మహారాజు పరీక్షిత్ చేతులు జోడించుకొని "మునిశ్రేష్ఠులారా, నాకొక సందేహము కలదు. దానిని తీర్చి నన్ను ధన్యుని గావింపు" డని కోరెను. అది యేదియో తెలుపమని ముని కోరగ, "మృత్యువాసన్నమైనవాడు యే కర్మ చేయవలనో తెలుపుడు." అని ప్రార్థించెను. అందుకు వక ముని లేచి, కాల వ్యవధియే యుండిన, యజ్ఞ, యాగ, తప, ధ్యాన, వ్రత, తీర్థ.దాన పూజార్చాదులు చేయు చుండుట మంచిదని తెలిపెను. మరొకరు జ్ఞానా దేవతుకైవల్య మనిరి. మరికొందరు “కర్మణ్యై వహి సంసిద్ధిః అనిరి. యింకా కొందరు భక్తి వశః పురుషః అనిరి.
(భా.వా. పు. 154/155)
పరీక్షిత్ మహారాజు (దిగంబర యువక ముని కుమారుడు మహాతేజోమయుడు దివ్యకాంతులతో నున్న శుకునకు) మోకరిల్లి, "ప్రభూ! మరణాసన్నమై, చావబోవుచున్నానని తెలిసికొన్నవాడు చేయవలసిన కార్యమేమి? చింతించ వలసిన చింతన యేమి? మరణమునకు తరువాత జననము కాకుండా వుండుటకు ఆసమయమున యెట్టి పద్ధతులను అవలభించవలెనో శెలవివ్వవలెను. ఇవి నన్ను ప్రస్తుతము వేధించుచున్న బాధలు. ఇప్పుడు పరమ పురుషార్థమేదియో కృపతో తెలుపమని పదే పదే ప్రార్థించెను." శుక మహర్షి. "రాజా! నీవు ప్రాపంచక విషయములనుండి చిత్తమును తొలగించి మనస్సును జగన్మోహనుడైన శ్రీహరి యందు నిలుపుము. నేను భాగవతత్త్వమును చెప్పెదను. హృదయపూర్వకముగ శ్రవణము చేయుము. ఇంతకంటే పవిత్రకర్మ, ఇంతకంటే పవిత్ర చింతన, ఇంతకంటే గొప్ప తపశ్శక్తి వేరొండు లేదు. నర తనువే ధృడమైన నావ, శ్రీహరి కథనే చక్కని చుక్కాని, సంసారమే భవసాగరము, నారాయణుడే సరియైన నావికుడు. ఈనాడు ఈ పవిత్ర సామగ్రి నీకు సంప్రాప్తమయి నీ సమీపముకే వచ్చినవి. నీ వడిగిన ప్రశ్న లోక హితార్థమైనదే గాని, వక వ్యక్తితో మాత్రమే చేరినదికాదు. విచారణ చేయవలసిన ప్రశ్నలన్నింటిలోనూ సర్వ శ్రేష్టమైనది ఆత్మతత్త్వము. సమస్త ప్రాణికోటికీ, అంత్యకాలము పరమ సత్యము. అది తప్పునది కాదు. అట్టి ధృడమైన సమయమున యెట్టి పురుషార్థము చేపట్టవలెనో అది ప్రతి ప్రాణికి కూడనూ ప్రధానమైన చుట్టము. దాని ననుసరించియే పునర్జ న్మము కలుగుచుండును. కాననీవడిగిన ప్రశ్న, నీకు కలిగిన సంశయము, లోకకళ్యాణ కార్యమే కాని నీ నిమిత్తము మాత్రమే కాదు! వినుము"..
(భా.వా. పు. 157/158)