మీకు నిత్యజీవితంలో కొన్ని అనుభవములుండ వచ్చును.
(ప్రే.జో.పు.273)
పెట్రోమాక్స్ లైటికి ఎంత పంపుకొట్టినప్పటికిని, అప్పుడప్పుడు దానికి పిన్ను త్రిప్పాలి. అందులో కొంత కిరసనాయిలు కూడా పోయాలి. కిరసనాయిలు అనేది మన శ్రద్ధ, మన ప్రేమయే పిన్ను. మన విశ్వాసమే పంపు. ఈ మూడింటితో పాటు దివ్యమైన నామమునే వత్తి లైటుకు ఉన్నప్పుడే, దివ్యప్రకాశాన్ని ఇతరులకు అందించడానికి వీలు ఏర్పడుతుంది. ఈ ఉదాహరణ నుండి గురువులు స్ఫూర్తిని గైకొని, దివ్య ప్రకాశమును బాలబాలికలకు అందించి, వారిలో ఉన్న అజ్ఞానమునుపారద్రోలాలి. ఈ మహత్తర ప్రయత్నం సఫలీకృతం కావాలంటే మొట్టమొదట గురువులకు శ్రద్ధ ఉండాలి. పిల్లలలో చదువు మీద శ్రద్ధము కలుగజేయాలి. తరువాత గురువులు ప్రేమతో పిలిస్తే పిల్లలు దగ్గరకు వస్తారు.ప్రేమతో బుజ్జగిస్తే మాట వింటారు. కోపంతో దెబ్బ కొడితే దూరంగా పోతారు. కనుక బాలబాలికల మీద ప్రేమ జల్లులు కురిపించాలి. వారిలో ప్రేమ బీజములు నాటాలి. పిల్లలలో విశ్వాసాన్ని కలుగ జేయాలి. విశ్వాసం లేనివాడు ఎందుకూ కొరగాకుండా పోతాడు. తన శక్తి మీద తనకు విశ్వాసం ఉండాలి. భగవంతుని మీద విశ్వాసం ఉండాలి. శ్రద్ధ, ప్రేమ, విశ్వాసములతో పాటు భగవన్నామం మీదకు బాలబాలికల దృష్టిని మరల్చాలి. "భగవన్నామమే, భవసాగరమును దాటించే నావ.” ఈ నాలుగు సద్గుణాలను బాలబాలికలలో పెంపొందించటానికి గురువులు కృషి చేయాలి.
(శ్రీ. జూ .97 పు.58)