ఈనాటి పిల్లలు చెడిపోవటానికి మూలకారణమైన మరొక విషయాన్ని ఆడవారికి చెప్పాలి. ఈనాడు సైన్సు అభివృద్ధి చెందుట వలన మనుషులు చేయవలసిన పనులన్ని యంత్రములే చేస్తున్నాయి. ఒక్క "కుక్కర్" లోనే అన్నం, సాంబారు మొదలైన వన్ని తయారైపోతున్నాయి. ఇంక వారేమీ శ్రమ పడనవసరము లేదు. అయితే, కనీసం తమ పిల్లలనైనా తాము చూసుకోవడం లేదు. పిల్లలు పుట్టిన తరువాత ఆ పిల్లలను ఆయాకు అప్పచెప్పి ఉద్యోగాలకై ఆఫీసులకు తాము వెళ్ళిపోతుంటారు. ఈ ఆయా ప్రేమ సంబంధంలోనే బిడ్డ పెరుగుతాడు. క్రమక్రమేణా పిల్లవాడు పెరిగి పెద్దవాడైన తరువాత, ఆ బిడ్డకు తల్లి సంబంధమైన బాంధవ్యమే ఉండదు. తల్లి స్పర్శ, సంభాషణ దృష్టి తన పిల్లల పైన ఉంటుండాలి. కనుకనే పూర్వకాలమందు చిన్న బిడ్డలకు 24 గంటల పాటు తల్లియే పాలిచ్చేది, తన దగ్గర పడుకోబెట్టుకునేది. ఈ విధమైన దర్శన, స్పర్శన, సంభాషణలు బిడ్డకు తల్లితోనే జరుగుతండేవి. అయితే, ఈ ఆధునికి పరిస్థితి ఎట్లున్నదంటే, బిడ్డను కనడం మాత్రమే తల్లి వంతు, పోషించడం మాత్రం ఆయా వంతు. ఈనాటి వారు తమ పిల్లలను ఆయాలతోపాటు బీచ్ లకు, పబ్లిక్ పార్కులకు పంపిస్తున్నారు. ఈ చిన్న పిల్లలు కార్లలో వెళ్ళుతున్నప్పుడు ఆయాడ్రైవరు మాట్లాడుకునే విషయాలను వింటారు. ఈ విషయాలే పిల్లలకు అలవడిపోతాయి. ఈ ఆయా చేసే పనులనే ఈ పిల్లలు నేర్చుకుంటారు. కట్టకడపటికీ, ఆయా మరణిస్తే పిల్లవాడు ఏడుస్తాడు గాని తల్లి మరణిస్తే ఏడ్వడు. కారణం ఏమిటి? ఆ పిల్లవానికి తల్లితో సంబంధం లేదు. కనుక, వానికి దుఃఖము ఎట్లు కలుగుతుంది? అందుచేత తల్లి తన పిల్లలను వేరు చేసుకొనరాదు.
(శ్రీ భ.ఉ. పు. 132)
పిల్లలు మొదటి ఐదు సంవత్సరాలు తల్లిదగరే పెరగాలి. చాలామంది పిల్లలకు తల్లి ప్రేమ తెలియదు. ఆ వయసులో తల్లి పిల్లల పెంపకాన్ని మరొకరికి ఇచ్చి తాను కేవలం "మమ్మీ" అని పిలవబడుతూ పిల్లలు ఆడుకొనే బొమ్మవలె ఉండకూడదు. ఈనాడు ధనవంతుల పిల్లలు, విద్యావంతులైన తల్లిదండ్రుల పిల్లలు అంగవికలుర వలె బాధపడుతున్నారు. వారికి తల్లి దండ్రుల రక్షణ, ప్రేమ తెలియదు. వారిని సేవకులకు, ఆయాలకు అప్పజెప్తే, పిల్లలు వారి మధ్య పెరిగి వారి మాటలు, వారి అలవాట్లు వారి ఆలోచనా విధానాలు నేర్చుకొంటున్నారు.
పిల్లవానికి ఐదు సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాత అతని బాధ్యతమ తండ్రి చేపట్టాలి. తండ్రి అతనిని గురువుకు అప్పగిస్తాడు. గురువు అతనికి జీవితపు విలువలను నేర్పుతాడు. అధ్యాపకులు తమ అదృష్టమును గ్రహించి దానితోపాటు తమ విధులను గుర్తించాలి. కొందరు అధ్యాపకులు తమ విధులను తాము నిర్వర్తించకుండగా సమాజానికి హాని చేస్తున్నారు. వారు క్లాసులోకి రావటము, బ్లాక్ బోర్డుమీద వ్రాయటము, "నిశ్శబ్దం" అనటము, కుర్చీలో కూర్చొని నిద్రపోవటము చేస్తుంటారు. దానివల్ల పిల్లలకు స్కూలు అంటే ఇష్టము పోతుంది.
