మన భారతదేశంలో 56400 కుగ్రామాలున్నాయి. ఈ పల్లెల పరిస్థితి చాలా విచారకరంగా దయనీయంగా ఉంది. పల్లెలలో ఉండే సోదర మానవులను ఆదుకొని తమస్థాయికి తీసుక రావటానికి పట్టణవాసులు సమాజ సేవా కార్యక్రమాలలో నిమగ్నులు కావాలె. ఈనాడేది చేసినా ఏది తలచినా స్వార్ధంతోనే. వ్యర్థులమై పోతున్నాము. ఇక పదార్ధము గుర్తించేది ఎప్పుడు? అనేక ఆశలు పెట్టుకొని మోసపోతున్నాము. వేదిక లెక్కి ఉపన్యాసాలు చేస్తున్నాము. కాని చెప్పినది చేయటం లేదే. "చెప్పవచ్చు కోటి; చేయరు ఒక్కటి"అందుకే "ఉత్తిష్ట జాగ్రత ప్రాప్య వరాన్ని బోధత” అన్నది. ఉపనిషత్తు. వేదికలెక్కి సోదరీ సోదరులారా అంటున్నాము. అందరం సోదరుల మనుకుంటున్నాము. కాని నిజమైన సోదరులే ఆస్తుల కోసం పోరాడుతూ సుప్రీంకోర్టుల వరకు పోతున్నారు. కనుక వట్టి మాటలుగా సోదరులమనుకోవటం కంటే అంతకంటే మిన్నయైన ఆత్మభావం పెంచుకోవాలి. దైవ పితృత్వమూ మానవ సోదరత్వమూ అప్పుడే సార్థకమౌతవి.
ఈనాడు పవిత్రమైన ఉగాది దినం. విందుభోజనాలు చేయటం కొత్త బట్టలు కట్టుకోవటంలో సరిపోదు నూతన సంవత్సరం. నూతనోద్యమం ప్రారంభించండి. పల్లెటూరి వారు అనేక బాధలు పడుతున్నారు. వాళ్లకు సరియైన వైద్య విద్యా సౌకర్యాలు లేవు. త్రాగడానికి మంచినీళ్లు లేవు. మరుగుదొడ్లు లేవు. తినడానికి తిండిలేదు. వాళ్ళకు ఈ సౌకర్యాలు కల్పించే సేవ చేసి దానిద్వారా దైవత్వాన్ని చూడండి. ఈనాడు శ్రమపడేవాడు కావాలె. వట్టిమాటలు చెప్పేవాడు కాదు. మనది భరతభూమి, కర్మభూమి, శ్రమపడటమేకర్మ. అప్పుడే ఇది కర్మభూమి ఔతుంది. భగవద్రతి కలిగినదే భరతభూమి. కనుక శ్రమించి పల్లెసీమల వారిని ముందుకు తీసుకవచ్చి భగవద్రతిని పొందండి. ఈనాడుమన బ్రతుకులు దారేషణ ధనేషణ పుత్రేషణ అనే ఈషణ త్రయంతో మలినమై పోయినవి. ధనం మానవుని మత్తుని ఉన్మత్తుని చేస్తుంది. ధనం అవసరమే, కాని దానికి ఒక హద్దు ఉండాలి.మితిమీరిన ధనం మతి హానిచేస్తుంది. ధనం సంపాదించటం కంటే సంపాదించిన దానిని ఖర్చు పెట్టడం కష్టం. మిగిలిన ధనాన్ని దాచటం మరీ కష్టం. ఈ కష్టాలలో కొన్ని సుఖాలు లేకపోలేదు. కనుక ఈ ధనాన్ని పల్లెసీమల వారికీ దీనులకు వెచ్చించి సద్వినియోగం చేయండి. ధన మూలం మిదం జగత్ కాదు. ధర్మమూలం మిదం జగత్. ధనం పెరిగితే పశువుకు కొమ్ములు పెరిగినట్లుఅశాoతి . ధనం వెంట దుఃఖం కూడా పెరుగుతుంది. ధనమున్న వానిని ఒకవైపు ప్రభుత్వము మరొకవైపు బంధువులు ఇంకొకవైపు దొంగలు బాధిస్తారు. ధనమున్నవాడు పడే బాధదైవానికి తెలుసు. పుత్రులకోసం ధనo ప్రోగుచేసిన