పూర్వం ఆడవారు ఇంటి ద్వారములకు పసుపురాసి, కుంకుమ పెట్టేవారు. వీటిలో ఉన్న యాంటీ సెప్టిక్ శక్తి క్రిములను ఇంటి లోనికి రానీయకుండా నాశనము చేస్తుంది. కాని, ఈనాడు "ఆ పసుపు ఎందుకు రాయాలి? పసుపుపచ్చనిరంగువేస్తే చాలదా?" అని భావిస్తున్నారు. ఈ రంగులో అలంకారమున్నది గాని, క్రిములను నాశనంచేసే శక్తి లేదు. కనుక పూర్వీకులు ప్రతి చిన్న విషయము నందు ఒక పవిత్రమైన ఉపయోగాన్ని అనుసరిస్తూ వచ్చారు.
ఇంతేగాకుండా, పూర్వం మన భారతీయ స్త్రీలు శరీరానికి పసుపు రాసుకునేవారు. కుంకుమ పెట్టుకొనేవారు. ఈ విధముగా చేయుట చేత, వారి ముఖము సువర్ణమయంగా రూపొందేది. ముఖముపై ఏమాత్రము వెంట్రుకలుండేవి కావు. అంతేగాక, పసుపు కుంకుమల యందున్న క్రిమిసంహారిక శక్తి క్రిములను నోట్లోకిగాని, ముక్కులోనికి గాని ప్రవేశించనీయకుండా కాపాడుతుంది. ఈనాడు "ఫేసుపౌడరు" వాడుకలోనికి రావడం చేత పసుపును ఎవ్వరూ ఉపయోగించుట లేదు. కనుకనే ఇస్నోఫీలియా , ఆస్తమా మొదలగు వ్యాధులకు గురియౌతున్నారు. ఆనాటి ప్రజలు ఆరోగ్యము, ఆనందము- వీటినే తమ జీవిత లక్ష్యంగా భావించారు. ఆరోగ్యముగా ఉన్నప్పుడే ఆనందము మనకు ప్రాప్తిస్తుంది. ఈ విధంగా పరిశీలిస్తే, భారతీయ సంస్కృతి యందు నిత్యజీవితంలో చేసే ప్రతి కార్యంలో ఏదో ఒక పవిత్రమైన అంతరార్థము గోచరిస్తుంది.
(స. సా. అ..91.పు.262)