యంత శోచనీయము. జంతువులును, పక్షులునూ స్వధర్మముల ననుష్ఠించుచుండ మానవులు స్వధర్మముల వీడి పరధర్మావలంబులై భ్రష్టులగుచుండుట గమనార్హము.
(స. శి.సు.ది.పు.290/291)