మానవ జన్మ ప్రేమమయమైనదేగాని మానవుడు తన ప్రేమను ప్రాకృతమైన విషయాలలో ప్రవేశపెడుతున్నాడు. భగవంతునికి అనేకమంది అనేక పదార్థాలను అర్పితం గావిస్తుంటారు. కానీ నిజమైన భక్తుడు తన దేహాన్నే అర్పితం చేసుకుంటాడు. బలిచక్రవర్తి చేసినది. ఇదే! కనుకనే అతనికి మళ్ళీ జన్మయే లేకుండా పోయింది. మీ దేహమును భగవంతునికి అర్పితం గావించవలసిన పుష్పంగా మీరు భావించాలి. గాని మరో విధంగా భావించకూడదు. మీ జీవితమును సత్కర్మలచేత, సదాచారములచేత, సత్ప్రవర్తనచేత అనుభవించి కట్టకడపటికి దీనిని భగవంతునికి అర్పితం చేయాలి. దీనిని ‘పిండార్పణం అని అన్నారు.“దేహమునకు పిండము" అనేది ఒక పేరు. చాలమంది బ్రాహ్మణులు పిండార్పణ మంటే శ్రాద్ధకర్మలకు సంబంధించినదని భావిస్తున్నారు. అది పిండార్పణం కాదు. పిండమనగా దేహమే.దీనిని భగవదర్పితం గావించడమే పిండార్పణం. అదే మోక్షము, అదే ముక్తి.ఎందుకంటే ఎప్పుడైతే మీరు దేహాన్ని దైవార్పితం చేస్తారో అప్పుడు మీలో మోహం క్షయమై పోతుంది.
మోహక్షయమే మోక్షము. ఈ సత్యాన్ని గుర్తించి వర్తించినప్పుడు మీరెంతైనా ఆనందాన్ని అనుభవించవచ్చు. అయితే అట్టి పవిత్రమైన స్థితి వచ్చేంత వరకు దేహాన్ని కాపాడుకోవాలి. కర్తవ్యాన్ని నిర్వర్తించాలి, సత్యధర్మాలను ఆచరించాలి, త్యాగాన్ని పోషించుకోవాలి.
(స.సా.సె.98పు 234)