భక్తునియొక్క హృదయం భగవంతుని కోసం ఎంతగా పరితపిస్తుందో, భగవంతుని హృదయం కూడా భక్తునికోసం అంతగా పరితపిస్తుంది. భగవత్తత్త్వాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. కొన్ని సందర్భాల్లో "భగవంతుడు ఇంత చిన్న పని చేశాడే!" అని మీరు అనుకుంటారు. కాని, చిన్న పని, పెద్ద పని అనేది లేదిక్కడ. భక్తులను రక్షించే నిమిత్తం తాను ఎలాంటి పనైనా చేస్తాడు. భక్తులే లేకపోతే భగవంతుడెక్కడ? భగవంతుని గొప్పతనమును వర్ణించేది, నిరూపించేది భక్తులేకదా! ఇప్పుడు ఇక్కడ యింతమంది చేరారు. ఎందుకోసం? ఒకే జవాబు. మీదగ్గర లేనిది, మీ యింటిలో చిక్కనిది, మీ ఊరిలో దొరకనిది ఏదో ఒకటి యిక్కడున్నది. దాన్ని పొందేకోసం మీరు ఇక్కడికి వచ్చారు. అంతేగాని, ఊరికే రమ్మని చెబితే వస్తారా?మీలో లేనిదిసాయి ప్రేమ,మీ ఊరిలో లేనిది సాయిప్రేమ. కాబట్టి, ఈప్రేమను పొందటానికి మీరిక్కడికి వచ్చారు. దానిని పొంది తీసుకొనిపొండి. సాయి ప్రేమను మీ హృదయాల్లో నింపుకోండి. కాబట్టి, భక్తులే లేకపోతే బాబా ఎక్కడ? బాబా లేకపోతే భక్తులెక్కడ? బాబాకు భక్తులకు మధ్యనున్న సన్నిహిత సంబంధ బాంధవ్యం విడదీయరానిది. బాబా ప్రాణమే భక్తులు, భక్తుల ప్రాణమే బాబా. యిరువురిదీ ఒకే ప్రాణమే. కనుక, ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకొని ఎక్కడైనా ఉండండి, బాబా మిమ్మల్ని రక్షిస్తూనే ఉంటాడు. భక్తులైన వారు ఎలాంటి పరిస్థితియందూ ఎలాంటి బాధలూ పొందరు. చరిత్రలో మీరు చదివియే ఉంటారు. భగవద్భక్తులకు ఏ చేటూ, ఏ లోటూ రాదు. మీ హృదయాలలో పవిత్రమైన భక్తి స్థిరంగా ఉన్నప్పుడే అనుగ్రహం సిద్ధిస్తుంది. అంతేగాని మధ్యమధ్య పెండ్యులం మాదిరి భక్తి యిటూ, అటూ చలిస్తుంటే అనుగ్రహం చిక్కదు. మీ హృదయం నిశ్చలమైనదిగా నిస్వార్థమైనదిగా ఉండాలి. సముద్రంలో గండశిలలుంటాయి. వాటిని నిరంతరము అలలు వచ్చి కొడుతూనే ఉంటాయి. అలలు వదలవు. శిలలు కదలవు. మీ హృదయం కూడా ఆగండశిలల మాదిరి నిశ్చలంగా ఉండాలి. ప్రపంచంలో అనేక అవస్థలు వచ్చి మిమ్మల్ని కొడుతుంటాయి. కాని, మీరు కదలకుండా స్థిరంగా ఉండాలి. అదియే నిజమైనభక్తి.
ప్రేమస్వరూపులారా! దేన్నైనా మీరు సుఖంగా వదలవచ్చునుగాని, దైవాన్ని మాత్రం వదలకండి, మరువకండి. ఈ సత్యాన్ని మీ హృదయంలో భద్రం చేసుకోండి. అదియే మిమ్ము సర్వ విధముల రక్షిస్తుంది.
(ఆ.భా.పు.61/62)
ప్రాణము ప్రకాశించుచున్న అన్ని జీవులయందు, ప్రణవ స్వరూపముగా పరమాత్మ నివసించుచున్నాడు. దీనిని గుర్తించినవాడే, మానవుడు. మానవుడుగా జన్మించి, మానవుడుగా జీవించి, దైవత్వము గుర్తించి మరణించ వలెను. సర్వ భూరతాంతరాత్మ అనేది దేవుని అందరి లోనూ గుర్తించి వర్తించవలెను. అందరియందూ తనలోనిదైవమునే దర్శించి ఆచరించవలెను. అట్టి విశాల భావమే స్వర్గము; దానికి విరుద్ధముగా సంకుచితమైన భావమే, నరకము.
