ఇక్కడ ప్రాణ శబ్దమున చెప్పబడినది. ప్రాణవాక్యముబ్రహ్మమే అగునుగాని అర్థములు అనగా ఇంద్రుడు, రుద్రుడు, వాయువు ఇత్యాది అర్థములు కావు.
ఒకానొక సమయమున ప్రతరథనుడు మనుష్యునకు అత్యంత హితము కలిగించునదేదో తెలుపమని ఇంద్రుని ప్రార్థించగా, అప్పుడు ఇంద్రుడు ప్రాణము నేను.నన్ను నీవు ఆయువనియు తలంపుమని, ఉపాసింపుమని అంటాడు. ఇంకనూ అనేక విధుల ప్రాణమును వర్ణించుచును ఏష ప్రాణ ఏవ "ప్రజ్ఞాత్మానందోఽ జరోఽ మృతః" అన్నారు. అనగా ఆ ప్రాణము ఆనందస్వరూపము, అజరము, అమీతము అని ప్రబోధిస్తాడు. ఈ వాక్యమునందు కూడా ప్రత్యక్షముగా బ్రహ్మలక్షణములే చెప్పబడినవి. ఏతా వాతా చక్కగా పరిశీలించి చూచిన ప్రాణ వాక్యమునకు ప్రాణశబ్దమును, బ్రహ్మమనే (పరబ్రహ్మమనే) అర్థము వివరమగుచున్నది. కానీ, అన్య అర్థములు కనిపించవు, అన్య అర్థములు కావు.
మరొక విధముగా విమర్శించి చూచిన మనుష్యునికి హితమైనది ప్రధానమైనది యేది అంటే ప్రాణము అని స్థూలార్థము కాగలదు. కాని ఆ ప్రాణము బ్రహ్మ వాచయమగుటచేత పరబ్రహ్మ ప్రాప్తి మనుష్యునికి హితము, ప్రధానము అని తేలుచున్నది. లోకములోని సామాన్య మానవులు, వ్యావహారిక రీతిని ధన, కనకవస్తు వాహనాదులు ప్రధానములని భావింతురు. ఆవియే జీవిత లక్ష్యములని వాటివెంటబడి వాటిని సంపాదించుకొనుటకు ప్రయత్నింతురు.
ఈ ప్రయత్నములో మానవుడు తన అమూల్యమైన మానవత్వమును వ్యర్థము గావించుకొనుచున్నాడు. జీవితమును వ్యర్ధము గావించుకొనుటయే కాక పూర్ణ అజ్ఞానమును పెంచుకొనుచున్నాడు. తన స్వరూపాన్ని విస్మరించుచున్నాడు.
మరొక సమయమున ఇంద్రుడు ‘మామేవ విజానీహి అన్నాడు. అనగా నన్నే బాగా తెలుసుకొమ్మని అర్థము. ఇక్కడ కూడా ఇంద్రుడనగా అవయవములు కల ఒకానొకదేవత అని, ఆ దేవతయే ప్రాణ శబ్దము చేత చెప్పినవాడు కావలయును. ఇక్కడ బ్రహ్మమనుటకు వీలు లేదు అనుతలంపుతో ప్రాణమనగా ఇంద్రుడు అనిచెప్పిరే కాని ఇది సరికాదు. ప్రాణ శబ్దముపర బ్రహ్మమే అని తలంచవలెను. ఇంకా కొందరు దేవేంద్రుడు తన యందున్న పరబ్రహ్మ స్వరూపమును తెలుసుకొమ్మని చెప్పియుండవచ్చును అన్నారు. ఈ కారణము వలన ఇచ్చట ప్రాణ శబ్దము పరబ్రహ్మకే సంకేత మని గ్రహించిరి. లౌకికదృష్టిలో ప్రాణశబ్దమును ఇంద్రునకు సంబంధము కలిగించుచున్నారు. ఆధ్యాత్మికంగా భూమా అనగా పరబ్రహ్మముతో మిక్కిలి సంబంధము కలిగియున్నది. దీనిని పురస్కరించుకొనే భాష్యకారులు అనేక విమర్శలు చేసి వ్యావహారిక పారమార్థికంగా పరిశీలన జరిపి రెండింటిని సమన్వయ పరచి రెండింటి యందూ వున్న తత్వము ప్రాణ మేయనియు,ఈ ప్రాణము బ్రహ్మకే సంకేతమనియు నిర్ణయించిరి. ప్రాణము బ్రహ్మమునకు అవినాభావ సంబంధమనియు రెండు ముఖములలో కూడిన నాణెము వంటిదనియు ఒక దానిని విడచి మరొకటి వుండలేదనియు, వీలు కాని దనియు నిర్ణయించిరి.
మొత్తము పై ప్రాణ శబ్దము పరబ్రహ్మమే అన్నది పరమ సత్యము. ఉపాస్య దేవత పరబ్రహ్మమే కాని వేరొకటి మరొకరు కాదు - అని తాత్పర్యము.
"శాస్త్ర దృష్ట్యాతు ఉపదేశ వామదేవవత్" వాసు దేవుడను మహాముని ఉపదేశించిన ప్రకారముగా శాస్త్ర దృష్ట్యా అహం బ్రహ్మాస్మి. తత్త్వమ్ అపి, ప్రజ్ఞానం బ్రహ్మా, అయమాత్మా బ్రహ్మవాక్యములను వినుట వలన కలిగిన అపరోక్ష బ్రహ్మజ్ఞానముచేత, పై అహం బ్రహ్మాస్మి అను వాక్యమును ధ్యానము చేయుటచేత, ప్రాణ శబ్దమునకు ఇంద్రుడు అని ఉపదేశము చేయుటలో తప్పులేదని భావింతురు. ఇది అనుభూతికి రాకమునుపు తోచిన భావము. అనగా బ్రహ్మాజ్ఞానము కలుగక పూర్వము వాసుదేవ మహాముని, ప్రాణమనగా ఇంద్రుడు అని తలంచి యుండవచ్చును. బ్రహ్మజ్ఞానము కలిగిన తరువాత అహం మనురభవం నేనే సర్వాత్మకుడనని యెట్లు చెప్పెనో అటులనే ఇంద్రుడు పరిపూర్ణ జ్ఞానము కలవాడగుటచే ఇంద్రుడు ప్రాణపదముబ్రహ్మము అని చెప్పుటలో విరోధము లేదని మరికొందరు భావింతురు.
బ్రహ్మమునకు యేమైనా చెప్పవచ్చును. ‘సర్వం బ్రహ్మ, సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మ, సత్యం బ్రహ్మ, ప్రాణం బ్రహ్మ, అనంతం బ్రహ్మ, జ్ఞానం బ్రహ్మ సర్వం బ్రహ్మ ఈ వాక్యములను ఆధారము చేసుకొని అన్నింటిని బ్రహ్మవాక్యమునకే సమన్వయపరచవచ్చును. సర్వం బ్రహ్మము నుండి వెలువడినవే.
(సూ.వా.పు.31/54)