విద్యార్థులారా! రామాయణమును మూడు విధములైన పేర్లతో వాల్మీకి ప్రచార ప్రబోధలుసల్పాడు. మొదటిది రామాయణం, రెండవది సీతాచరితము, మూడవది రావణవధ, “రామస్య ఆయనం రామాయణం".
“రాముని గురించి తెలిపేది భౌతికమైన రామాయణం. దీనిని అంతర్ముఖంగా విచారణ చేస్తే - ఇదే పరమాత్ముని కథ, రెండవది, "రామాయాః ఆయనం ఇతి రామాయణం", అనగా సీతాచరిత్రమును తెలుపునది రామాయణం.
ఇది బాహ్యమైనది.అంతర్ముఖంగా విచారిస్తే -ఇది జీవాత్మ చరితం. ఇంక మూడవది రావణవధ. ఇది బాహ్యమైనది. అంతర్భావములో ఇది అజ్ఞాన నాశనము. ఏతావాతా రామాయణమనగా పరమాత్ముని కథ, సీతాచరితమనగా జీవాత్మ కథ, రావణవధ అనగా అజ్ఞాననాశనము, పరమాత్మ, జీవాత్మల తత్వములను చక్కగా గుర్తించినప్పుడే అజ్ఞానము నాశనమవుతుంది. ర,అ,మ - ఈ మూడు అక్షరములలో ఉండిన అంతరార్థమేమిటి? ఒకటి సూర్య బీజము రెండవది చంద్ర బీజము, మూడవది అగ్ని బీజము. సూర్యబీజము అజ్ఞానాంధకారమును దూరం గావిస్తుంది. చంద్రబీజములోని తాపమును చల్లార్చు తుంది. హృదయానికి చల్లదనము చేకూర్చుతుంది. ఇంక అగ్ని బీజము పాపమును నాశనం చేస్తుంది.
(శ్రీ. భ. ఉ.పు.46)