(స.సా.ఆ.75 పు.133)
ఒకానొక సమయంలో జనకమహారాజు గొప్ప యజ్ఞమును ప్రారంభించాడు. ఈ యజ్ఞమునకు మహామహా పండితోత్తములందరూ వచ్చారు. ఇందులో మహా పండిలులైన మైత్రేయ, శాండిలిని. గార్గి మొదలైనస్రీలుకూడా వచ్చారు. ఇలాంటి పండితుల సభలో అశ్వరుడు అనే మహర్షి యజ్ఞవల్కుణ్ణి ప్రశ్నిస్తూ వచ్చాడు. "దేవతలు ఎంతమంది ఇక్కడ" అని ప్రశించాడు. యాజ్ఞవల్కుడు ఇక్కడ అనే పదమును ఆధారముగా తీసుకొని 3306 అని చెప్పాడు. ఇంతమంది దేవతలు ఇక్కడ ఉన్నారా? అని సభ అంతా ఆశ్చర్యపోయింది. యాజ్ఞవల్కుని ఉద్దేశ్యమేమిటి. ఆ సభలో పాల్గొనిన ప్రతి వ్యక్తి దైవ స్వరూపుడేనని అతని అభిప్రాయం. దైనం మానుష రూపేణ . ఆనాడు వారు ప్రతి వ్యక్తిని భగవత్ స్వరూపుడుగానే భావించేవారు. తిరిగి మరొక ప్రశ్న వేశాడుఅశ్వరుడు . ఈ 3306 దేవతల లోపల కొంతవరకు తగించడానికి వీలుంటుందా యజ్ఞవజవల్కా? అని ప్రశ్నించాడు. తప్పకుండా తగ్గించవచ్చునన్నాడు యాజ్ఞవల్కుడు అయితే ఎంతమంది దేవతలు? అక్కడ ఇక్కడ" అనే పదములేదు 33 మంది దేవతలున్నారని సమాధానం చెప్పాడు యాజ్ఞవల్కుడు. వారిని గురించి వివరించ మన్నారు. ఆశ్వరుడు. వసువులు-8, రుద్రులు-11, ఆదిత్యులు-12. ఇంద్రుడు, ప్రజాపతి - వీరందరూ చేరితేమొత్తం 33 మంది అని చెప్పాడు. అయితే సరియని సభలోని వారందరూ తలలూపారు. ఇంతలో "గార్గి" లేచి పండితోత్తమా! వీరిని కొంతవరకు తగ్గించడానికి సాధ్యమా" అని అడిగింది. తప్పక సాధ్యమవుతుందని చెప్పి ఆరు మంది" అన్నాడు యాజ్ఞవల్కుడు. ఎవరు? అని అడిగారు. అప్పుడు 1. అగ్ని 2 పృధ్వి 3 వాయువు 4 ఆదిత్య 5 అమరత్వము 6. అధ్వరము - ఈ ఆరుమంది నిజమయిన దేవతలని చెప్పాడు. తిరిగి అశ్వరుడు లేచి ఈ ఆరుమందిలో కొంతవరకు తగ్గించవచ్చునా? అని అడిగాడు. తప్పక తగ్గించవచ్చునని యాజ్ఞవల్కుడు చెప్పి వారు ముగ్గురు మాత్రమేనని, వారే భూత భవిష్యత్తు వర్తమాన కాలములని పేర్కొనివాడు. వీరిని కూడా ఏమైనా తగ్గించ వచ్చునా? అని అడిగారు. అప్పుడు యాజ్ఞవ ల్కుండు రెండు అని చెప్పి అన్నము, ప్రాణము అన్నాడు. అయితే ఈ రెండులో ఏమైనా తగ్గించవచ్చునా? అని అడిగారు. అప్పుడు యాజ్ఞవల్కుడు1 1/2 దేవుడన్నాడు. దీని అర్థమేమిటని అడిగారు. గాలి సర్వ పదార్థముల యందునూ యిమిడి ఉంటున్నది సర్వత్రానిండినటు వంటి ఈ గాలికి అద్వర్తము" అన్నాడు. "అద్వర్తము అనగా 1 1/2 అని దీని అర్థము. అయితే ఈ 1 1/2 నుంచి కూడా ఏమైనా తగ్గించవచ్చునా? అని అడిగారు. తగ్గించవచ్చునని చెప్పి ప్రాణము ఒక్కటే అని యాజ్ఞవల్కుడు చెప్పాడు. అన్ని రకములుగా ఆలోచించిన తరువాత కట్టకడపటికి “ప్రాణము" అనేటటువంటిది ఒక్కటే అంత్యదేవుడుగా నిలిచాడు.