పిల్లలు నూతన వస్త్రము వంటివారు. వారికి ఏరంగు కావాలంటే ఆ రంగు చేయవచ్చు. వారిని రంగులో ముంచితే చాలు. పెద్దవాళ్ళు పాతవస్త్రము వంటివారు. వారిని రంగులో ముంచినా ఆ రంగును తేలికగా పొందలేరు. మృదుహృయులు చెప్పింది. వెంటనే గ్రహించగలుగుతారు.
పెద్దవాళ్ళు ఒక విధమైన సిగ్గుతో, గర్వంతో, కృత్రిమంగా, దర్పంగా ఉంటారు. పొరపాట్లు చేస్తూ క్షమాపణలు కోరుకుంటారు. పిల్లలు ఆవిధంగా ఉండరు. పిల్లలు అందర్నీ నమ్ముతారు. అందరూ పిల్లల్ని నమ్ముతారు. వారు గ్రామఫోన్ రికార్డుల వంటివారు. మీరు ఎటువంటి పాటపాడినా వారు ఇష్టపడతారు. వారు తిరిగి అదే రకంగా పాడి వినిపిస్తారు. దానికున్న సూదియే ప్రేమ. అది వాడిగా ఉండాలి. అప్పుడే సంగీతం వస్తుంది. పెద్దవాళ్ళ విషయంలో ఆ సూది మొద్దుబారి ఉంటుంది. పిల్లలకు ఏకాగ్రత వరం వలె ఉంటుంది. వారు నిర్భయులై ఉంటారు. పెద్దవాళ్ళే వారికి భయం నేర్పుతారు. పిల్లలు సత్యమే పలుకుతారు. కాని పెద్ద వాళ్ళు వారికి అబద్ధాలాడటం నేర్పుతారు. పిల్లల్ని కొన్ని విషయాలు గమనించి చెప్పమని పెద్దవాళ్ళు అంటారు. దానివల్ల పిల్లలకు ఇతరులలో చెడును, దోషాలను చూడటంలో ఆసిక్తి ఏర్పడుతుంది.
పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు వారు మాట్లాడేది నిజమో అబద్దమో చెప్పలేము. కాని పిల్లలు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. కపటంగా మాట్లాడితే తాత్కాలికంగా ప్రయోజనం కలుగుతుందని వారికి తెలియదు. నిజానికి కపటం లేకుండా మాట్లాడితేనే ఆలస్యంగానైనా చక్కని ప్రయోజనం కలుగుతుంది. అందుకనే మీరు భగవంతుని అనుగ్రహం పొందటానికి చిన్నపిల్లలవలె అమాయకులుగా నైనా ఉండాలి. లేకపోతే మంచి విద్యావంతులై విచక్షణా జ్ఞానంతోనైనా ఉండాలి. ఇందుకు చక్కని ఉదాహరణము ప్రహ్లాదుడు. అతనికి ఏమాత్రమూ అహంకారము లేదు. విషము అమృతము రెండూ కలపకూడదు. సత్ని సత్తోనే కలపాలి. ప్రకృతి బ్రహ్మమయం. బ్రహ్మము ప్రకృతి మయం! వస్త్రము దారముల మయం. దారము వస్రమయం. ఒకటి లేకుండా ఒకటి లేదు. పిల్లవాని దశ స్వచ్చమైన సత్ దశ. మీరు ఆ విధంగా అదే అమాయకతతో శుక మహర్షి వలె ఉండగలిగితే మీరు చాలా సహజంగా భగంతునిలో లీనం కావచ్చు. సూర్యకిరణాలు మీ తలుపు బయట నిశ్శబ్దంతో, ఓర్పుతో ఎదురు చూస్తుంటాయి. మీరు తలుపులు కొంచెం తెరిస్తే చాలు. ఆ సందులో నుంచి అవి ఆనందంగా లోపలకు ప్రవేశిస్తాయి. తలుపు బాగా తెరవండి. మీరు కాంతలో, వెచ్చదనంలో స్నానం చేయవచ్చు. పిల్లల మనస్సులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. వారు తలుపులు వేయరు. అందువల్ల వారిలోపల చీకటి ఉండదు. అందువల్లనే దుఃఖముతో నిండిన ఇంట్లో వారి చిరునవ్వులు సూర్యకిరణాల వలె ఉంటాయి. ధ్రువుడు, మార్కండేయుడు భగవద్దర్శనంతో ముక్తి పొందారు. అది యెటువంటి కపటంవల్ల కాదు. వారు తమ మనస్సులను సాధనలో ముక్తికి ఉపయోగపడే దివ్యమైన ఉపకరణాలుగా మార్చుకున్నారు.
