హనుమంతుడు రామలక్ష్మణులను సుగ్రీవునికి పరిచయం చేశాడు. సీత అపహరింపబడిన సంగతి తెలిపాడు. అప్పుడు సుగ్రీవునికి కొన్ని రోజుల క్రిందట వానరులు తమకు దొరికిందని తెలుపుతూ ఏదో ఒక నగల మూటను తెచ్చి ఇచ్చినట్లుగా గుర్తుకు వచ్చింది. తక్షణమే ఆ మూటను తెప్పించి రామలక్ష్మణుల ముందు ఉంచాడు. రాముడు, "లక్ష్మణా! ఈ నగలు సీతవేనేమో చూడు" అన్నాడు. లక్ష్మణుడు చూశాడు. కన్నీటి ధారలు కార్చాడు.
“నాహం జానామి కేయూరే
నాహం జానామి కుండలే
నూపురే త్వభిజానామి
నిత్యం పాదాంభివందనాత్ "
అన్నా! ఈ కంకణములు, కుండలములు ఎవరివో చెప్పలేను. కాని, ఈ కాలి అందెలు మాత్రం సీతమ్మ వారివే" అన్నాడు. రాముడు. "ఇది మాత్రం నీకెలా తెలుసు?" అని అడిగాడు. "అన్నా! ప్రతి ఉదయము ఆ తల్లికి పాదాభివందనము చేయటం నాకు అలవాటు. కనుక, కాలి అందెలను మాత్రం నేను ఎరుగుదును" అన్నాడు. చూశారా! సీతారామలక్ష్మణులు 13 సంవత్సరములు అరణ్యంలో కలసి జీవించినప్పటికీ లక్ష్మణుడు ఒక్కనాడైనా సీత ముఖం చూసి ఎరుగడు. ఆమె పాదములనే చూస్తూ ఉండేవాడు. లక్ష్మణుని ఇట్టి పవిత్ర ఆదర్శాన్ని విద్యార్ధులు చక్కగా గమనించాలి.
(శ్రీ భ.ఉ.పు. 74)