ఈ ప్రాణతత్త్యము ఎక్కడ ఉంటున్నది? ప్రాణమునకు ఒక స్థానము, ఒక కాలము, ఒక దేశములేదు. సర్వత్రా ఉంటున్నది. ఇట్టి సర్వత్రాఉండినటువంటి ప్రాణ ప్రతిష్ఠనే ప్రధానమైన యజ్ఞము అన్నాడు. యజ్ఞమనగా ఏమిటి? కేవలం ఒక హోమంలో సమిధలను అర్పించడమేకాదు. యమ నియమాదులతో ఆచరించడమే "యజ్ఞము" అన్నారు. ఈ జ్ఞానమంతా కేవలం భౌతికమైన జ్ఞానమేనన్నారు. యమనియమాదులు ఆచరించేది దేహముతోనే. దేహము ఆనిత్యమైనటువంటిది నీటిబుడగ వంటిది కనుక ఇది సత్యమెట్లా అవుతుంది?
ఇంక జ్ఞానము అంటున్నారు. ఈ జ్ఞానము కూడనూ నిజమైన జ్ఞానము కాదు. అజ్ఞానముతోకూడిన జ్ఞానము అన్నారు.’ జ్ఞా’ జ్ఞానము, -న= కాదు. జ్ఞానము కానిది. ఇది జ్ఞానము కాదని అర్థము. ఏది జ్ఞానం? ఆత్మజ్ఞానమే జ్ఞానము. కేవలం ఇంద్రియములచేత, తెలివితేటలచేత అనుభవించేటటువంటి జ్ఞానములన్నీ మిథ్యాజ్ఞానములే. జీవదేవుడేననే టటువంటిది ఎండా నీడలవలె వుంటున్నాది ఎండవుంటేనే నీడ. నీడలో కూడా ఎండ ఉన్నది. కనుక ఈ రెండింటి యొక్క తత్త్వమే ఈ జగత్తు. దీనినే ద్వైతము అన్నారు. ఈ జగత్తంతా ద్వైతస్వరూపమే. ఈ ద్వైత స్వరూపమైనటువంటి జగత్తునందు, ఎట్టి జ్ఞానము మనం సంపాదించినప్పటికినీ - ఇవి అజ్ఞానము క్రిందనే రూపొందుతాయి. ఈ జ్ఞానము అనేక వాదోపవాదములకు పనికి వస్తుంది. తర్కములకు ఉపయోగిస్తూ వుంటారు. "వాదేవాదేవజతే వైరం "ఈ వాదనవలన వైరం పెరుగుతూ వుంటుంది. వాదన కానిది బేధము లేనిది, రెండోది కానిది, తేజస్సు వెలుగునది, సర్వత్రా వ్యాపించునది - అదియే నిజమైన ఆత్మజ్ఞానము. అట్టి ఆత్మజ్ఞాన నిమిత్తమై ప్రాచీన కాలమునందు మహర్షులు యజ్ఞయాగాదులు సలుపుతూ వచ్చారు. మానవుని యొక్క ఉనికిని గుర్తించే నిమిత్తమై యజ్ఞములు ఆచరిస్తూ వచ్చారు. జీవిత పరమావధిని తెలుసుకొనే నిమిత్తమై యజ్ఞములు ప్రారంభించారు. అయితే ఈనాడు ఏదో ఒక లలితాసహస్ర నామమో, విష్ణుసహస్రనామమో, ఏదో ఒక పారాయణమో చేసుకుంటూ- ఇదే యజ్ఞములోపల కాలమును సార్థ కం చేసుకున్నట్లుగా భావిస్తున్నాం. ఇవన్నీ చేయదగినవే అయితే మనం దీనివలన అందుకొనేది ఏమాత్రం లేదు. అప్పటికప్పుడు తాత్కాలిక ఆనందమును అందుకోవచ్చును. శాశ్వతానందమును పొందటానికి ఇవి ఏమాత్రం కారణం కావు తనలో తాను ఆత్మతత్త్వమును చక్కగా విచారణ సలిపి, విమర్శించి, పరిశోధన సలిపి, పరిశీలించి దానిని పరతత్త్వoగా అనుభవించాలి. ఇదియే నిజమైన ఆత్మ జ్ఞానం. కనుక ఇట్టి ఆత్మజ్ఞానము కోసం ఏ గ్రంథములూ మనం చదువనవసరం లేదు. కాని అనుభవజ్ఞుల ద్వారా కొంతవరకు సత్యమును గుర్తించి, దానిని సాధనలో నిమిడ్చి, మన స్వప్రయత్నంచేతనే దీనిని సాధించాలి.
(శ్రీన.93.పు.51/52)
(చూ|| అంతరార్థము, ఉత్తరాయణము, జన్మద్యస్యయతః, జ్యోతిశ్చరణాభిదానాత్.,చదువు. ప్రాణస్తథానుగమాత్, యాంతేమతిస్సాగతిః, విద్యుల్లేఖ్ వభాస్వరా, సంకల్పము, హిరణ్యగర్భతత్త్వం)