మీకు జీవితంలో కావలసింది ఏమిటి? ఆనందము, అనుకూలము. అన్యోన్యము. అనురాగము. అధికారి ఉద్యోగస్థుని మధ్య, యజమాని సేవకుల మధ్య, భార్యాభర్తల మధ్య, తండ్రీ కొడుకుల మధ్య హక్కులు విధులు ఉన్న ప్రతిచోట ఈ నాలుగూ అవసరమే. మీ పిల్లలు చిన్నవారుగా ఉన్నప్పుడే ఈ గింజలను వారి మనస్సులలో నా టండి. మీరు వారికి ఇవ్వదగిన గొప్ప వారసత్వ సంపద ఇదే. నిస్పృహ, నిరుత్సాహము, ఆసంతృప్తి మొదలైన వాటికి తగిన విరుగుడు ఇదే..
(వ. 61-62 పు.186/188)
తరువాత పిల్లలు క్రికెట్ కాని, ఫుట్ బాల్ కాని, టెన్నిస్ కాని ఆడేటప్పుడు వారు ఒకవేళ ఓడిపోయే పరిస్తితి ఏర్పడితే తప్పులు చెయ్యటం ఆరంభిస్తారు. ఆ విధంగా గెలిచినా అది ఓటమి క్రిందే లెక్క. శత్రుభావం లేకుండగా, ఎలాగైనా విజయం పొందాలని కాంక్షించకుండా ఉంటే వారు తప్పక గెలుస్తారు. ఒకరిని మరొకరితో పాల్చవద్దు. పోటీవద్దు. దానివల్ల పడిపోయే ప్రమాదం ఉంది. ఈ పాఠం కూడా పిల్లలకు బోధించండి పోటీ ఉంటే అది ఆరోగ్యకరంగా అసూయాద్వేషాలు అంటకుండగా కొన్ని నియమాలకు లోబడి ఉండాలి.
అన్నిటిని మించి పిల్లలు విలువైన సంపద అని గ్రహించండి. వారిని భగవంతుని సేవకులుగా, ఉత్తమ సాధకులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత మీకు ఉంది.
(వ. 61-62. పు. 189)
పిల్లలు కొండలోని గుండుబండలవంటివారు. తల్లి తండ్రులు గురువులూ ఆ బండలలో దాచియున్న సుందర దేవ విగ్రహములను ప్రకటింపజేసే శిల్పులు ఆత్మవిశ్వాసము, ఆత్మజ్ఞానము వీటివలన ఆ విగ్రహములకు తేజస్సు ఓజస్సు ప్రతిభ ప్రభావము ప్రతాపము చూకూరును. వేరే ఏ రీతిగానూ రాదు. తానెవరో తెలియక పరులను తెలిసికొనిన, వచ్చిన లాభమేమి? తన తత్వమేమి, తన నిజస్వరూపమేమి, తన గురియేమి అని తెలియని గురువు ఎట్లు ఆ పేరుకు అర్హుడు? తనలోని వ్యక్తి సామర్థ్యములను తెలిసికొనక, ఎన్ని ఆర్జించిన అందుకొనివ, అన్ని వ్యర్థమే; మస్తకములో పుస్తకములను చేర్చిన, జగత్తును మోసపరచవచ్చునే కాని తనను తాను వంచించుటకు వీలుకాదు. విద్యార్థులకు గురువులు ఆదర్శములుగా తోడ్పడాలి. ఉపాధ్యాయుని జీవితమే, శిష్యులకాయన అనుగ్రహించే పెద్ద సందేశము. అయితే, పిల్లలు అసత్యమార్గమున పట్టుటకు అబద్ధమాడుటకు, అపవిత్రతను ఆశించుటకు. ఇంటి లోని వాతావరణమే మూలకారణము. తాము ఆచరించక, పిల్లలకు బోధించుటకు తల్లితండ్రుల కధికార మేమాత్రమూ లేదు. మీరు కూడ, అందరినీ సమభావముతో చూడవలెను. పరుల బిడ్డలను మీ స్వంత బిడ్డలవలె, ప్రేమించవలెను. అధ్యాపకులకు సమచిత్తము, సమభావన, సమరస ప్రేమ ఇవి అత్యవసరము.
