యువతీ యువకులారా! నేను అధికంగా మాట్లాడి మిమ్మల్ని శ్రమ పెడుతున్నానో ఏమో! నేను ఈ విధంగా మంచి విషయాలు ఎంత సేపైనా మాట్లాడగలను. ఎవరికైనా ఉపయోగపడే మాటలు ఎన్నైనా మాట్లాడతాను. నిరుపయోగమైన మాటలు నేను మాట్లాడను. మీరు చాల పవిత్రమైన జీవితాన్ని గడపవలసినవారు. సత్యసాయి సంస్థల బాధ్యత మున్ముందు మీరే నిర్వహించవలసి ఉంటుంది. మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క రాష్ట్రానికి లీజర్ గాఉండాలి. అయితే, ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి - రాజకీయాలతో మీకు సంబంధం లేకుండా చూసుకోండి. సమాజాభివృద్ధిని కోరండి. దానికోసం మీరు ఎంతైనా పాటుపడండి. అదే గొప్ప తపస్సు, ప్రశాంతి నిలయంలో ఉన్నంత వరకు మంచిగా ఉండి, బయటికి పోతూనే తోకలు తిప్పకూడదు. అది మంకీ మైండ్ లక్షణం. మీరు డివైన్ మైండ్ తో ఉండండి: డీప్ వైన్ లో మునగకండి! అలాంటి పవిత్ర హృదయులైన యువ యువకులు నాకు అత్యవసరం. వారందరూ నాకు సమీపులే. అలాంటివారే నాడియర్ ఫ్రెండ్స్ (ప్రియ మిత్రులు). మీరు స్వామికి డియర్ ఫ్రెండ్స్ కావాలను కుంటే, స్వామి చెప్పినట్లు నడుచుకోండి. అప్పుడు మీరిక్కడకు రానక్కర్లేదు. నేనే మీవద్దకు వస్తాను. నేను మీతోనే ఉన్నాను. మీ లోపలున్నాను, వెలుపలున్నాను, మీ ముందు ఉన్నాను, వెనక ఉన్నాను. ఇట్టి విశ్వాసాన్ని అభివృద్ధి పర్చుకోండి. నేను మీకంటే ప్రత్యేకంగా లేను. నేను, మీరు ఒక్కటే. ఇట్టి ఏకత్వాన్ని గుర్తించి, దివ్యత్వాన్ని పొందటానికి మీరు ప్రయత్నం చేయండి. పవిత్రతను పెంచుకోండి. నిరంతరము దైవచింతన చేయండి. అప్పుడు మీరు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతారు.
(స.సా.పి.2000 పు.58/39)