ప్రాచేతసుడనగా ఎవరు? వాల్మీకి. ఇతనికి ప్రాచేతసుడనే పేరు ఎట్లా వచ్చింది? వరుణునకు ప్రాచేతన అనేది మరొక పేరు. నిరంతరము దైవచింతనచేత తనను, తన దేహాన్ని మరచాడు రత్నాకరుడు. శరీరం పైన పుట్టలు పెరిగాయి; అతని రూపము మరుగైపోయింది. అప్పుడు వరుణుడు కుంభవృష్టిని కురిపించాడు. దాంతో అతని శరీరం పైన పుట్టలుగా ఉన్న మట్టి కరిగిపోయింది. తద్వారా వాల్మీకి బయటపడ్డాడు. ఈ విధంగా వరుణుని అనుగ్రహం చేత బయటకు వచ్చినవాడు కనుకనే, ఇతనికి ప్రాచేతనుడు అని పేరు వచ్చింది. ఈ ప్రాచేతమనే శ్లోకదాతగా మారి లోకదాతయైన రాముని చరిత్రము జగత్తుకు అందించాడు. ఈనాటి మానవుడు కూడా తనకు అంటుకున్న అహంకార మమకారములనే మట్టిని దైవచింతనచేత ఏనాడు వదల్చుకొనునో ఆనాడే తాను పవిత్రుడు కాగలడు.
(స.సా.ఏ.96 పు.94)