శిక్షణ క్రమమందు ఈనాడు లోపదోషములు నిండి యున్నవి. పిల్లలు సంపూర్ణముగా సుశిక్షితులు కానక్కర లేదట. నూరు నంబర్లలో 35 ఆర్జించిన చాలు, పూర్తి విద్యావంతులైనట్టే. వారిని ఆమోదించి ఆదరింతురు. డిగ్రీలనందింతురు. ఈ పద్ధతిననుసరించిన, విద్యార్థులు బాగుపడేదెట్లా? పెద్దలైన తరువాత, వారు సూటికి సూటయాభై తప్పులు చేస్తే ఆశ్యర్యమేమి? సూటికి 65 తప్పులు చేసిన కూడ వారికి డిగ్రీలు దొరకును కదా? కాబట్టి, తప్పులే వారికి అలవాటై పోవును, యువకులు కఠిన హృదయములలో దయారహితులుగా రాక్షసులుగా తయారగుచున్నారు. దీనికి పెద్దల దురభ్యాసములే, వారు నిరూపించే ఆదర్శములే మూలకారణము.
మీ బాలవికాస్ తరగతులకు వచ్చే పిల్లల తల్లితండ్రులకూ ఆధ్యాత్మిక మార్గమందు అభిరుచి కలుగునట్లు ప్రయత్నించాలి. తమ బిడ్డలపై ఇంత ప్రేమయును త్యాగమునూ ప్రసరింపవేయు గురువుల ఆదేశములకు వారు విలువనిత్తురో అని సందేహించనవసరము లేదు. మంచి మాటలతో ప్రేమభావముతో మీరు సంప్రతించిన వారు మీ సలహాలను స్వాగతింతురు.
(స.పా.జ.76 పు.258/259)
పిల్లలు వాళ్ళంతట వాళ్లుగా ఈ ప్రపంచము లోనికిరారు మీద్వారా వస్తారు. (పిల్లల పెంపకం రీటా బ్రూస్ ముందుమాట)
"పిల్లలే మన సంపదలన్నిటికంటే అత్యంత విలువైన - సంపదని గ్రహించండి. వారిని భగవద్భక్తిగల సేవకులు - గాను, ఆధ్యాత్మిక మార్గంలో పయనించే చిత్తశుద్ధిగల సాధకులుగాను తీర్చిదిద్దే గురుతర బాధ్యత మీపై ఉన్నది”. (పిల్లల పెంపకం రీటా బ్రూస్ ఉపోధ్ఘాతము)
సాయి ఆధ్యాత్మిక శిక్షణా తరగతులలో పిల్లల మనస్సులలో మానవతా విలువల బీజములు మొలకెత్తి దృఢంగా నాటుకుని నా అవసరమైన వాతావారణం గృహములలో ఏర్పడాలి. మానవతా విలువల బోనా కార్యక్రమం ఫలప్రదం కావాలంటే తల్లిదండ్రుల ఉత్సాహ ములు అత్యవసరం, తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న యిండ్లలోని పిల్లలకు, తల్లిదండ్రులలో ఉత్సాహం లేకుండా కేవలం పిల్లలను మొక్కుబడిగా ఈ తరగతులకు పంపించేయిండ్లలోని పిల్లలకు మధ్య వ్యత్యాసము చాలా స్పష్టంగా గోచరిస్తుంది. శ్రీ సత్యసాయి మానవతా విలువల బోధనా కార్యక్రమమును నిర్వహించే టీచర్లు, తల్లిదండ్రులలో ఈ కార్యక్రమమునందు ఆసక్తి, ఉత్సాహము పెంపొందించే బాధ్యతకూడా చేపట్టాలి. ఈ కార్యక్రమంలో ప్రారంభమునుండి తల్లిదండ్రులు సహకరించేటట్లు చేసి పిల్లల శక్తి, సామర్థ్యములు పెంచడానికి... వారి నైపుణ్యమును కూడా ఉపయోగించుకోవాలి. పిల్లలు తల్లిదండ్రులను గమనిస్తూ, వారిని అనుకరిస్తూ చాలా విషయాలు నేర్చుకుంటారు. అందువలన, తమ సత్ప్రవర్తన ద్వారా తల్లిదండ్రులు పిల్లల మనస్సులలో సరియైన ఆదర్శములను ప్రవేశ పెట్టాలి”. (పిల్లల పెంపకం రీటా బ్రూస్ పు7-8)
"తల్లిదండ్రులు , పిల్లలపై అమితమైన ప్రేమను కురుపిస్తారు . అయితే , దానితోపాటువాళ్ళను అదుపులో ఉంచడం కూడా అవసరం . పిల్లలపై ప్రేమ , క్రమశిక్షణ -రెండూ ఉండాలి" (పిల్లల పెంపకం రీటా బ్రూస్ పు117)
జీవితంలో వాళ్ళు నిర్వహించవలసిన పాత్ర కనుగుణంగా వాళ్ళను తీర్చిదిద్దండి (పిల్లల పెంపకం రీటా బ్రూస్ పు118)