ఎలాంటి కష్టసమయములయందుగాని, ఎలాంటి బాధల యందుగాని దైవాన్ని మాత్రం వదలరాదు. దైవం ఒక్కడే.
హెచ్చుగ సంపదలొచ్చినగాని
ఏనుగు గుఱ్ఱములెక్కినగాని
పిచ్చోడని పేరొచ్చినగాని
ప్రియముతో పెద్దలు పొగిడినగాని
దేవుని మరువకురా!
ఉన్నది దైవము ఒక్కడురా!
దుష్ట జనులు దూషించినగాని
దోషరహితుడై వుండినగాని
కష్టములెన్నో వచ్చినగాని
కాయము వ్యాధుల చిక్కినగాని
దైవము వదలకురా!
ఉన్నది దైవము ఒక్కడురా!
యోగాభ్యాసము చేసినగాని
భాగవతాదుల చూచినగాని
పండితుడని బిరుదిచ్చినగాని
పాపిష్టొడని అన్ననుగాని
దైవము వదలకురా!
ఉన్నది దైవము ఒక్కడురా!
నిందకు లోబడి నిలిచినగాని
నిండుచదువులే చదివినగాని
నిండు కుండవై వుండుమురా
నీవు ఎండని కుండగనుండకురా
దైవము ఒక్కడురా!
ఉన్నది దైవము ఒక్కడురా!
ఇలాంటి దైతత్వమును ఏనాటికి మరువ కూడదు. ఉన్నది ఒకే దైవమనే సత్యాన్ని మనం గుర్తించాలి. నా లోపల, నా వెలుపల నా సర్వత్రా వున్నటువంటిది దైవమే. దైవమే అనే సత్యాన్ని గుర్తించాలి. దైవము సమిష్టి స్వరూపం. దైవము ప్రేమస్వరూపుడు. ప్రపంచమంతా ప్రేమమయమే. ప్రేమ దృష్టిని మనం పెంచుకోవాలి. మన జీవితం ప్రేమమయంగా మారుతున్నప్పుడు జగత్తంతా బ్రహ్మ మయంగా మారుతుంది.
(శ్రీ ఆ. 98పు. 8)