ప్రాణాయామం క్రమపద్ధతిలో జరుపవలసిన సాధనా ప్రక్రియ. నియమిత విధానంలో జరుపనిచో ప్రమాదం కూడా సంభవించవచ్చు. ప్రాణాయామంలో మూడు అంశములున్నవి. మొదటిది, పూరకము అనగా, నాసిక ద్వారా గాలిని పీల్చుకొనడం. రెండవది, కుంభకము. ఇది గాలిని స్థంభింపజేయటం. పూరకమునకు ఎంత కాలం తీసుకుంటావో అంత కాలం కుంభకంలో గాలిని బిగపట్టాలి. మూడవది, రేచకము లేక గాలిని వదిలివేయటం. రేచకమునకు కూడా పూరక, కుంభకములకు తీసుకున్నంత కాలాన్ని తీసుకోవాలి. అంటే, మూడు దశలలో సమంగా గాలిని తీసుకోవటం, బిగపట్టటం, వదలటం జరగాలి. ప్రాణాయామం మన శ్వాసము నియమబద్ధం చేస్తుంది. శ్వాస వేగం ఎక్కువగా ఉన్న జీవులు దీర్ఘ కాలం జీవించవు. ఉదాహరణకు, ఒక్క శ్వాస వేగం ఎక్కువ. కనుక, అది దీర్ఘ కాలం జీవించలేదు. పాము, ముంగిసల శ్వాస వేగం తక్కువ కావడంచేత అవి దీర్ఘ కాలం జీవిస్తాయి.
(స.సా.ఏ. 2000 పు. 127)