విద్య తలకు సంబంధించినది, వైద్యము గుండెకు సంబంధించినది. నీరు ప్రాణసమానమైనది. ఈ మూడు సౌకర్యాలను ప్రజలకు సమకూర్చేవాడే అందరికంటే గొప్పవాడు. అలాంటివాడు దేవుడనే చెప్పవచ్చు. మానవునికి సత్కర్మలు చాల ప్రధాన మైనవి. కనుకనే, నేను మిమ్మల్ని సమాజ సేవలో పాల్గొనమని చెపుతుంటాను. మీరు సమాజంలో పుట్టారు. సమాజంలో పెరిగారు. సమాజం ద్వారా విద్య నభ్యసించారు. సమాజం ద్వారా ధనము నార్జించారు. సమాజం ద్వారానే ఆనందాన్ని అనుభవిస్తున్నారు. కనుక, సమాజానికి తగిన కృతజ్ఞత చూపడం మీ ప్రథమ కర్తవ్యం. సత్కర్మల నాచరించినప్పుడే మీరు సమాజానికి కృతజ్ఞత చూపినవారౌతారు.
(స.సా.మే.2000 పు.132)
పరమాత్మ యొక్క సత్య బోధనలను ప్రేమతత్త్వమును అనుభవించి, ఆనందించి, జగత్తునకు చాటడమే మానవుని ప్రధాన కర్తవ్యం. భగవత్తత్త్వాన్ని ప్రచారం చేసిన మానవునికే మెస్సెం జర్ ఆఫ్ గాడ్ అనే పేరు సార్థకమవుతుంది.భౌతికమైన, లౌకికమైన, అనిత్యమైన విషయాలను ప్రచారం చేసేవారు భగవంతుని మెస్పెంజర్లు కానేరరు.
జీసస్ పుట్టినప్పుడు ముగ్గురు అరేబియన్ రాజులు వచ్చారు; ఆ బిడ్డను చూసి చాల ఆనందించారు. తిరిగి వెళ్ళే సమయంలో మొదటి రాజు చెప్పాడు మేరీతో - "అమ్మా! నీ గర్భమునందు భగవంతుని ప్రేమించేవాడు పుట్టాడు" అని. రెండవ రాజు "అమ్మా, మేరీ! నీ కుమారుణ్ణి భగవంతుడు ప్రేమిస్తాడు" అన్నాడు. మూడవ రాజు "అమ్మా! భగవంతుడు నీ కుమారుడు వేరు కాదు . ఇరువురూ ఒక్కటే" అన్నాడు. ఈ మూడింటి అంతరార్థమును గుర్తించి వర్తించినప్పుడు సత్యము సుస్పష్టంగా మనకు గోచరమవుతుంది. భగవంతునిప్రేమించేవాడు "మెస్సెం జర్ ఆఫ్ గాడ్" (భగవంతుని దూత): భగవంతునిచేత ప్రేమింపబడే వాడు “సన్ ఆఫ్ గాడ్" (భగవంతుని కుమారుడు) ఇరువురి ఏకత్వాన్ని గుర్తించినప్పుడు తండ్రి, కుమారుడు ఒక్కటే అవుతారు.
(స. సా. జ.99పు.1/2)
ఒకవైపున యింద్రియములు మరొక వైపున విషయములతో కూడిన గుణములు - ఈ రెండిటిని అభివృద్ధి గావించుకోవటమే విద్యావంతుని ప్రధాన కర్తవ్యము. (బృత్ర.పు. 53)