రామప్రభువు కటాక్షించి తన పాదుకలను తీసి భరతున కిచ్చెను. సాదరముగ భరతుడు, పవిత్ర పాదుకలను తన హస్తములతో తీసుకొని శిరస్సుపై ధరించెను. రెండు నేత్రములనుండి గంగాయమునలవలే ఆనందజలము ప్రవాహముగా కారదొడగెను. భరతుని నోటమాట రాలేకపోయెను. ఇవి కరుణాసముద్రుడు ధరించిన పాదుకలు కావు. సకలజనుల ప్రాణములు రక్షించు రక్షలు, భరతుని స్నేహరత్నమును కాపాడునట్టి సంపుటము, రఘుకులమును రక్షించు రెండు కవాటములు. ఇవి సుకర్మలు చేయునట్టి రెండు హస్తములు. ఇవే లోకనేత్రములు. ఈ రెండు పాదుకలు మనవెంట వచ్చు సీతారాముల చిహ్నములు, అని వర్ణించుచూ గంతులు వేయుచున్న భరతుని ఆనందమును యెవ్వరున్ను వర్ణింపలేకపోయిరి.
(రా.వా.మొ.పు.358)