వారు పుత్రుల మూలంగానే బాధలు పడుతున్నారు. కనుక దానధర్మాలు చేసి మీ ధనమును సార్థకం చేసి కొనండి. సత్యసాయి సంస్థలవారు ప్రతి పల్లె తిరిగి ఆ పల్లెటూరివారి జీవితాలను బాగుచేయాలి. సత్యసాయి సంస్థలవారికి ఇదొక క్రొత్త ఉద్యమము. నేను ప్రతి పల్లెకు వస్తాను. ప్రభుత్వం ఏమేమో అంటుంది. దానితో ప్రమేయం లేకుండా కుల మత జాతి వర్గ విచక్షణ లేకుండా సత్యసాయి సంస్థలు ఈనాటి నుండి పల్లెసీమల నుద్దరించే కార్యక్రమాలు చేపట్టి ప్రతి గ్రామం వెళ్ళి వారికి విద్యా వైద్య సౌకర్యాలు కల్పించవలెనని కోరుచున్నాను. ధ్యాన తపములు స్వార్ధానికి ఉపయోగపడుతాయి కాని త్యాగముచేత లోక కల్యాణం జరుగుతుంది. "త్యాగేనైకే అమృతత్త్వ మానశుః?" " అని త్యాగమును అందుకు ఉపనిషత్తులు మోక్షకారణముగా చెప్పినవి. కాన ఈనాటి నుండి సత్యసాయి సంస్థలవారు త్యాగం ప్రదర్శించి పల్లెలవారికి అనుకూలాలు కల్పించవలెనని కోరుతున్నాను. అంతో ఇంతో నీతి నిజాయితి ఇప్పటికీ పల్లెలలో మిగిలిఉన్నది. పట్టణాల్లో లేదు. కనుక డబ్బుగల వారంతా ఈ పల్లెటూరి వారిని అభివృద్ధి పరుస్తారని ఆశిస్తున్నాను.
పర్వదిన మంటే పాత తోరణాలు తీసివేసి కొత్త వైన పచ్చతోరణాలు కట్టుకొవటం కాదు. పాత దుస్తులు తీసివేసి కొత్తబట్టలు కట్టుకొనటం కాదు. ఇంతమాత్రం చాలదు. పాతభావాలు తీసివేసి కొత్త భావాలను ప్రోగు చేయండి. చేదు తీపి కలిపిన ఉగాది పచ్చడి కష్టసుఖముల సమత్వానికి చిహ్నం. పల్లె సీమల సేవ చేయడానికి చిన్నప్పటి నుండి పిల్లలకు, విద్యార్థులకు తరిఫీదు ఇవ్వాలి. మన దేశంలో ఈనాడు 255000మంది పిల్లలున్నారు. వీళ్ళల్లో 40 శాతం బిచ్చమెత్తుకుంటున్నారు. ఇట్టి కష్ట పరిస్థితుల్లో మనం ఊరకుండటం మంచిది కాదు. జప సాధవలు కట్టి పెట్టి మానవసేవే మాధవ సేవ అనే భావంతో త్యాగంతో శ్రమతో వాళ్ళను ఉద్దరించవలె. మీరంతా రాజకీయ కుల మత భేదాల కతీతంగా పవిత్రమైన భావనతో మీమీ శక్త్యనుసారం వీరికి సేవ చేయటమే ఈ నూతన సంవత్సర దీక్షగా పూనండి. ప్రతి సంవత్సరానికి స్వాగతమే. ప్రతి సంవత్సరానికి వీడ్కోలే. దుఃఖానికి సుఖానికి ఆత్మ విశ్వాసమే రక్ష. అది లేకపోతే మానవత్వం. క్షీణిస్తుంది. ఈ భావంతో సేవ చేస్తే మన దేశం ఇతర దేశాలకు ఆదర్శవంతంగా ఉంటుంది. మేము భారతీయులం అని చెప్పుకుంటాముగాని భారతీయ సంస్కృతిని ఏమి పోషిస్తున్నాము? ఆధ్యాత్మికాభివృద్ధికి ఆత్మవిశ్వాసమే ముఖ్యం. కనుక పల్లెల సేవే దైవ సేవగా భావిస్తారని ఆస్తూ ఆశీర్వదిస్తున్నాను.
(స.సా. అ..79పు.191/192)