భగవత్తత్త్యానికి ప్రాథాన్యత ఇచ్చినదే పర్వదినం. మీ ఇంటికి పాత తోరణాలు తీసి కొత్తతోరాణాలు కట్టినట్లుగా, పాతవస్రాలను త్యజించి నూతన వస్త్రాలను ధరించినట్లుగా, మీరు పాత, రోత గుణాలను త్యజించి పవిత్రమైన నూతన గుణాలను అలవర్చుకోవాలి.
(స.సాన.99.పు.289)
ఈనాటి పర్వదినములను కేవలము పర్వదినములుగా భావించి ఆనందించుచున్నారు. కాని పర్వదినముల యొక్క అంతరార్థము గాని, పర్వదినముల యొక్క గంభీరమైన పవిత్రతను గాని భారతీయులు కూడను ఈనాడు గుర్తించడం లేదు. మనం Holyday (పర్వదినం) కూడా Holiday (సెలవుదినం)గా గడపుతున్నాం . నిజానికి "హాలిడే" (సెలవుదినాలు)లు కూడా మనం "హోలిడే" (పవిత్రదినాలు)గ మార్పు చేసుకోవాలి.
మన పవిత్ర భారతదేశమునందు అన్ని పర్వదినములూ పండగలూ పరమాత్మని పురస్కరించుకొనియే ఏర్పడును. వాటిని ప్రజలు ఆచరించే క్రియలు, కర్మలు, పద్ధతులు అన్ని చాలా అర్థవంతముగనే ఉన్నవి. గృహములను పరిశుభ్రపరచుట ద్వారములకు పచ్చతోరణములు కట్టుట, నూతన దుస్తులతో అలంకరించుకొనుట, మాధుర్యాన్ని ఆరగించుట బంధుమిత్రులను ఆహ్వానించి ఆనందించుట మొదలగు సంప్రదాయములలో అంతరార్థములెన్నో ఉన్నవి.
పాతరోత భావాలను తిరస్కరించి, క్రొత్త దనము ఏర్పడి, ఆనంద జీవితమునకు ఉత్తేజమిచ్చి సుఖసంతోషాలకు స్వాగతము అందించేది వీటి అంతరార్థము. ఉత్తమ భావనలు ఆదర్శచర్యలు, స్నేహపూర్ణసఖ్య స్వభావములు, వీటిని అభివృద్ధి పరచుటయే పర్వదినముల యొక్క ఉద్దేశ్యము. లక్ష్యము. కాని ఈనాడు ప్రజలు పాయస, పరమాన్నములతోనే ఆహార విహారముల తోనే, ఆడంబర ఆరాట ములలోనే, పర్వదినములను అంత్యముగావించు దురభ్యాసమునకు లోనగుటవలన వారు ఎన్నో దురవస్థలకు గురి ఆగుచున్నారు.
(సా.ముందుమాట)
(చూ॥ వినాయకచవితి, పండుగలు, పల్లెసీమల సేవ)