ప్రశ్నోపనిషత్తు అథర్వణ వేదాంగము. ప్రశ్న ప్రతి వచన పూర్వకముగా విషయ వివరణము చేయబడుటచే ప్రశ్నోపనిషత్తని పేరు వచ్చింది. ముండకోపనిషత్తునందు సంక్షిప్తముగా ఉదహరింపబడిన కొన్ని విషయములను విస్తరించుటచేత, ప్రశ్నోపనిషత్తు అర్ధానికి వ్యాఖ్యాన మగుచున్నది. విద్య పరమనియు, అపరమనియు రెండు తెఱంగెలని ముండకము తెలిపెను. అపరవిద్యకర్మ, ఉపాసనమని రెండు భాగములు. ఈ రెండింటిలో ఉపాసము రెండవ మూడవ ప్రశ్నలయందు విచారింప బడినది. కర్మ విధాన మంతయూ కర్మకాండ యందువిస్తరింపబడి యుండుటవలన ఇచట ప్రస్తావింపబడలేదు. కర్మోపాసనలు రెండును నిష్కామముగా ఆచరించిన వైరాగ్యహేతువు అగుచున్నది. ఈ విషయము ఈ మొదటి ప్రశ్చయందు వివరింపబడినది. ముండకమును చదివిన పిదప ప్రశ్నోపనిషత్తును చదివిన విషయము విశదము కానేరదని తెలిసికొని నిత్యఫలదమగు పరబ్రహ్మను వెదక గోరి వీరు, పిప్పలాదుడను యోగ్యుడగు గురువును ఆశ్రయించిరి. అపర బ్రహ్మవరులగు వీరు స్వస్వరూపమే ఆత్మయని గుర్తెరుంగలేక పోయినవి "అన్వేషమాణా" యను పదముచే సూచింపబడుచున్నది. నిత్యము అద్వితీయమగు పరబ్రహ్మము గురుశాస్రైకవేద్యము. "సమిత్పాణి" యన గురువునకు ప్రియమైనట్టియు, అతని ఆశ్రమమునకు యోగ్యమైనట్టియు, అగు కానుక చేతపట్టుకొనిన వాడని అర్థము. వీరులకు పిప్పలాదుడు చెప్పిన ప్రతివచన మేమన పరమరహస్యము, గోప్యము అగు బ్రహ్మవిద్య, యోగ్యతలేనివానికి ఉపదేశ్యము కాదు. కనుక క్రొత్తగా వచ్చినవారి యోగ్యతను తెలిసికొనుటకై పిప్పలాదుడొక సంవత్సరము గడువు పెట్టెను. సంవత్సరము గడువు పూర్తి అయిన తర్వాత కాత్యాయనుడు పిప్పలాదుని, దేనివలన ప్రజలు పుట్టుచున్నారు? అని ఆడిగెను. ప్రజలందు కోరికగలవాడు ప్రజాకాముడు. తననే ప్రజా రూపమున సృష్టించుకొను కోరికయే ప్రజా కామము. పరమాత్మకంటే భిన్నుడు కానట్టి హిరణ్యగర్చుడే ప్రజాపతి. ఈ కల్పము నందు హిరణ్యగర్భుడు ప్రజాపతియై, తరువాత ప్రజాకాముడయ్యెను. ఇతడు జన్మాంతరమున అనుషించిన అపరవిద్యాకర్మ సముచ్చయ సంపన్నుడు. తత్కృతమగు స్థానము నుద్భుద్ధము చేసికొని యాత్పాదనము చేసెను. ఇదియే అతడొనర్చిన తపము.
(ఉ.వా.పు. 43/44)